పాకిస్థాన్ లో పెను సంచలనం.. అసిమ్ మునీర్ కు ప్రమోషన్.. భారీ చిచ్చు..

గతంలో పర్వేజ్ ముషారఫ్‌, జియా ఉల్ హక్‌ వంటి సైనిక నేతలు నేరుగా దేశాన్ని పాలించారు. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా సైన్యానికి మళ్లీ అధిక ప్రాధాన్యం దక్కుతుందని..

పాకిస్థాన్ లో పెను సంచలనం.. అసిమ్ మునీర్ కు ప్రమోషన్.. భారీ చిచ్చు..

Updated On : November 15, 2025 / 3:30 PM IST

Asim Munir: పాకిస్థాన్ సైన్యాధిపతి, ఫీల్డ్‌ మార్షల్ అసీం మునీర్‌కు కొత్త అధికారాలతో పాటు జీవితాంతం అరెస్ట్‌, ప్రాసిక్యూషన్‌ నుంచి రక్షణ ఇచ్చే తీర్మానాన్ని ఆ దేశ పార్లమెంట్‌ ఆమోదించింది. మునీర్‌కు కమాండర్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ (సీడీఎఫ్‌) పదవిని అప్పగించింది. 27వ రాజ్యాంగ సవరణకు సంబంధించిన ఈ బిల్లు చట్టంగా రూపుదిద్దుకుంది. దీనివల్ల దేశ అత్యున్నత న్యాయస్థానాల పని విధానాల్లోనూ ముఖ్యమైన మార్పులు వస్తాయి.

ఈ మార్పులను కొన్ని వర్గాలు మాత్రమే సమర్థిస్తున్నాయి. పాక్‌ సైన్యాన్ని సరైన రీతిలో తీర్చిదిద్దుకోవచ్చని, కోర్టుల్లో పేరుకుపోయిన కేసులకు ఉపశమనం లభిస్తుందని అంటున్నాయి.

విమర్శల జల్లు.. పాక్‌ ఇక ఎటువైపు వెళ్తుంది?
పాకిస్థాన్ సైన్యం ఆ దేశ రాజకీయాల్లో మొదటి నుంచీ కీలక పాత్ర పోషిస్తోంది. కొన్ని సందర్భాల్లో తిరుగుబాట్లతో అధికారంలోకి వచ్చింది. మరికొన్ని సందర్భాల్లో ప్రభుత్వం వెనుక నుంచి సైన్యం ప్రభావం చూపించింది. గతంలో పర్వేజ్ ముషారఫ్‌, జియా ఉల్ హక్‌ వంటి సైనిక నేతలు నేరుగా దేశాన్ని పాలించారు.

ఈ రాజ్యాంగ సవరణ ద్వారా సైన్యానికి మళ్లీ అధిక ప్రాధాన్యం దక్కుతుందని చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “పాకిస్థాన్ ఇప్పుడు హైబ్రిడ్ దశను దాటి పోస్ట్‌ హైబ్రిడ్ దశలోకి వెళ్లిందనడానికి ఇది ఓ బలమైన సూచన” అని వాషింగ్టన్‌లోని విల్సన్ సెంటర్ దక్షిణాసియా ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్ మైకేల్ క్యూగెల్‌మాన్ అన్నారు.

Also Read: పసిడి కొంటున్నారా? గుడ్‌న్యూస్‌.. ధరలు భారీగా తగ్గాయ్‌.. ఇప్పుడే పరిగెత్తుకెళ్లి కొంటే..

మునీర్ 2022 నవంబర్ నుంచి సైన్యాధిపతిగా ఉన్నారు. ఇప్పుడు నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లనూ పర్యవేక్షిస్తారు. ఆయనకు దక్కిన ఫీల్డ్‌ మార్షల్ బిరుదు, యూనిఫాం జీవితాంతం కొనసాగుతాయి. మునీర్ పదవీ విరమణ తరువాత కూడా అవసరమైతే ప్రధానమంత్రితో అధ్యక్షుడు చర్చించి ఆయనకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంటుంది.

ఈ పరిణామాలతో సైన్యానికి అధిక శక్తి అప్పగించినట్లు అయిందని విమర్శలు వస్తున్నాయి. “పాక్‌లో పౌరులకు, సైన్యానికి మధ్య సమతుల్యత లేదు” అని విశ్లేషకులు అంటున్నారు. సైన్యాన్ని నియంత్రించాల్సిన సమయంలో దానిని మరింత బలపరిచారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ పరిణామాల మధ్య పాక్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సయ్యద్ మన్‌సూర్ అలీ షా గురువారం రాజీనామా చేశారు. 27వ కానిస్టిట్యూషనల్ అమెండ్మెంట్‌ ద్వారా న్యాయవ్యవస్థకు స్వేచ్ఛ లేకుండాపోతుందని ఆరోపించారు.

ప్రెసిడెంట్‌కు పంపిన రాజీనామా పత్రంలో జస్టిస్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. “ఇది రాజ్యాంగంపై తీవ్రమైన దాడిగా నిలుస్తుంది” అని చెప్పారు. ఇది సుప్రీంకోర్టు ప్రధాన అధికారాలను లాక్కుంటుందని తెలిపారు.

రాజ్యాంగ సవరణను వ్యతిరేకిస్తూ జస్టిస్ అథర్ మినల్లా కూడా రాజీనామా చేశారు. మునీర్‌కు సుప్రీం పవర్స్ ఇస్తూ 27వ రాజ్యాంగ సవరణకు రాష్ట్రపతి అసిఫ్ అలీ జర్దారీ ఆమోదం తెలపడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

కొత్త చట్ట సవరణ ప్రకారం రాజ్యాంగ పరమైన అంశాల పరిశీలనకు కొత్త ఫెడరల్ కోర్టు ఏర్పడనుంది. సుప్రీంకోర్టు కేవలం సివిల్, క్రిమినల్ కేసుల వరకే పరిమితం కానుంది.