‘హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం’ : జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తో టెన్ టివి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

Mayor Bontu Rammohan Interview : హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. నగర ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని చెప్పారు. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు లబ్ధిదారులకే అందేట్లు చూస్తామన్నారు. మేయర్ బొంతు రామ్మోహన్ తో టెన్ టివి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ నిర్వహించింది.
హైదరాబాద్ లో వర్షం తగ్గిన 48 గంటల్లో రహదారులను 80 శాతం మరమ్మతులు చేశామని చెప్పారు. ఇళ్లు, సెల్లార్లలో పేరుకుపోయిన మట్టిని 50 జెట్టింగ్ మిషన్లతో బయటికి తీసినట్లు తెలిపారు. బ్లీచింగ్, క్లోరోపిన్ పౌడర్ వేశామని తెలిపారు. చలికాలంలో సీజనల్ వ్యాధులు, అంటు రోగాలు ప్రభలకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు.
హైదరాబాద్ ను యధాస్థితికి తీసుకొచ్చామని తెలిపారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా తయారు చేసేందుకు కృష్టి చేస్తున్నామని చెప్పారు. గతంలో ఎంసీహెచ్ ను జీహెచ్ఎంసీ చేశారు కానీ దానికి తగ్గట్లు వసతులు కల్పించలేదని తాము వచ్చాక వసతులు కల్పించామని తెలిపారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. ఎన్ని చెప్పామో అన్ని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించినట్లు చెప్పారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో రాజకీయ ప్రమేయం ఉండదన్నారు. నాళాలు, మూసీ వెంబడి ఉన్న గుడిసెలను ఖాళీ చేయించి వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వనున్నట్లు తెలిపారు.
విజయాలకు పొంగిపోం, అపజయాలకు కుంగిపోమని చెప్పారు. ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమితో ఇబ్బంది పడే పరిస్థితి లేదన్నారు. క్యాడర్ ఇంకా అలర్ట్ గా పని చేసేందుకు అవకాశం లభించిందన్నారు. జీహెచ్ఎంసీ మేయర్ విషయంలో మహిళ రిజర్వేషన్ ఊందన్నారు.