తెలంగాణలో త్వరలో సినిమా షూటింగ్స్

తెలంగాణలో మళ్లీ సినిమా షూటింగ్స్ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కరోనా వైరస్ కారణంగా ఎక్కడికక్కడ షూటింగ్ లు ఆగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో దీనిపై ఆధారపడిన ఎంతో మంది జీవితాలు కష్టాల సుడిగుండంలో చిక్కుకపోయాయి. భారీ సినిమాలు, షూటింగ్ కంప్లీట్ అయి విడుదలయ్యే సినిమాలు ఉండడంతో దర్శక, నిర్మాతలకు నష్టం వాటిల్లింది. దీంతో సినీ రంగంలో ఉండే ప్రముఖుల సాయంతో రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారు. అంతకముందే దీనిపై ఆధార పడిన వారికి మేలు జరిగే విధంగా సీఎం కేసీఆర్ పలు చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. సీసీసీ ద్వారా వారికి సహాయ, సహకారాలు అందచేశారు. ఎంతో మంది ప్రముఖులు విరాళాలు అందచేశారు.
చిరంజీవి, నాగార్జున, ఇతర ప్రముఖులు మంత్రి తలసానితో చర్చలు జరిపారు. ఇవి సానుకూలంగా చర్చలు జరిగాయి. అనంతరం సీఎం కేసీఆర్ తో కూడా చర్చలు జరిపారు. షూటింగ్ జరుపుకొనేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉండడంతో దర్శక, నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు. దీనిపై ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ స్పందించారు. మంత్రి తలసానితో తనకు 30 ఏళ్ల అనుబంధం ఉందని, ఆయన రాజకీయాల్లో ఎదిగినా..తమతో రిలేషన్ మాత్రం అలాగే ఉందన్నారు.
తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసాని శ్రీనివాస్ యాదవ్, తలసాని సాయి కిరణ్ సిని కార్మికులకు నిత్యావసరాలు అందచేసిన సందర్భంగా ఆయన పై విధంగా స్పందించారు. పరిశ్రమ పరిస్థితులను సీఎం కేసీఆర్ అర్థం చేసుకున్నారని, త్వరలోనే సినిమా చిత్రీకరణలకు అనుకూలంగా జీవో ఇవ్వనున్నారని వెల్లడించారు.
తెలంగాణను సాధించడంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా…సీఎం కేసీఆర్ నడిపిస్తున్నారని, సినీ పరిశ్రమ మీద కూడా ఆయన ప్రత్యేక శద్ధ పెట్టారని తలసాని సాయి కిరణ్ వెల్లడించారు. తలసాని శ్రీనివాస్ కు సినిమాలంటే ఇష్టమని, ప్రతి సినిమాను తొలి రోజే చూస్తారన్నారు. సీసీసీ ద్వారా, మా ట్రస్ట్ ద్వారా సినీ కార్మికులను ఆదుకుంటామని తెలిపారు.
Read: సమంత పాత్రలో చూడాలని ఉంది, రష్మికను కోరిన అభిమానులు