విశాఖ కేంద్రంగా చిన్నారుల అక్రమ రవాణా….ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు

  • Published By: murthy ,Published On : July 27, 2020 / 08:16 PM IST
విశాఖ కేంద్రంగా చిన్నారుల అక్రమ రవాణా….ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు

Updated On : July 27, 2020 / 8:27 PM IST

విశాఖలో మరో దారుణం వెలుగు చూసింది. చిన్నారులను అక్రమ రవాణా చేస్తోన్నట్టు ముఠాను పోలీసులు గుర్తించారు. ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి ఎండీ ఆధ్వర్యంలో ఈ ముఠా నడుస్తున్నట్టు ఖాకీలు తేల్చారు. ముఠాగుట్టు రట్టు చేశారు.

విశాఖ నగరంలోని జిల్లా పరిషత్‌ దగ్గర యూనివర్సల్‌ సృష్టి ఫెర్టిలిటీ ఎండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఒకటి నిర్వహిస్తున్నారు. దీనికి ఎండీగా డాక్టర్‌ నర్మత ఉన్నారు. ఈ ఆస్పత్రికి కలకత్తా, విజయవాడ, భువనేశ్వర్‌, హైదరాబాద్‌లోనూ అనుబంధ హాస్పిటల్స్‌ ఉన్నాయి. సంతానం లేని వారికి సంతానం కలిగిస్తామని యూనివర్సల్‌ సృష్టి పెర్టిలిటీ సెంటర్‌ ప్రచారం చేసింది.

ఎలా వెలుగు చూసింది ?
విశాఖ జిల్లా వీ.మాడుగులకు చెందిన సుందరమ్మ అనే మహిళ భర్త చనిపోయిన తరువాత గర్భవతి అయింది. డెలివరి అయిన తరువాత బాబుని తీసుకు రాకుండా వచ్చింది. ఈ విషయం గమనించిన ఆ గ్రామ అంగన్ వాడీ కార్యకర్త ఐసీడీఎస్‌ అధికారులకు ఫిర్యాదు చేసింది. ఇదే సమయంలో మరో ఫిర్యాదు కూడా యూనివర్సల్‌ సృష్టి పెర్టిలిటీ ఆస్పత్రిపైనే ఐసీడీఎస్‌కు వచ్చింది. ఒకేసారి రెండు ఫిర్యాదులు ఒకే ఆస్పత్రిపై రావడంతో.. ఐసీడీఎస్‌ అధికారులు ఈ ఫిర్యాదులపై దృష్టి పెట్టారు. ఇందులో ఏదో జరుగుతోందన్న అనుమానంతో…. పోలీసులకు సమాచారం అందించారు.

ఆస్పత్రి ఎండీ అరెస్ట్
ఐసీడీఎస్‌ అధికారుల ఫిర్యాదుతో… పోలీసులు యూనివర్సల్‌ సృష్టి ఫెర్టిలిటీ హాస్పిటల్‌లో దాడులు నిర్వహించారు. ఆస్పత్రి యాజమాన్యం పిల్లల అక్రమ రవాణాకు పాల్పడుతోందని పోలీసులు తేల్చారు. దీంతో ఆస్పత్రి ఎండీ నర్మతను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. మరో ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. ఈ ముఠా ఇప్పటి వరకు ఆరుగురు చిన్నారులను ఇతరులకు విక్రయించి.. అక్రమ రవాణాకు పాల్పడినట్టు పోలీసు విచారణలో తేలింది.

పసి పిల్లలను ఎలా తీసుకుంటారు
ఈ కేసులో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముఠా గ్రామాల్లోని గర్భిణిలకు హెల్త్‌ క్యాంపులు నిర్వహిస్తుంది. అక్కడే పిల్లలు అవసరం లేని గర్భిణులను గుర్తిస్తారు. కొందరు ఆశా వర్కర్లు కూడా వీరికి సహాయం చేస్తున్నట్టు తెలుస్తోంది. గర్భిణీ డెలివరి అయ్యాక ఆమెకు కొద్దిమొత్తం ముట్టజెప్పి.. పుట్టిన శిశువును తీసేసుకుంటారు. ఎవరికైతే ఆ శిశువును విక్రయిస్తారో… బర్త్‌ సర్టిఫికెట్‌ కోసం జీవీఎంసీలో వారి పేర్లను అప్లై చేస్తారు. దీంతో భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఉండవని వీరి ఎత్తుగడ.

పేరు మార్చి మళ్లీ మొదలెట్టారు
2010, 2013లో సృష్టి హాస్పిటల్‌లో మోసాలు జరగడంతో… పోలీసులు కేసు నమోదు చేసి హాస్పిటల్‌ను సీజ్‌ చేశారు. దీంతో అదే యాజమాన్యం మరో కొత్తరూపంలో మోసాలకు తెరతీసింది. సృష్టి హాస్పిటల్‌ పేరును యూనివర్సల్‌ సృష్టి హాస్పిటల్‌గా మార్చి.. చిన్నారుల అక్రమ రవాణాకు తెరతీశారు. అయితే 2019 నుంచి ఇప్పటి వరకు ఈ ఆస్పత్రిలో 50 డెలివరీలు జరిగినట్టుగా పోలీసులు గుర్తించారు.

ఇందులో ఎంతమంది చిన్నారులను విక్రయించారన్న దానిపై కూపీ లాగుతున్నారు. విశాఖ పోలీస్‌ కమిషనర్‌ మొత్తానికి చిన్నారుల అక్రమ రవాణాకు పాల్పడుతోన్న ముఠాపై మరింత లోతుగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇంకెంత మంది ఉన్నారన్న దానిపై ఆరా తీస్తున్నారు.