మిస్సైల్ వచ్చి పడినా, మళ్లీ తేరుకుని భయపడకుండా వార్తలు చదివిన సాహర్ ఇమానీ.. ఎవరు ఈమె? ఒక్కసారిగా స్టార్ అయిపోయిందిగా..

శబ్దంతో స్టూడియో కంపించడంతో ఆమె లేచి వెళ్లిపోయారు. కానీ, కొద్ది సేపటికే ఆమె మళ్లీ వచ్చి ప్రత్యక్ష ప్రసారాన్ని కొనసాగించారు.

మిస్సైల్ వచ్చి పడినా, మళ్లీ తేరుకుని భయపడకుండా వార్తలు చదివిన సాహర్ ఇమానీ.. ఎవరు ఈమె? ఒక్కసారిగా స్టార్ అయిపోయిందిగా..

Sahar Imani

Updated On : June 17, 2025 / 1:56 PM IST

ప్రముఖ ఇరానియన్ స్టేట్ టెలివిజన్‌ యాంకర్ సాహర్ ఇమానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో స్టార్ అయిపోయారు. గత రాత్రి ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని టీవీ కార్యాలయం పై భాగం ధ్వంసమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.

సాహర్ ఇమానీ న్యూస్ బులిటెన్ చదువుతున్న సమయంలో మిస్సైల్ స్టూడియో బిల్డింగ్‌ను ఢీకొట్టింది. శబ్దంతో స్టూడియో కంపించడంతో ఆమె లేచి వెళ్లిపోయారు. కానీ, కొద్ది సేపటికే ఆమె మళ్లీ వచ్చి ప్రత్యక్ష ప్రసారాన్ని కొనసాగించారు.

దీంతో ఆమె ధైర్యానికి సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆమెను వార్తలు చదువుతున్న సమయంలో చూపుడు వేలు చూపుతూ ఇజ్రాయెల్‌ను హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. షియా-ఇరానియన్ నేతలతో పాటు ఆమె ఫొటోను పెడుతూ ఇరాన్‌ మద్దతుదారులు ఈ ఫొటోను వైరల్ చేస్తున్నారు.

“ఇది ఇరానియన్ మహిళల ధైర్యానికి ప్రతిరూపం”, “ఒక ఆలోచనను చంపలేరు” వంటి క్యాప్షన్లతో ఆమె ఫొటోలను షేర్ చేస్తున్నారు.ఇరాన్ మహిళా, కుటుంబ సంక్షేమ విభాగ ఉపాధ్యక్షురాలు జహ్రా బెహ్రామ్‌జాదె అజర్ దీనిపై స్పందిస్తూ.. సాహర్ ఇమానీని ఇరాన్ మహిళల ధైర్యానికి చిహ్నంగా పేర్కొన్నారు. “ఈ దాడులకు తలొగ్గకుండా ఆమె ప్రజల గొంతుకగా నిలిచారు” అని ప్రశంసించారు.

సాహర్ ఇమానీ ఎవరు?

సాహర్ ఇమానీ ఇరాన్‌లో అత్యంత ప్రసిద్ధి చెందిన న్యూస్ యాంకర్లలో ఒకరు. ఆమె ఫుడ్ ఇంజనీరింగ్‌లో ట్రెయిన్ అయినప్పటికీ, 2010లో టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టారు. తక్కువ కాలంలోనే ఆమెకు దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఆమె వివాహిత.. ఆమెకు ఓ కుమారుడు ఉన్నాడు.

కాగా, ఇరాన్ స్టేట్ టీవీ కేంద్రంపై జరిగిన దాడిని ప్రో-ఇరాన్ వర్గాలు తీవ్రంగా ఖండించాయి. హెజ్బుల్లా దీనిని “ఘోరమైన కుట్ర”గా అభివర్ణించింది. “ఇది సత్యాన్ని దాచే ప్రయత్నం. ఇరాన్ ప్రజల ఉద్యమాన్ని అరికట్టే కుట్ర” అని హెజ్బుల్లా తెలిపింది.

మిసైల్ దాడి జరిగిన సమయంలో రికార్డయిన వీడియో..