దేవుడా.. అమెరికా అడ్డదారిలో వెళ్లినోళ్ల కథలు.. దారిలో చావులు, పుర్రెలు.. ఒళ్లు గగుర్పొడిచే వ్యథలు చదివితే..

Indian Deportees : కదిలిస్తే ఒక్కొక్కరిది విషాధ గాథ బయటకు వస్తోంది. అమెరికా విమానంలో తీసుకువచ్చిన 104 మంది వెనక్కి వచ్చిన వారిలో ఒకరైన జస్పాల్ సింగ్ తన చేతులు, కాళ్లను గొలుసులతో కట్టేసిన భయానక చేదు అనుభవాన్నిచెప్పుకొచ్చాడు.

దేవుడా.. అమెరికా అడ్డదారిలో వెళ్లినోళ్ల కథలు.. దారిలో చావులు, పుర్రెలు.. ఒళ్లు గగుర్పొడిచే వ్యథలు చదివితే..

Cheated By Agents, Deportees From US Share

Updated On : February 6, 2025 / 5:05 PM IST

Indian Deportees : ట్రంప్ మనోడే కదా అనుకున్నాం.. మన భారతీయులకు మేలు చేస్తాడని భావించాం.. కానీ, మళ్లీ అధికారంలోకి వచ్చాక ట్రంప్ తీరు మారింది. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపే విషయంలో కొంచెం కూడా వెనక్కి తగ్గడం లేదు. అందులోనూ భారత్‌తో మంచి సంబంధాలు ఉన్నా మినహాయింపు లేదనే సంకేతాలు ఇచ్చేశాడు. అక్కడి మనవాళ్లను అత్యంత అవమానకరంగా వెనక్కి పంపిస్తున్నాడు.

అక్రమంగా వలస వచ్చారనే నెపంతో దారుణంగా దేశం నుంచి వెళ్లగొడుతున్నాడు. ఇప్పటికే భారత్‌కు తొలి బ్యాచ్ చేరుకుంది. భారతీయుల పట్ల అమెరికా రాయబార కార్యాలయం అగౌరవంగా వ్యహరించడం విమర్శలకు దారితీస్తోంది. ఇప్పుడు అమెరికా నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన వారంతా తమకు ఎదురైన చేదు అనుభవాలను చెప్పుకుంటూ తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. భారత్‌కు వచ్చేంతవరకు తమ కాళ్లు, చేతులకు సంకెళ్లు వేసి ఉంచారని మనోళ్లు వాపోయారు.

Read Also : Gold Loans : బంగారు రుణం తీసుకునేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి.. చాలా మంది ఇదే తప్పు చేస్తారు.. బాధపడతారు!

కదిలిస్తే.. ఒక్కొక్కరిది ఒక్కో గాథ :
అమెరికా నుంచి 104 మంది అక్రమ భారతీయులను వెనక్కి పంపింది. అమెరికా సైనిక విమానం C-17 అమృత్‌సర్ విమానాశ్రయానికి చేరుకుంది. వీరంతా డంకీ రూట్ (అక్రమ మార్గం) ద్వారా అమెరికా చేరుకున్నారు. ఇందుకోసం రూ.40 లక్షల నుంచి 50 లక్షలు ఖర్చు చేశారు. ఇప్పుడు, తిరిగి పంపిన వారిలో గురుదాస్‌పూర్ జిల్లాలోని హర్దోర్వాల్ గ్రామానికి చెందిన 36 ఏళ్ల జస్పాల్ సింగ్ కూడా ఉన్నారు.

స్వదేశానికి తిరిగి వచ్చిన జస్పాల్ సింగ్.. తన చేతులకు సంకెళ్లు వేసి, కాళ్లకు గొలుసులు వేశారని వాపోయాడు. విమానం అమృత్‌సర్ చేరుకున్నప్పుడు, తన గొలుసులను తొలగించారని చెప్పాడు. పిటిఐ ప్రకారం.. జస్పాల్ సింగ్ గురుదాస్‌పూర్ నుంచి అమెరికాకు వెళ్లడం దగ్గరి నుంచి విషాధ కథను వివరించారు. కదిలిస్తే.. ఒక్కొక్కరిది ఒక్కో గాథ వినిపిస్తోంది.

