జనవరి ‘క్రాక్’ బొమ్మ బ్లాక్‌బస్టర్..

2021 January: లాక్‌డౌన్ తర్వాత డిసెంబర్ చివరి వారం నుండి సినిమా హాళ్లకు ప్రేక్షకులు రావడంతో బాక్సాఫీస్ దగ్గర సందడి మొదలైంది. ఇక మేకర్స్ సంక్రాంతికి రిలీజ్‌లు ప్లాన్ చేసుకున్నారు. రవితేజ ‘క్రాక్’, రామ్ ‘రెడ్’, బెల్లంకొండ శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’, విజయ్ ‘మాస్టర్’, అల్లరి నరేష్ ‘బంగారు బుల్లోడు’, యాంకర్ ప్రదీప్ ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
‘జై సేన’, ‘మిస్టర్ అండ్ మిస్’, ‘అమ్మ దీవెన’, ‘కళా పోషకులు’, ‘చెప్పినా ఎవరూ నమ్మరు’ వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. చిన్న చిత్రాలుగా విడుదలైన ఈ సినిమాలను ప్రేక్షకులు పట్టించుకున్న దాఖలాలు లేవు.
ఇక మాస్ మహారాజా రవితేజ, గోపిచంద్ మలినేని కాంబోలో వచ్చిన మాస్ ఎంటర్‌టైనర్ ‘క్రాక్’ బ్లాక్‌బస్టర్ టాక్‌తో హైయ్యెస్ట్ కలెక్షన్లతో అదరగొట్టింది. రామ్ ‘రెడ్’ కూడా హిట్ టాక్ సొంతం చేసుకుంది. డబ్బింగ్ సినిమా అయినప్పటికీ విజయ్, విజయ్ సేతుపతి నటించిన ‘మాస్టర్’ మూవీకి ఆడియెన్స్ కనెక్ట్ అయ్యారు. ఫలితంగా బొమ్మ సూపర్ హిట్ అయ్యింది.
బెల్లంకొండ ‘అల్లుడు అదుర్స్’ అంటూ వచ్చినా పెట్టుబడిలో 60 శాతం మాత్రమే వెనక్కి రాబట్టి యావరేజ్ అనిపించుకున్నాడు. కొంత గ్యాప్ తర్వాత తన కామెడీతో అలరించాడానికి ‘బంగారు బుల్లోడు’ గా ఆడియెన్స్ ముందుకొచ్చిన అల్లరి నరేష్ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాడు. యాంకర్ ప్రదీప్ హీరోగా పరిచయం అయిన ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’ సినిమాకి ఊహించని విధంగా ప్రేక్షకాదరణ లభించింది. మొత్తానికి 2021 జనవరి నెలలో రవితేజ ‘క్రాక్’ బొమ్మ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.