Covid Vaccine Patents : కరోనా వ్యాక్సిన్‌ పై పేటెంట్‌ ఎత్తేయాలి… ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్

వ్యాక్సిన్ వచ్చినా.. టీకా సరఫరాలో ధనిక దేశాల ఏకపక్ష వైఖరి కారణంగా పేద దేశాల్లో ఇంకా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభం కాలేదు. కొవిడ్‌-19 టీకాపై పేటెంట్‌ హక్కులు విధించడం వల్లే ఈ పరిస్థితులు దాపురించాయని, వాటిని మాఫీ చేయాలంటూ పెద్దఎత్తున డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

Covid Vaccine Patents : కరోనా వ్యాక్సిన్‌ పై పేటెంట్‌ ఎత్తేయాలి… ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్

Covid Vaccine Patents

Updated On : April 28, 2021 / 10:20 AM IST

Covid Vaccine Patents : యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ మహమ్మారి కట్టడికి ఎట్టకేలకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. పలు దేశాలకు చెందిన సైంటిస్టులు, డాక్టర్లు అహర్నిశలూ శ్రమించి టీకా కనుగొన్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. వ్యాక్సిన్ రావడంతో మనిషి ప్రాణం పీల్చుకున్నాడు. ఇక కరోనాను ఖతం చేసే రోజు ఎంతో దూరంలో లేదని సంతోషిస్తున్నాడు. ఇంతలోనే, మరో పిడుగు లాంటి వార్త వినిపించింది. అదే కరోనా వ్యాక్సిన్ పేటెంట్.. ఇప్పుడీ పేటెంట్ గొడవ ముదిరింది. వ్యాక్సిన్ వచ్చినా.. టీకా సరఫరాలో ధనిక దేశాల ఏకపక్ష వైఖరి కారణంగా పేద దేశాల్లో ఇంకా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభం కాలేదు. కొవిడ్‌-19 టీకాపై పేటెంట్‌ హక్కులు విధించడం వల్లే ఈ పరిస్థితులు దాపురించాయని, వాటిని మాఫీ చేయాలంటూ పెద్దఎత్తున డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

పేటెంట్‌ హక్కులు అంటే?
వ్యాధిని కట్టడి చేసే వ్యాక్సిన్‌ లేదా ఔషధాన్ని అభివృద్ధి చేసిన సంస్థకు ఇచ్చే ప్రత్యేక హక్కులనే ‘పేటెంట్‌’ అంటారు. అంటే ఆ వ్యాక్సిన్‌కు సంబంధించిన ఫార్ములా పూర్తిగా ఆ ఉత్పత్తిదారుకే సొంతం. సదరు కంపెనీ అనుమతి లేకుండా ఆ ఫార్ములాను ఇతర కంపెనీలు వినియోగించడం నేరం. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థ చట్టపరమైన చిక్కులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

పేటెంట్‌ మాఫీ ఎందుకు?
కరోనాతో ప్రపంచ దేశాలు కుదేలయ్యాయి. మహమ్మారి నియంత్రణకు అమెరికా, బ్రిటన్‌ వంటి ధనిక దేశాల్లోని ఫార్మా సంస్థలు తమకున్న అపారమైన వనరులు, సాంకేతికతతో కొవిడ్‌-19 వ్యాక్సిన్లను యుద్ధప్రాతిపదికన సిద్ధం చేశాయి. అలాగే, ఉత్పత్తి చేసిన కోట్లాది డోసులను తమ దగ్గరే నిల్వ ఉంచుకున్నాయి. దీంతో మధ్య ఆఫ్రికా, దక్షిణ అమెరికా, మధ్యప్రాచ్యం, తూర్పు ఆసియాలోని పలు పేద, దిగువ మధ్య తరగతి దేశాలకు వ్యాక్సిన్‌ డోసులకు కొరత ఏర్పడింది. దీంతో భారత్‌, దక్షిణాఫ్రికా వంటి దేశాలు రంగంలోకి దిగాయి. కరోనా వ్యాక్సిన్లకు సంబంధించిన అన్ని పేటెంట్‌ హక్కులను మాఫీ చేయాలని గత(2020) అక్టోబర్‌లో వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూటీవో)కు విజ్ఞప్తి చేశాయి.

