G7 tariffs on India : G7 దేశాల సంచలనం.. భారత్‌పై టారిఫ్‌లు పెంచేందుకు రెడీ..!

యుక్రెయిన్‌పై యుద్ధం ఆపేందుకు రష్యాపై ఒత్తిడి తెచ్చేలా భారత్‌పై సుంకాలు విధించేందుకు జీ7 దేశాలు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

G7 tariffs on India : G7 దేశాల సంచలనం.. భారత్‌పై టారిఫ్‌లు పెంచేందుకు రెడీ..!

Updated On : September 13, 2025 / 11:51 AM IST

G7 tariffs on India : రష్యా నుంచి పెద్దమొత్తంలో చమురును కొనుగోలుచేస్తూ యుక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి నిధులు అందజేస్తున్నారని ఆరోపిస్తూ భారత ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50శాతం టారిఫ్‌లు విధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ట్రంప్ విధించిన టారిఫ్‌లతో సతమతమవుతున్న భారత్ పై జీ7 సభ్య దేశాలు కూడా టారిఫ్‌ల మోత మోగించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Also Read: Sushila Karki: నేపాల్‌కు కొత్త లీడర్.. తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి.. ఎవరీ సుశీల.. భారత్‌తో ఉన్న అనుబంధం ఏంటి..

యుక్రెయిన్‌పై రష్యా దాడులను ఆపేందుకు.. తద్వారా యుక్రెయిన్‌లో శాంతిని నెలకొల్పేలా అమెరికా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే రష్యాపై ఆంక్షలు విధించిన అమెరికా.. రష్యా నుంచి భారీ మొత్తంలో చమురును కొనుగోలు చేస్తున్న భారత్, చైనా వంటి దేశాలను లక్ష్యంగా చేసుకొని టారిఫ్‌లు విధిస్తోంది. ఈ క్రమంలో ఈయూ, జీ7 దేశాలు కూడా భారత్, చైనాలపై టారిఫ్‌లు విధించాలని డొనాల్డ్ ట్రంప్ పాలకవర్గం ప్రతిపాదనలు చేసింది. అయితే, అమెరికా ప్రతిపాదనకు జీ7 సభ్య దేశాలు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

రష్యాపై ఆర్థిక ఒత్తిడి తేవడానికి భారతదేశంపై 100శాతం సుంకాలను విధించాలని యూరోపియన్ యూనియన్ (ఈయూ)ను ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఈయూ దేశాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, తాజాగా.. ఇదే ప్రతిపాదనలను ట్రంప్ జీ7 సభ్యదేశాల ముందు ఉంచారు. అయితే, శుక్రవారం కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపైన్ అధ్యక్షతన జీ7 దేశాల ఆర్థిక మంత్రులు వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో వారి మధ్య సుంకాల విధింపుపై చర్చ జరిగింది. రష్యాపై ఒత్తిడిని పెంచడానికి ఆ దేశం నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలపై సుంకాల విధించే విషయంలో సాధ్యాసాధ్యాలపై ఈ సమావేశంలో చర్చించారు.

రష్యా నుంచి చమురు కొనుగోలుచేసే దేశాలపై సుంకాలు విధించడంలో అమెరికాతో కలిసిరావాలని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ జీ7 సభ్య దేశాల ఆర్థిక మంత్రులను కోరారు. ఈ మేరకు బెసెంట్, అమెరికా వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్ సమావేశం తరువాత విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. యుక్రెయిన్ యుద్ధం ముగించడానికి నిజంగా కట్టుబడి ఉంటే రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు ముందుకు రావాలని, భారత్, చైనాసహా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై టారిఫ్ లు విధించాలని యూఎస్ వాణిజ్య మంత్రి స్కాట్ బెసెంట్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా యుద్ధం ముగింపునకు కట్టుబడి ఉన్నామంటూ జీ7 సభ్యదేశాలు అమెరికాకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. అమెరికాతో కలిసి జీ7 సభ్య దేశాలు కూడా నిర్ణయాత్మక చర్యలు చేపడుతాయని ఆశిస్తున్నామని జామిసన్ గ్రీర్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

మరోవైపు అమెరికా, చైనా దేశాల మధ్య టారిఫ్‌ల విషయంలో చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. యూఎస్ వాణిజ్య మంత్రి స్కాట్ బెసెంట్ మాడ్రిడ్‌కు మరో రౌండ్ చర్చలకోసం వెళ్లనున్నారు. చైనా వైస్ ప్రీమియర్ హీ లిఫెంగ్‌తో చర్చలు జరపనున్నారు. ఈ చర్చల్లో వాణిజ్య సమస్యలు, చైనా యాజమాన్యంలోని టిక్‌టాక్ యూఎస్‌లో తమ కార్యకలాపాలను ఉపసంహరించుకోవాలని వాషింగ్టన్ డిమాండ్ చేయడం, మనీలాండరింగ్ వ్యతిరేక అంశాలపై చర్చించనున్నారు.