ఆందోళనలో అమెరికా : Cyber Attackతో ఇరాన్ రీవెంజ్‌?

  • Publish Date - January 8, 2020 / 09:58 AM IST

అమెరికాపై ఇరాన్ సైబర్ దాడి చేయబోతుందా? అంటే అవునునే అంటున్నాయి నిఘా వర్గాలు. సైబర్ దాడులు చేయడంలో దిట్టగా పేరొందిన ఇరాన్ ఏ క్షణమైనా సైబర్ ఎటాక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సైబర్ సంబంధిత వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఒకవైపు అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. మరోవైపు మూడో ప్రపంచ యుద్ధానికి కాలుదువ్వుతున్నట్టుగా ఇరాన్ చర్యలు కనిపిస్తున్నాయి. ఇరాన్ టాప్ మిలటరీ కమాండర్ ఖాసీం సొలేమానిని అమెరికా సైనిక బలగాలు హతమార్చాడంపై ఇరాన్ ఆగ్రహంతో ఊగిపోతోంది.. ప్రతీకార జ్వాలతో రగిలిపోతోంది. ఏ క్షణమైన అమెరికా సహా మిత్ర దేశాలపై మిసైల్స్ దాడి చేయడానికి కూడా వెనుకాడేలా లేదు. ఈ పరిస్థితులు చూస్తుంటే యుద్ధం తప్పదా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. యుద్ధానికి దారి తీస్తుందేమోనన్న భయాందోళన అమెరికాలో ఎక్కువగా కనిపిస్తోంది.

అన్నంత పని చేసిన ఇరాన్ :
ఇంతలోనే ఇరాన్ అన్నంత పని చేసింది. అమెరికాపై ప్రతీకారంగా యుద్ధానికి సిద్ధం అన్నట్టుగా శాంపిల్ చూపించింది. ఇరాక్ లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుసగా క్షిపణులను పేల్చేసింది. మిస్సైల్స్ తో ఇరాన్ ఆగేలా లేదు. రానున్న రోజుల్లో మరిన్ని దాడులకు పాల్పడేలా కనిపిస్తోందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. క్షిపణిలతో కాకుండా మరో విధంగా దాడి చేసేందుకు ఇరాన్ రెడీ అవుతున్నట్టుగా అమెరికా నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇరాన్ ప్రధాన ఆయధంగా సైబర్ ఎటాక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇరాన్ ప్రపంచంలోనే అత్యంత సైబర్ వార్ సృష్టించగల దేశాల్లో ఒకటిగా ఉంది. ఎన్నో ఏళ్లుగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య అదృశ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. మరో దాడికి ఎందుకు ఇరాన్ కాలుదువ్వుతుంది అనే ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. సైబర్ దాడి చేయడంలో ఇరాన్ దిట్ట. ఎంతమాత్రం పట్టువీడకుండా మొండితనంగా వ్యవహరిస్తుందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు బ్రియాన్ క్రెబ్స్ తెలిపారు. పొటెన్షియల్ సైబర్ థ్రెట్ ఉందని డిపార్ట్ మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ సైతం హెచ్చరిస్తోంది.

‘రోబస్ట్ సైబర్ ప్ర్రొగ్రామ్’ నుంచి గతంలో కూడా ఇరాన్ సైబర్ దాడులకు పాల్పడిన విషయాన్ని సొలేమాని హతమైన రెండు రోజుల తర్వాత నేషనల్ టెర్రరిజం అడ్వైజరీ సిస్టమ్ (DHS) ఒక బులిటెన్ జారీ చేసింది. ‘అమెరికాలోని క్లిష్టమైన మౌలిక సదుపాయాలకు వ్యతిరేకంగా తాత్కాలిక అంతరాయం కలిగించేలా ఇరాన్ దాడులు చేయగల సామర్థ్యం ఇరాన్ కు ఉందనే విషయాన్ని బులిటెన్ లో పేర్కొంది.

ఏ క్షణంలోనైనా ఇరాన్ సైబర్ ఎటాక్ ప్లాన్ చేసే అవకాశం ఉందని, ఈ దాడికి ఎదుర్కొనేందుకు యూనిటైడ్ స్టేట్స్ సిద్ధంగా ఉండాలని ఒబామా పాలన సమయంలో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ లో సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ అయిన సైబర్ థ్రెట్ అలియన్స్, అధ్యక్షుడు మిచెల్ డానియల్ హెచ్చరిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇరాన్ సైబర్ సామర్థ్యాలను పెంచుకోవడం కొనసాగిస్తోనే ఉందని ఆయన చెప్పారు. ఇరాన్ తో గత అనుభవం ఆధారంగా పరిశీలిస్తే.. సైబర్ దాడి చేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని డానియల్ తెలిపారు.

