Covid Vaccine : 2కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు…. ప్రపంచానికి అందిస్తామన్న చైనా
ఇందులో భాగంగానే కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ, వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగించలేకపోతున్న దేశాలకు చేయూత నందించాలని చైనా నిర్ణయించింది.

Vaccine
Covid Vaccine : కరోనా మహమ్మారి సృష్టికర్తగా ప్రపంచస్ధాయిలో దోషిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనా ప్రస్తుతం తనపై పడ్డ మచ్చను చెరుపుకునే ప్రయత్నాల్లో నిమగ్నమైంది. అగ్రరాజ్యం అమెరికాతోపాటు, పలు దేశాలు పదేపదే కోవిడ్ వ్యాప్తికి కారణం చైనానే అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలకు దిగుతున్న నేపధ్యంలో చైనా ఉక్కిరి బిక్కిరవుతుంది. ప్రపంచ దేశాల ముంగిట చైనా ప్రతిష్ట మసకబారుతుండటంతో అక్కడి పాలకులు అంతర్జాతీయ స్ధాయిలో వ్యూహరచనకు శ్రీకారం చుట్టారు.
ఇందులో భాగంగానే కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ, వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగించలేకపోతున్న దేశాలకు చేయూత నందించాలని చైనా నిర్ణయించింది. ఇదే విషయాన్ని చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ ప్రకటించారు. ఈ ఏడాది 2కోట్ల డోసుల కోవిడ్ వ్యాక్సిన్ లను ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
అదే క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్ధ డబ్ల్యూహెచ్ వో కొనసాగిస్తున్న కోవాక్స్ వ్యాక్సిన్ కార్యక్రమానికి 100 మిలియన్ అమెరికన్ డాలర్లు విరాళంగా ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇదిలావుంటే చైనాలో ప్రస్తుతం డెల్లా వేరియంట్ కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం చైనాలో 1800 డెల్టా కేసులు నమోదయ్యాయి. ఇందులో 527 కేసుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించలేదని నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకటించింది. కరోనా వైరస్ పుట్టుకకు మూలకారణంగా భావిస్తున్న వూహాన్ లో ప్రస్తుతం డెల్టా వేరియంట్ కేసులు కుప్పులు తెప్పలుగా వెలుగు చూస్తుండటంతో చైనా కలవరపాటుకు లోనవుతుంది.