India – Smart Lockdown: స్మార్ట్ లాక్ డౌన్.. ఆల్రెడీ అక్కడ స్టార్ట్ అయిపోయింది..
దుబారా ఖర్చులు తగ్గించుకోండి, పొదుపు పాటించండి, త్యాగాలకు సిద్ధం కండి అంటూ ప్రధాని మోదీ చేసిన విజ్ఞప్తి దేశవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీసింది.
India – Smart Lockdown: పశ్చిమ ఆసియా సంఘర్షణ ప్రపంచంలోని అనేక దేశాలపై ప్రభావం చూపింది. పరిమితమైన ఇంధన, గ్యాస్ సరఫరాలతో దేశాలు నెట్టుకొస్తున్నాయి. హర్ముజ్ జలసంధికి కలిగిన అంతరాయం ఇంధన ప్రవాహాలను ప్రభావితం చేసింది. ఇంధనం, ఆహారం, రవాణా ఖర్చులను పెంచింది. ప్రపంచ సరఫరా గొలుసుపై పెరుగుతున్న ఒత్తిడి పాకిస్తాన్, యూఏఈ వంటి పొరుగు దేశాల ఆర్థిక వ్యవస్థలపై భారం మోపింది. ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభానికి ఆజ్యం పోస్తోంది. ఇదే సమయంలో భారత ప్రధాని మోదీ చెప్పిన పొదుపు సూత్రాలు దేశంలో చర్చకు దారితీశాయి.
ఇంధన వినియోగాన్ని తగ్గించడం, బంగారం కొనుగోళ్లను వాయిదా వేయడం, వర్క్ ఫ్రమ్ హోమ్ అవలంబించడం, విదేశీ ప్రయాణాలను పరిమితం చేసుకోవడం.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ చేసిన ఏడు విజ్ఞప్తులు పౌరుల్లో లాక్డౌన్ లాంటి మనస్తత్వాన్ని రేకెత్తించాయి. కోవిడ్ లా కాకపోయినా, ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ తరహా ‘స్మార్ట్ లాక్డౌన్’ ఆలోచనను భారత్ పరిగణనలోకి తీసుకుంటుందా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
పాకిస్థాన్ లాగా భారత్ కూడా ‘స్మార్ట్ లాక్డౌన్’ను పరిశీలిస్తుందా?
ఇంధన కొరత నేపథ్యంలో ఎనర్జీని ఆదా చేసేందుకు పాకిస్థాన్ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపార, కార్యకలాపాలపై ఆంక్షలతో కూడిన దేశవ్యాప్త “స్మార్ట్ లాక్డౌన్”ను ప్రకటించింది. ఈ ఆదేశం ప్రకారం పంజాబ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్, ఇస్లామాబాద్, గిల్గిత్-బాల్టిస్తాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని షాపింగ్ మాల్స్, వాణిజ్య కేంద్రాలు రాత్రి 8 గంటలకల్లా మూసివేయాలి. బేకరీలు, రెస్టారెంట్లు, తందూర్లు, ఫుడ్ అవుట్లెట్లు, మ్యారేజ్ హాల్స్‌ను కూడా రాత్రి 10 గంటలకల్లా మూసివేయాలి. ప్రైవేట్ నివాసాలలో జరిగే వివాహ కార్యక్రమాలకు కూడా ఇదే సమయం పాటించాలి. పెరుగుతున్న చమురు, ఇంధన ధరలను ఎదుర్కొనేందుకు పాకిస్థాన్ ఈ చర్యలు తీసుకుంది.
దుబారా ఖర్చులు తగ్గించుకోండి, పొదుపు పాటించండి, త్యాగాలకు సిద్ధం కండి అంటూ ప్రధాని మోదీ చేసిన విజ్ఞప్తి దేశవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీసింది. చాలామంది ఆయన విజ్ఞప్తులను కోవిడ్-19 లాక్డౌన్ కాలంలో కనిపించిన ఆంక్షలు, జీవనశైలి మార్పులతో పోలుస్తున్నారు. పశ్చిమ ఆసియా సంక్షోభంపై ఇటీవల పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తూ కోవిడ్ తరహా లాక్‌డౌన్‌ను సూచించారు ప్రధాని మోదీ. కోవిడ్-19 మహమ్మారిని ప్రస్తావించినప్పటికీ ఒక ప్రపంచ సంక్షోభాన్ని దేశం ఎలా ఎదుర్కొందో చెప్పడానికి దానిని ఒక ఉదాహరణగా మాత్రమే పేర్కొన్నారు. కోవిడ్ కాలంలో ఎన్నో అంతరాయాలను భారత్ అధిగమించిందని గుర్తు చేశారు. కష్ట సమయాల్లో జాతీయ ఐక్యత ప్రాముఖ్యతను ప్రధాని మోదీ నొక్కి చెప్పారు.
ప్రజలకు ప్రధాని మోదీ చేసిన 7 విజ్ఞప్తులు..
హైదరాబాద్ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్ లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ దేశ ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రపంచ ఇంధన సరఫరా గొలుసులో అంతరాయాలు, అంతర్జాతీయ సంఘర్షణల వల్ల పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని సూచించారు. బాధ్యతాయుతమైన వినియోగ అలవాట్లను అలవర్చుకోవాలని పౌరులను కోరారు.
దేశంపై దిగుమతుల భారాన్ని తగ్గించి, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు వంట నూనె వినియోగాన్ని తగ్గించుకోవాలని, ప్రజా రవాణాను ఉపయోగించుకోవాలని, కార్-పూలింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని, విద్యుత్ వాహనాలను వాడాలని, సహజ వ్యవసాయ పద్ధతుల వైపు మొగ్గు చూపాలని దేశ పౌరులకు మరీ మరీ విజ్ఞప్తి చేశారు ప్రధాని మోదీ. అలాగే ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు ఆపేయాలని, విదేశీ టూర్లకు వెళ్లొద్దని, దుబారా ఖర్చులు తగ్గించుకోవాలని కూడా రిక్వెస్ట్ చేశారు.
Also Read: మోదీ బంగారం కొనొద్దు అనడానికి అసలు కారణాలు ఇవన్నమాట.. పెద్ద ప్లానే