సైబర్ ముప్పు దేశంగా ఇరాన్ ఎలా అవతరించింది ?:
గతంలో ఇరాన్ చేసిన సైబర్ దాడులను పరిశీలిస్తే.. అమెరికాపై మరో కొత్త సైబర్ దాడికి ఇరాన్ సన్నాహాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. మాల్ వేర్ ప్రొగ్రామ్ ద్వారా అమెరికాలోని కంప్యూటర్ సిస్టమ్ లను పూర్తిగా నాశనం చేసేస్తుంది. ఇందులో కంప్యూటర్ వైరస్ లేదా డెనియల్ ఆఫ్ సర్వీసు (Dos) సైబర్ దాడులు (వెబ్ సర్వీసుల ఫంక్షన్ క్రాష్ అయ్యేలా హ్యాకర్లు రిక్వెస్ట్ లు వరుసగా పంపించడం) చేసే అవకాశం ఉంది. దాదాపు 10ఏళ్ల క్రితమే అమెరికాతో ఇరాన్ సైబర్ ఎటాక్ లింక్ అయింది. అప్పటినుంచే ఇరాన్ సైబర్ వార్ సామర్థ్యాలను ఉధృతం చేస్తూ వస్తోంది. 2010 జూన్ లో Stuxnet అనే కంప్యూటర్ Virusతో ఇరాన్ న్యూక్లియర్ ప్రొగ్రామ్ రన్ అయ్యే కంప్యూటర్లే లక్ష్యంగా ఈ వైరస్ ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. ఇది దాని సెంట్రీఫ్యూజ్ లో ఐదో భాగాన్ని నాశనం చేయగలదని ఓ రిపోర్టు తెలిపింది.

అమెరికాలో ప్రైవేట్ రంగాలే లక్ష్యంగా ఇరాన్ సైబర్ దాడులు చేస్తుంటోంది. 2014లో శాండ్స్ హోటల్ అండ్ క్యాసినో సిస్టమ్స్ ను హ్యాక్ చేసింది.డేటాను తస్కరించడమే కాకుండా నాశనం చేసింది కూడా. తద్వారా దాదాపు 40 మిలియన్ డాలర్ల నష్టాన్ని క్యాసినో చవిచూసింది. 2011, 2013 మధ్య కాలంలో ఏడుగురు ఇరానీయులు ఇరాన్ ప్రభుత్వం తరపున పనిచేస్తూ DoS దాడులకు పాల్పడ్డారు. 2016 అమెరికా నేరారోపణ విభాగం ప్రకారం.. 46 వ్యాపార సంస్థలు అందులో ఎక్కువ శాతం ఫైనాన్షియల్ సంస్థలపైనే DoS దాడులు చేసింది. సౌదీ అరేబియా ప్రభుత్వ ఆయిల్ కంపెనీ సౌదీ అర్మాకోపై కూడా అప్పట్లో ఇరాన్ సైబర్ దాడికి పాల్పడింది. 2012లో Shamoon అనే వైరస్ ఇంజెక్ట్ చేసి 30వేలకు పైగా సౌదీ ఆర్మాకో కంప్యూటర్లను నాశనం చేసింది.

సైబర్ వార్.. ఎదుర్కొనేందుకు అమెరికా సిద్ధంగా ఉందా? :
ఇరాన్ సైబర్ థ్రెట్ ఎదుర్కొవడానికి అమెరికా సిద్ధంగా ఉందా? అంటే.. సైబర్ సెక్యూరిటీ నిపుణులు బ్రూసీ సెచినేయర్ సమాధానం ప్రస్తుతానికి లేదనే ఆయన సమాధానం ఇచ్చారు. అమెరికాపై ఏ క్షణమైనా ఇరాన్ సైబర్ దాడులకు పాల్పడే అవకాశం ఉందని గతంలో కూడా ఎన్నోయేళ్లుగా సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ప్రత్యేకించి.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల సమయం నుంచి తరుచుగా దీనిపై హెచ్చరిస్తూనే వస్తోందని ఆయన చెప్పారు.

