Air Vistara Flight : అబుదాబి – ముంబై ఎయిర్ విస్తారా విమానంలో మహిళ హల్‌చల్ .. సిబ్బందిపై దాడి, అర్థనగ్న ప్రదర్శన ..
ఎయిర్ విస్తారా ఫ్లైట్‌లో ఇటలీకి చెందిన 45ఏళ్ల మహిళ హల్‌చల్ చేసింది. సిబ్బందిపై దాడిచేయడంతో పాటు ఒంటిపై బట్టలు విప్పి అర్థనగ్నంగా కారిడార్లో నడిచింది. అబుదాబి నుంచి ముంబైకి వస్తున్న విమానంలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది.

Vistara Flight
Air Vistara Flight : విమానాల్లో ప్రయాణికుల దాడుల ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇటీవల ఓ వ్యక్తి వృద్ధ మహిళపై మూత్రం పోసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సదరు వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ఎయిర్ విస్తారా ఫ్లైట్‌లో ఇటలీకి చెందిన 45ఏళ్ల మహిళ హల్‌చల్ చేసింది. సిబ్బందిపై దాడిచేయడంతో పాటు ఒంటిపై బట్టలు విప్పి అర్థనగ్నంగా కారిడార్లో నడిచింది. అబుదాబి నుంచి ముంబైకి వస్తున్న విమానంలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, ఆ మహిళను పోలీసులు అరెస్టు చేసినట్లు ఎయిర్ విస్తారా మంగళవారం ధృవీకరించింది.
Go First Flight: ప్రయాణికుల్ని విడిచిపెట్టి వెళ్లిపోయిన విమానం.. పది లక్షల ఫైన్ వేసిన డీజీసీఏ
ఈ ఘటనపై ఎయిర్ విస్తారా ఓ ప్రకటన విడుద ల చేసింది. జనవరి 30న అబుదాబి నుంచి ముంబై వెళ్లే ఎయిర్ విస్తారా విమానం 30వ తేదీ తెల్లవారు జామున 2.03 గంటలకు అబుదాబీలో బయలు దేరింది. 2.30 గంటల సమయంలో ఎకానమీ క్లాస్‌లో కూర్చున్న మహిళ అకస్మాత్తుగా లేచి బిజినెస్ క్లాస్ లో కూర్చుంది. క్యాబిన్లోని ఇద్దరు సభ్యులు వెళ్లి ఆ మహిళతో మాట్లాడారు. తిరిగి తమ సీటుకు తిరిగి వెళ్లాలని కోరారు. అయితే, ఇటలీకి చెందిన 45ఏళ్ల పావోలా పెరూసియో అనే మహిళ తిరిగి ఆమె సీటుకు వెళ్లకపోగా సిబ్బందిపై దుర్భాషలాడిందని, ఓ సిబ్బందిపై దాడిచేయడంతో పాటు మరో సిబ్బందిపై ఉమ్మి వేసిందని ఎయిర్ విస్తారా ఆ ప్రకటనలో తెలిపింది. కొద్దిసేపటికే మహిళ తన ఒంటిపై బట్టలు విప్పి విమానంలోనే అర్థనగ్న ప్రదర్శన చేసినట్లు ఎయిర్ విస్తారా తన ప్రకటనలో తెలిపింది.
సుదీర్ఘ గొడవ అనంతరం మహిళలను అదుపులోకి తీసుకున్న సిబ్బంది.. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ కాగానే మహిళను విస్తారా భద్రతా అధికారులకు అప్పగించారు. ఆ తరువాత విమాన సిబ్బంది ఫిర్యాదుతో సహార్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఆ తరువాత ఆమెకు కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు తెలిసింది.