11 రోజుల పాటు నిర్బంధంలో ఉంచి :
సాధారణంగా, ఢిల్లీ నుంచి విమానంలో అమెరికా చేరుకోవడానికి 25 గంటల నుంచి 30 గంటలు పడుతుంది. కానీ, జస్పాల్ సింగ్ అమెరికా చేరుకోవడానికి 4400 గంటలు అంటే.. ఏకంగా 6 నెలలు పట్టింది. జనవరి 24న తాను అమెరికాకు చేరుకున్నానని, అయితే సరిహద్దు గస్తీ సిబ్బందికి పట్టుబడి 11 రోజుల పాటు నిర్బంధంలో ఉంచారని చెప్పాడు. ఆ తర్వాత వెనక్కి పంపినట్టు జస్పాల్ చెప్పుకొచ్చాడు.

అయితే, తనను భారత్‌కు తిరిగి పంపుతున్నారనే విషయం మొదట తెలియదని జస్పాల్‌ చెప్పుకొచ్చాడు. బహుశా వేరే క్యాంపుకు తీసుకెళ్తున్నారని భావించాడు. ఆ తరువాత ఒక పోలీసు అధికారి స్వదేశానికి తిరిగి పంపుతున్నట్టు చెప్పారు. ఒక ట్రావెల్ ఏజెంట్ తనను మోసం చేశాడని జస్పాల్ సింగ్ వాపోయాడు. ఆ ఏజెంట్ తనను చట్టబద్ధంగా అమెరికాకు పంపుతానని హామీ ఇచ్చి మోసం చేసినట్టు తెలిపాడు.

సరైన వీసా వచ్చిన తర్వాతే నన్ను అమెరికాకు పంపమని ఏజెంట్‌తో చెప్పానని జస్పాల్ అన్నాడు. కానీ, ఆ ఏజెంట్ తనను మోసం చేశాడు. ఏజెంట్‌తో రూ.30 లక్షలకు ఒప్పందం కుదిరింది. నివేదికల ప్రకారం.. జస్పాల్ గత ఏడాది జూలైలో విమానంలో బ్రెజిల్ చేరుకున్నాడు. అమెరికాకు అతని తదుపరి ప్రయాణం కూడా విమానంలో ఉంటుందని హామీ ఇచ్చారు. కానీ, ఏజెంట్ చేతిలో మోసపోయిన తర్వాత తాను చట్టవిరుద్ధంగా సరిహద్దు దాటవలసి వచ్చింది. బ్రెజిల్‌లో 6 నెలలు ఉన్న తర్వాత సరిహద్దు దాటి అమెరికాకు చేరుకున్నాడు. కానీ, అతన్ని అమెరికా సరిహద్దు వద్ద అరెస్టు చేశారు. అతన్ని 11 రోజుల పాటు నిర్బంధించి, ఆ తర్వాత భారత్‌కు తిరిగి పంపించారు.

చెదిరిపోయిన భవిష్యత్ కలలు :
అమెరికా నుంచి భారత్ తిరిగి రావడం తనకు తీవ్ర నిరాశ కలిగించిందని జస్పాల్ వాపోయాడు. అమెరికా వెళ్లేందుకు తనకు చాలా డబ్బు ఖర్చు అయింది. ఆ డబ్బు అప్పుగా తీసుకున్నాడు. ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళినప్పుడు, మన కుటుంబానికి మంచి భవిష్యత్తు కోసం పెద్ద కలలు కంటాము. ఇప్పుడు ఆ కలలు చెదిరిపోయాయని కన్నీటిపర్యంతమయ్యాడు.

ఒక జస్పాల్ మాత్రమే కాదు.. ఇలాంటి విషాద గాథలు మరెన్నో ఉన్నాయి. ” గత రాత్రి హోషియార్‌పూర్‌లోని తమ స్వస్థలాలకు చేరుకున్న మరో ఇద్దరు భారతీయులు కూడా అమెరికా చేరుకోవడానికి తాము ఎదుర్కొన్న కష్టాలను పంచుకున్నారు. హోషియార్‌పూర్‌లోని తహ్లి గ్రామానికి చెందిన హర్వీందర్ సింగ్.. గత ఏడాది ఆగస్టులో అమెరికాకు వెళ్లానని చెప్పాడు. ఖతార్, బ్రెజిల్, పెరూ, కొలంబియా, పనామా, నికరాగ్వా, ఆపై మెక్సికోకు అతన్ని తీసుకెళ్లారు.

