వీడియో వైరల్: దొంగతనం చేసిన చోటే కన్న బిడ్డను మరిచిపోయింది

డబ్బులెందుకు దండగ.. కొట్టేస్తే చాలు కదా? అనుకుంది ఓ మహిళ తన బిడ్డ కోసం కొనడానికి వెళ్లి అక్కడికి వెళ్లిన తర్వాత మనస్సు మార్చుకుని స్ట్రాలర్ దొంగతనం చేసింది. అంతవరకు బాగానే ఉంది కానీ, స్ట్రాలర్ దొంగతనం చేసి బయటకు వచ్చిన తర్వాత మహిళకు కొద్దిసేపటికి అసలు విషయం తెలిసింది. అదేమిటంటే ఆమె బేబీ స్ట్రోలర్‌ను దొంగిలించింది కానీ అదే షాపులో తన బిడ్డను మర్చిపోయి బయటకు వచ్చేసింది.
స్ట్రాలర్ దొంగతనం చేసిన దుకాణంలోనే బిడ్డను మర్చిపోయినట్లు గుర్తించిన మహిళ మళ్లీ అదే షాపుకు పరుగులు పెడుతూ వెళ్లింది. ఈఘటనంతా సీసీటీవీలలో రికార్డు అవగా.. వీడియో మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళ్తే ఈ ఘటన అమెరికాలోని న్యూజెర్సీలో చోటుచేసుకుంది. ఓ మహిళ తన బిడ్డ, ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి న్యూజెర్సీలోని ఓ స్టోర్ కి బేబీ స్ట్రాలర్ కొనడానికి వెళ్లింది.
ఆమె స్నేహితురాళ్లు ఇద్దరూ షాప్ యజమానితో మాట్లాడుతూ ఉండగా.. ఎవరూ చూడట్లేదని భావించిన సదరు మహిళ.. స్ట్రాలర్ ని దొంగతనం చేసి తెలివిగా బయటకు వచ్చేసింది. అయితే కంగారులో బిడ్డను మాత్రం షాపులోనే మర్చిపోయింది. బిడ్డను షాపులో మహిళ మర్చిపోయిన విషయం గమనించని స్నేహితురాళ్లు కూడా షాపు నుంచి బయటకు వచ్చారు. తర్వాత ఆమెకు తన బిడ్డ గుర్తుకు రావడంతో షాపుకు పరుగులు తీసింది.
అప్పటికే ఆమె దొంగతనం చేసినట్లు సీసీటీవీలో గుర్తించిన షాపు ఓనర్ బిడ్డ కోసం వచ్చిన మహిళను పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. ఈ వీడియోని ఆ షాపు ఓనర్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘‘స్ట్రాలర్ దొంగతనం చేయాలనే తొందరలో ఎవరి కోసమైతే ఆ దొంగతనం చేసారో వాళ్లనే వదిలేశారు. బిడ్డను మర్చిపోయి వెళ్లిన వాళ్లకు బుద్ధి రావాలని నేను సోషల్ మీడియాలో వీడియో షేర్ చేస్తున్నానంటూ” వీడియోని షేర్ చేశాడు షాపు ఓనర్.