Winter Storm In US : మంచు తుపానుతో వణికిపోతున్న అగ్రరాజ్యం..15లక్షల ఇళ్లకు నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
మంచు తుపానుతో అగ్రరాజ్యం అమెరికా వణికిపోతోంది. మరిగిపోయే నీరు కూడా మంచులా గడ్డకట్టిపోతోంది. మంచుతపానుతో 15లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

Winter Storm Knocks Out Power For 1.5 Million In US
Winter Storm In US : అగ్రరాజ్యం అమెరికా మంచు తుపానులో చిక్కుకుని గజగజా వణికిపోతోంది. సలసలా కాగే నీరు కూడా మంచులా గడ్డకట్టిపోతున్న పరిస్థితి. ఎక్కడపడితే అక్కడ మంచు పేరుకుపోతోంది.భారీగా కురుస్తున్న మంచు, చలిగాలులకు ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠానికి పడిపోయాయి. వాహనాలు కదలలేని స్థితిలో ఉన్నాయి. చెట్లు, నివాసాలు మంచు దుప్పటి కప్పుకున్నట్లుగా మారిపోయాయి. రక్తం గడ్డకట్టే చలిలో యూఎస్ వాసులు అల్లాడిపోతున్నారు. హీటర్లు వేసుకుని చలినుంచి రక్షణ పొందుదామంటూ విద్యుత్ సరఫరా కూడా నిలిపోయింది. దీంతో ప్రజలు చలినుంచి రక్షణపొందలేకపోతున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయి స్థానికంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. అమెరికా వ్యాప్తంగా 15లక్షలకు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో ప్రజలు అంధకారంలో మునిగిపోయారు. పగలే చీకట్లు ముసురుకుంటున్నాయి.పక్కనున్న మనిషే కనిపించని పరిస్థితి.
అమెరికా జాతీయ వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. శుక్రవారం (డిసెంబర్,2022) ఉష్ణోగ్రతలు -48 డిగ్రీలకు పడిపోయాయి. అమెరికా వ్యాప్తంగా 20కోట్ల మందికి పైగా ప్రజలు మంచు తుపానులో చిక్కుకుని నానా పాట్లు పడుతున్నారు. అన్ని రహదారులపైనే మంచు భారీగా పేరుకుపోయింది. క్రిస్మస్ పండుగల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లలేని పరిస్థితులున్నాయి. మరగబెట్టిన నీరు కూడా మంచుగడ్డగా మారిపోతోంది. మరోవైపు విద్యుత్ సరఫరా లేక, బయటకు వెళ్లలేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.
మంచు తుపానుతో విమాన సర్వీసులు కూడా రద్దు అయ్యాయి. వేలాది విమానాలు ఆలస్యంగా నడిస్తున్నాయి. ఒహైయోలో మంచు తుపాను ప్రభావానికి 50 వాహనాలు ఒకదానికొకటి ఢీకొటంతో ప్రాణాలు గాల్లో కలిసిపోయే పరిస్థితి నెలకొంది. ఓ వ్యక్తి మృతి చెందాడు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.