డొనాల్డ్ ట్రంప్ హెల్త్ బులెటిన్.. ఆ అరుదైన వ్యాధితో ఇబ్బంది పడుతున్న అమెరికా ప్రెసిడెంట్.. లక్షణాలు ఇవే..? నిర్లక్ష్యం వహిస్తే పెద్ద ప్రమాదమే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై వైట్‌హౌస్ హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది. కాళ్లలో వాపుతో బాధపడుతున్న ట్రంప్ కు వైద్య పరీక్షలు నిర్వహించగా..

US President Donald Trump
US President Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై వైట్‌హౌస్ హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది. కాళ్లలో వాపుతో బాధపడుతున్న ట్రంప్ కు వైద్య పరీక్షలు నిర్వహించగా.. కొత్త వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీర్ఘకాలిక సిరల లోపం (సిరల్లో రక్తం సరిగా ప్రవహించకపోవడం వల్ల కలిగే పరిస్థితి)తో బాధపడుతున్నాడని, ఇది వృద్ధుల్లో సర్వసాధారణంగా కనిపించే సమస్య అని వైట్ హౌస్ తెలిపింది.
వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ తెలిపిన వివరాల ప్రకారం.. వైట్‌హౌస్ బృందం ట్రంప్ కు తాజాగా వైద్య పరీక్షలు నిర్వహించింది. ఇందులో భాగంగా ఆయనకు డాప్లర్ అల్ట్రా సౌండ్ పరీక్షలు నిర్వహించగా.. దీర్ఘకాలిక సిరల బలహీనత ఉన్నట్లు తేలింది. అయితే, ట్రంప్ ఎకో-కార్డియోగ్రామ్ కూడా చేయించుకున్నారు. గుండె వైఫల్యం, మూత్రపిండాల బలహీనత లేదా ఇతర అనారోగ్య లక్షణాలు ఏమీ లేవని తెలిందని తెలిపారు.
దీర్ఘకాలిక సిరల బలహీనత అనేది కొన్ని సిరల లోపల కవాటాలు పనిచేయని పరిస్థితి. దీని వల్ల రక్తం సిరల్లో కలిసిపోతుంది లేదా పేరుకుపోతుంది. ప్రతీయేటా సుమారు లక్షన్నర మంది ఈ సమస్యతో బాధపడుతున్నారని, వయస్సుతో పాటు దీనివల్ల ప్రమాద తీవ్రత పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ సమస్య వల్ల కాళ్లలో వాపు, నొప్పి, తిమ్మిరిగా అనిపించడం. సిరలు ఉబ్బటం, చర్మం పాలిపోవడం వంటివి ఈ వ్యాధి లక్షణాలు వైద్యులు చెప్పారు.
ఈ సమస్య ఆందోళనకరమైనది కాదని హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో అత్యవసర వైద్యం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జెరెమీ ఫౌస్ట్ సీఎన్ఎన్ తో అన్నారు. ఇది వృధ్ధాప్యంలో చాలా సాధారణమైన సమస్య. ముఖ్యంగా అధిక బరువు, ఊబకాయంతో ఇబ్బందిపడే వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ సమస్య వల్ల అధ్యక్షుడు ట్రంప్ కు వచ్చే ఇబ్బంది ఏమీలేదు. కానీ, వయస్సు పెరుగుతున్నా కొద్దీ లక్షణాలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. దీంతో ఎప్పటికప్పుడు ఈ సమస్య వృద్ధికాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.