తద్వారా వ్యాక్సిన్‌ తయారీ ఫార్ములా అన్ని దేశాలకు చేరడంతో.. ధనిక, పేద, మధ్యతరగతి అని తేడా లేకుండా స్వదేశీ వనరులతో అన్ని దేశాలు టీకాలను స్వతహాగా ఉత్పత్తి చేసుకోగలవని వెల్లడించాయి. అయితే, ఈ అభ్యర్థనను అమెరికా, యురోపియన్‌ యూనియన్‌, కెనడా, చిలీ తదితర దేశాలు వ్యతిరేకించాయి. ఆర్థికంగా, సాంకేతికంగా ఎంతో ఖర్చు చేసి వ్యాక్సిన్లను అభివృద్ధి చేశాక.. అప్పనంగా ఆ ఫార్ములాను ఇతర దేశాలకు ఎలా బహిర్గతం చేస్తామని వాదించాయి. ప్రపంచవ్యాప్తంగా వేలాదిమందిని మహమ్మారి బలితీసుకుంటున్నా.. వ్యాక్సిన్ల కొరతతో ప్రజలు పిట్టల్లా రాలుతున్నా.. ధనిక దేశాలు బెట్టు వీడటం లేదు. అయితే, ప్రజల ప్రాణాలకంటే ఆర్థిక ప్రయోజనాలు ముఖ్యం కాదని, వెంటనే కరోనా వ్యాక్సిన్లపై ఉన్న పేటెంట్లను మాఫీ చేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

పోలియో టీకా సమయంలో ఏం జరిగిందంటే?
1950 దశకంలో ప్రపంచవ్యాప్తంగా పోలియో విలయం సృష్టించింది. లక్షలాది మంది చిన్నారులు పక్షవాతానికి గురవ్వడం లేదా చనిపోవడం జరిగింది. సుమారు 18 లక్షల మంది చిన్నారులపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించి 1955లో ‘జోనస్‌ సాల్క్‌’ అనే అమెరికన్‌ శాస్త్రవేత్త పోలియోకు వ్యాక్సిన్‌ను కనుగొన్నారు. అదే సమయంలో మరో ఒకటి, రెండు కంపెనీలు కూడా పోలియోకు టీకాలను అభివృద్ధి చేసి పేటెంట్లు పొందాయి. అయితే, ప్రపంచ దేశాలకు పోలియో వ్యాక్సిన్‌ చేరాలన్న ఉద్దేశంతో సాల్క్‌.. తన వ్యాక్సిన్‌కు పేటెంట్‌ను తీసుకోలేదు. టీకా ఫార్ములాను ఉచితంగానే అన్ని దేశాలకు పంపించారు. దీంతో పేద, మధ్య తరగతి దేశాలు సొంతంగా పోలియో టీకాలను తయారుచేసుకోగలిగాయి. హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ విషయంలోనూ ఇదే జరిగింది. వైరస్‌పై పోరాడుతూ, రోగనిరోధక వ్యవస్థను మెరుగుపర్చే పలు హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌కు సంబంధించిన ఔషధాలపై కూడా పేటెంట్లను ఎత్తివేశారు.

వ్యాక్సినేషన్‌కు దూరంగా 330 కోట్ల మంది..
ప్రపంచ జనాభాలో 70% మందికి కరోనా టీకా (రెండు డోసులు) వేయడానికి 1,100 కోట్ల డోసులు అవసరమవుయని అంచనా. ఇప్పటివరకూ ఉత్పత్తి సంస్థలతో వివిధ దేశాలు 860 కోట్ల డోసులకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇందులో ధనిక, ఎగువ మధ్య తరగతి దేశాలే 600 కోట్ల డోసులకు ఆర్డర్లు ఇచ్చాయి. ఈ దేశాల్లో జనాభా 100 కోట్లు కూడా దాటదు. అంటే అవసరానికి మించి మూడురెట్లు ఎక్కువ టీకాలను ఆ దేశాలు కొనుగోలు చేశాయి. ఇక 80% జనాభా (18 ఏళ్లు పైబడిన వాళ్లు 450 కోట్లు) ఉన్న పేద, మధ్య తరగతి దేశాలకు 240 కోట్ల డోసులే మిగిలాయి. ఈ దేశాల్లో కేవలం 120 కోట్ల మందికి మాత్రమే పూర్తిస్థాయిలో టీకాను (రెండు డోసులు) వేయవచ్చు. మిగిలిన 330 కోట్ల మంది టీకాకు దూరం కానున్నారు.