గత అక్టోబర్ నెలలో ఇరాన్ సంబంధిత హ్యాకర్ గ్రూపు కొంతమంది రాజకీయ జర్నలిస్టులతో కూడిన ఈమెయిల్ అకౌంట్లను యాక్సస్ చేసేందుకు ప్రయత్నించింది. ఇరాన్ గ్రూపులు నకిలీ ఖాతాలను క్రియేట్ చేసినట్టు అదే నెలలో ఫేస్ బుక్ కూడా రివీల్ చేసింది. గతంలోనూ ఇలాంటి చర్యలకు ఎన్నోసార్లు ఇరాన్ యత్నించింది. అమెరికా కూడా ఇరాన్ పై పలు సైబర్ దాడులు చేసింది. ఇటీవల కాలంలో గత ఏడాది జూన్, సెప్టెంబర్, డిసెంబర్ లోనే జరిగినట్టు ఓ రిపోర్టు తెలిపింది.
ముందుస్తు జాగ్రత్త చర్యగా, ప్రభుత్వ అధికారులు, ఏజెన్సీలు భద్రతా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అమెరికన్లను హెచ్చరించారు. ఇరాన్ సంబంధిత ఫ్రాక్జీల నుంచి యునైటెడ్ స్టేట్స్ పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థలకు సైబర్ ముప్పు ఉందని గత జూన్ నెలలో డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ (CISA) హెచ్చరించింది.

ఆ పోస్టు రద్దుతో ఆందోళన :
ఆందోళనకరమైన విషయం ఏమిటంటే? ట్రంప్ ప్రభుత్వం.. 2018లో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ పోస్టును రద్దు చేసింది. గతంలో ప్రభుత్వ సంస్థలన్నింటిలో సైబర్ సెక్యూరిటీ పరంగా సమస్యలను గుర్తించే బాధ్యతను నిర్వర్తించేందుకు అప్పటి బరాక్ ఒబామా ప్రభుత్వం ఈ పోస్టును క్రియేట్ చేసింది. 2017 నుంచి సైబర్ పరంగా సమస్యలను గుర్తించే స్టేట్ డిపార్ట్ మెంట్ కోఆర్డినేటర్ పోస్టు ఖాళీగా ఉంటోంది. ఈ క్రమంలో సైబర్ ముప్పును పసిగట్టి సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా అత్యవసర చర్యలు చేపట్టాల్సిందిగా యూఎస్ గవర్నమెంట్ అకౌంటబులిటీ కార్యాలయం ప్రభుత్వానికి సూచించింది.

తర్వాత ఏంటి? ఇంతకీ అమెరికన్లు సిద్ధమేనా?
గత శనివారం అమెరికాలోని ఫెడరల్ డిపాజిటరీ లైబర్రీ ప్రొగ్రామ్ వెబ్ సైట్ పై సైబర్ దాడి జరిగింది. దీని వెనుక ఇరాన్ హస్తం ఉండే అవకాశం ఉందని ఇప్పటివరకూ తెలుసు. ఎందుకంటే.. ఆ వెబ్ సైట్ హోంపేజీలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫొటోను పెట్టి.. ఆయన ముఖంపై పంచ్ వేసినట్టుగా ఉంది. పక్కనే సొలేమాని హత్యను ఖండిస్తూ ఒక సందేశం కూడా హ్యాకర్లు ఉంచారు. ఈ దాడితో ఎలాంటి నష్టానికి దారితీసిందా అనేదానిపై నమ్మశక్యంగా లేదు. ఈ సైబర్ దాడి వెనుక ఇరాన్ హస్తం ఉందంటూ ఎలాంటి ఆధారాలు కూడా లేవని CISA తెలిపినట్టు పేరు చెప్పేందుకు నిరాకరించిన అధికారి ఒకరు తెలిపారు.

మరోవైపు.. అమెరికా వాసులను, ప్రైవేటు రంగాలను సైబర్ సెక్యూరిటీ నిపుణులంతా హెచ్చరిస్తున్నారు. ముందుగానే అన్నింటికి సిద్ధంగా లేకపోతే.. ఇరాన్ తర్వాతి సైబర్ దాడితో చేసేది ఏమి ఉండదు. ఇరాన్ నుంచి అత్యంత తక్షణ ముప్పు ఉన్న ఫైనాన్షియల్ సంస్థలు, మౌలిక సదుపాయాల రంగాలపైనే సైబర్ దాడి జరిగే అవకాశం ఉందని ఒబామా హోంల్యాండ్ సెక్యూరిటీ, తీవ్రవాద వ్యతిరేక సలహాదారుడు లిసా మోనాకో వాషింగ్టన్ పోస్టు కథనంలో రాశారు. ఇప్పుడు అందరిలో అతిపెద్ద ప్రశ్న.. ఇదే.. అమెరికన్లు సిద్ధమయ్యారాబలేదా? అని ఆమె రాసుకోచ్చారు.