మెక్సికో నుంచి అతనితో పాటు ఇతరులను అమెరికాకు తీసుకెళ్లారని చెప్పాడు. “మేము కొండలు దాటాం. ఇతర వ్యక్తులను తీసుకెళ్తున్న పడవ సముద్రంలో మునిగిపోయే దశలో ఉంది. కానీ, మేం ప్రాణాలతో బయటపడ్డాం” అని విలేకరులతో తెలిపారు. పనామా అడవిలో ఒకరు చనిపోతుండగా, మరొకరు సముద్రంలో మునిగిపోతుండగా తాను చూశానని వాపోయాడు. తన ట్రావెల్ ఏజెంట్ తనను మొదట యూరప్‌కు, తరువాత మెక్సికోకు తీసుకెళ్తానని హామీ ఇచ్చాడని సింగ్ తెలిపాడు.

45 కి.మీ నడిచాం.. ఎన్నో మృతదేహాలను చూశాం :
అమెరికా చేరేందుకు ‘డంకీ’ కష్టాల గురించి వివరించారు. అమెరికా వెళ్లేందుకు తాను రూ.42 లక్షలు ఖర్చు చేశానని చెప్పాడు. “కొన్నిసార్లు మాకు బియ్యం దొరికేవి. కొన్నిసార్లు, తినడానికి ఏమీ దొరకవు. మాకు బిస్కెట్లు దొరికేవి” అని వాపోయాడు. పంజాబ్‌కు చెందిన మరో వ్యక్తి తనను అమెరికాకు తీసుకెళ్లేందుకు ఉపయోగించిన డాంకీ రూట్ గురించి ప్రస్తావించారు. “ఈ మార్గమధ్యలో రూ. 30వేల నుంచి రూ. 35వేల విలువైన మా బట్టలు దొంగిలించారు” అని చెప్పాడు.

Read Also : Parliament Adjourned : భారతీయుల పట్ల అమెరికా చర్యలపై పార్లమెంట్‌లో విపక్షాల ఆందోళన.. మధ్యాహ్నానికి ఉభయసభలు వాయిదా

మొదట ఇటలీకి, తరువాత లాటిన్ అమెరికాకు తీసుకెళ్లారని చెప్పుకొచ్చాడు. 15 గంటల పాటు పడవ ప్రయాణం చేశామని, 40 నుంచి 45 కిలోమీటర్లు నడిచి వెళ్ళేలా చేశారని విషాద గాథను వివరించాడు. “మేం 17 నుంచి 18 కొండలు దాటాం. ఒకరు జారిపడితే, బతికే అవకాశం ఉండదు… మనం చాలా చూశాం. ఎవరైనా గాయపడితే, చనిపోతారని వదిలేసేవారు. మేం అలాంటి ఎన్నో మృతదేహాలను చూశాం” అని సింగ్ తమకు ఎదురైన భయాంకర అనుభవాలను చెప్పుకొచ్చాడు.

అమెరికా వెనక్కి పంపిన భారతీయుల మొదటి బ్యాచ్ :
వివిధ రాష్ట్రాల నుంచి 104 మంది అక్రమ వలసదారులతో కూడిన యూఎస్ సైనిక విమానం ల్యాండ్ అయింది. అక్రమ వలసదారులపై కఠిన చర్యలలో భాగంగా డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వెనక్కి పంపిన భారతీయుల మొదటి బ్యాచ్ ఇదే. వీరిలో హర్యానా, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన వారు 33 మంది, పంజాబ్ నుంచి 30 మంది, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ నుంచి ముగ్గురు, చండీగఢ్ నుంచి ఇద్దరు ఉన్నారని వర్గాలు తెలిపాయి. వారిలో 19 మంది మహిళలు, 13 మంది మైనర్లు ఉన్నారు. వీరిలో నాలుగేళ్ల బాలుడు, ఐదు, ఏడు సంవత్సరాల వయస్సు గల ఇద్దరు బాలికలు ఉన్నారు. పంజాబ్‌కు చెందిన వీరిని అమృత్‌సర్ విమానాశ్రయం నుంచి పోలీసు వాహనాల్లో వారి స్వస్థలాలకు తరలించారు.