Measles In Zimbabwe : జింబాబ్వేలో 6,291 మీజిల్స్ వ్యాధి కేసులు .. 700 మంది చిన్నారులు మృతి..

జింబాబ్వేను మీజిల్స్ వ్యాధి కలవరపరుస్తోంది. ఇప్పటికే జింబాబ్వే దేశ వ్యాప్తంగా 6,291 మీజిల్స్ వ్యాధి కేసులు నమోదు కాగా 700మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.

Zimbabwe Govt Says Measles Outbreak Has Killed 700 Children

Measles Outbreak Has Killed 700 Children Zimbabwe : కోవిడ్ తరువాత ఎన్నో రకాలు వ్యాధులు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. మంకీ పాక్స్ కేసులతో పలు దేశాలు అల్లాడుతుంటే జింబాబ్వేను మీజిల్స్ వ్యాధి కలవరపరుస్తోంది. ఇప్పటికే జింబాబ్వే దేశ వ్యాప్తంగా 6,291 మీజిల్స్ వ్యాధి కేసులు నమోదు కాగా 700మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. గత ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు మీజిల్స్ వ్యాధితో 700 మంది చిన్నారులు మరణించారని దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ వ్యాధి తీవ్రత దేశంలో ఎంతగా ఉందంటే..సెప్టెంబర్ 1న ఒక్క రోజే 37మంది చిన్నారులు చనియారు.

సెప్టెంబర్ 4 నాటికి దేశ వ్యాప్తంగా మొత్తం 6,291 కేసులు నమోదు అయ్యాయని ఆరోగ్యశాఖ వెల్లడించింది. అలా ఈ వ్యాధితో రెండు వారాల క్రితం 157మంది చిన్నారులు మరణించారని కానీ ఈ వ్యాధి అంతకంతకు పెరుగుతూ 700లమంది చిన్నారులను బలి తీసుకుందని తెలిపారు అధికారులు. అంటే రెండు వారాల క్రింతం కంటే మీజిల్స్ వ్యాధి నాలుగు రెట్లు పెరిగి చిన్నారుల ప్రాణాల్ని కబళిస్తుండటం ఆందోళనకు గురి చేస్తోంది.

మీజిల్స్ వ్యాధి బాధితుల్లో ఎక్కువగా వ్యాక్సిన్ తీసుకోని, పోషకాహార లోపం ఉన్న చిన్నారులే ఉంటున్నారని అధికారులు గుర్తించారు. అర్థం పర్థం లేని మూఢ నమ్మకాలతో చిన్నారులకు వ్యాక్సిన్ వేయించకపోవటంతో మరణాల సంఖ్య పెరుగుతోంది. మతపరమైన నమ్మకాలతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు వ్యాక్సిన్లు ఇప్పించటంలేదు. దీంతో మరణాల సంఖ్య తీవ్రమవుతోంది. ఆందళన కలిగిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకునే వ్యాక్సిన్ తప్పనిసరిచేసేలా కొత్త చట్టం తీసుకురావాలని జింబాబ్వే భావిస్తోంది. 6 నెలల నుంచి 15ఏళ్ల పిల్లలకు పెద్దఎత్తున మాస్ వ్యాక్సినేషన్, అవగాహనా కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. దీనికి మతపెద్దలు సహకరించాలని కోరుతోంది ప్రభుత్వం.

మీజిల్స్ వ్యాధి లక్షణాలు..
ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధుల్లో మీజిల్స్ కూడా ఒకటి. గాలి ద్వారా, తమ్ముడం, దగ్గడం వల్ల ఇతరులకు సులభంగా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన పిల్లలలో దగ్గు, జ్వరం, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కన్పిస్తాయి. వ్యాక్సిన్ తీసుకోని చిన్నారులకు ఈ వ్యాధి సోకితే తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

మీజిల్స్ వ్యాప్తిని నియంత్రించాలంటే 90శాతం మంది చిన్నారులకు వ్యాక్సిన్లు అందించాలని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా కారణంగా ఏర్పడిన ఇబ్బందుల వల్ల సేవలు నిలిచిపోయి పేద దేశాల్లో మీజిల్స్ విజృంభిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్‌లోనే హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.5కోట్ల మంది పిల్లలు సాధారణ వ్యాక్సిన్లు తీసుకోలేకపోయారని యూనిసెఫ్‌ గతంలోనే వెల్లడించింది. ఇది పిల్లల ప్రాణాలకు ప్రమాదమని హెచ్చరించింది.