ఎట్టకేలకు ప్రపంచ కుబేరుడు వారెన్ బఫెట్ ఫ్లిప్ ఫోన్ వదలిపెట్టి ఐఫోన్ కు మారారు

  • Published By: veegamteam ,Published On : February 24, 2020 / 07:11 PM IST
ఎట్టకేలకు ప్రపంచ కుబేరుడు వారెన్ బఫెట్ ఫ్లిప్ ఫోన్ వదలిపెట్టి ఐఫోన్ కు మారారు

ప్రపంచ కుబేరుడు, బెర్క్ షైర్ హాథవే(berkshire hathaway) సీఈవో వారెన్ బఫెట్(warren buffet) ఎట్టకేలకు తన ఫోన్ మార్చేశారు. పాత ఫ్లిప్ ఫోన్(flip phone) పక్కన పడేసి.. కొత్త ఐఫోన్ 11(iphone 11) కొన్నారు. ఇప్పుడీ న్యూస్ వైరల్ అయ్యింది. ఐఫోన్ కొన్నారు..అందులో గొప్ప విషయం ఏముందనే సందేహం మీకు రావొచ్చు. కచ్చితంగా విశేషమే. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది ప్రపంచ వింత. ఎందుకంటే.. ఎన్నో ఏళ్లు ఫ్లిప్ ఫోన్ వాడిన బఫెట్ చివరికి ఐఫోన్ కొన్నారు. ”నా ఫ్లిప్ ఫోన్ పర్మినెంట్ గా పోయింది. నెంబర్ కూడా మారింది. మీరిప్పుడు 89ఏళ్ల కొత్త బఫెట్ ను చూస్తున్నారు. ఇకపై ఇదే నా కొత్త ఫోన్” అని ఓ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వారెన్ బఫెట్ స్వయంగా చెప్పుకుని మురిసిపోయారు.

కొత్త ఐఫోన్ కొన్నా.. కేవలం ఫోన్ మాదిరే వాడతాను తప్పు..అందరిలా అందులోని ఫెసిలిటీస్ జోలికి వెళ్లనన్నారు. దశాబ్ద కాలంగా ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ల హవా నడుస్తోంది. ఇలాంటి రోజుల్లోనూ వారెన్ బఫెట్ పాతకాలపు నాటి ఫ్లిప్ ఫోన్ వాడారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఫోన్ ని మార్చడం ఆసక్తికరంగా మారింది. వారెన్ బఫెట్ ఇంతకాలం శాంసంగ్ కంపెనీకి చెందిన ఫ్లిప్ ఫోన్ వాడారు.

కాగా, యాపిల్ కంపెనీలో 5.6శాతం వాటాను వారెన్ బఫెట్ కొనుగోలు చేశారు. దీని విలువ 70 బిలియన్ డాలర్లు. దీనిపై యాపిల్ సీఈవో టిమ్ కుక్ స్పందించారు. తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఫ్లిప్ వదిలేసి.. ఐఫోన్ కొన్నాలని కొన్నేళ్లుగా వారెన్ బఫెత్ కు నచ్చచెప్పి విసిగిపోయానని టిమ్ కుక్ అన్నారు. చివరికి ఆయన ఐఫోన్ తీసుకోవడం సంతోషం కలిగించిందన్నారు.

వారెన్ బఫెట్.. పరిచయం అక్కర్లేని పేరు. బిజినెస్ టైకూన్. ప్రపంచ కుబేరుల్లో ఒకరు. ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితాలో చాలాకాలం పాటు నెంబర్ 1 పొజిషిన్ లో వారెన్ బఫెట్ ఉన్నారు. ప్రస్తుతం దాదాపు 88 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల్లో బఫెట్‌ మూడో స్థానంలో ఉన్నారు.