‘ఆస్ట్రేలియాతో మ్యాచ్ తర్వాత కన్నీళ్లు వచ్చేశాయ్’

‘ఆస్ట్రేలియాతో మ్యాచ్ తర్వాత కన్నీళ్లు వచ్చేశాయ్’

VVS Laxman: ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో పరువు నిలబెట్టుకుంటే చాలనుకుని కొందరనుకుంటే.. డ్రాగా అయినా ముగిస్తారని మరికొంతమంది ఆశపడ్డారు. వ్యూహానికి ప్రతి వ్యూహంతో దెబ్బ కొట్టిన రహానె సేన కంగారూలను కంగుతినిపించి అసాధారణమైన జట్టును స్టార్ ప్లేయర్ల కొరతతో ఉన్న జట్టుతో ఢీ కొట్టి విజయకేతనం ఎగరేసింది. ఆ క్షణం టీమిండియాకే కాదు, క్రికెట్ ప్రపంచానికే ఆశ్చర్యంగా అనిపించింది.

ఈ విజయంపై సినీ, రాజకీయ, విదేశీ ప్రాంతాల నుంచి క్రీడాభిమానులంతా సంతోషం వ్యక్తం చేస్తే.. వీవీఎస్ లక్ష్మణ్ అయితే కాస్త భావోద్వేగం అధికమై కంటతడి పెట్టుకున్నారట. ఇటీవల ప్రఖ్యాత మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్ష్మణ్ దాని గురించి చెప్పారు.

‘బ్రిస్బేన్‌ టెస్టు ఆఖరి రోజు మ్యాచ్‌ను కుటుంబంతో కలిసి చూశా. రిషభ్‌, వాషింగ్టన్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో ఫోకస్ పీక్స్‌లో ఉంది. ఎలాగైనా సరే ఇండియా ఆసీస్‌తో టెస్టు సిరీస్‌ గెలవాలని బలంగా కోరుకున్నా. అడిలైడ్‌ పరాభవానికి బదులు తీర్చుకోవాలని భావించా. గబ్బా టెస్టుకు ముందు, బ్రిస్బేన్‌లో ఆడాలంటే ఇండియన్స్‌‌కు భయమంటూ కామెంట్లు వినిపించాయి. ఎక్కడైతే ఆసీస్‌కు మంచి రికార్డు ఉందో అక్కడే టీమిండియా గెలిచి చూపించింది. ఆ ఘటన నాకు చాలా ఎమోషనల్‌ అనిపించింది. సంతోషంతో కన్నీళ్లు వచ్చాయి’అని గుర్తు చేసుకున్నాడు లక్ష్మణ్.

దాంతో పాటు ఆసీస్‌ పర్యటనలో దొరికన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న తమిళనాడు బౌలర్‌ నటరాజన్‌పై వీవీఎస్‌ ప్రశంసలు కురిపించాడు. ‘నటరాజన్‌ అన్ని రకాల ప్రశంసలకు అర్హుడు. మంచివాళ్లకు మంచే జరుగుతుంది. అవకాశం కోసం ఎంతో ఓపికగా ఎదురుచూశాడు. మానసిక స్థైర్యంతో ముందుకు సాగాడు. బలమైన జట్టుపై విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించి తానేంటో నిరూపించుకున్నాడు’అని కొనియాడాడు.

నెట్‌బౌలర్‌గా ఆస్ట్రేలియాకు వెళ్లిన నటరాజన్‌.. 3 ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేశాడు. రెండు వన్డేల్లో, 6 టీ20ల్లో, 3 టెస్టుల్లో వికెట్లు పడగొట్టాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో లక్ష్మణ్‌ మెంటార్‌గా వ్యవహరిస్తున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరపున నటరాజన్‌ ఆడాడు.