KCR సాయంపై Col సంతోష్‌బాబు ఫ్యామిలీ ఆనందం

  • Published By: madhu ,Published On : June 20, 2020 / 02:31 AM IST
KCR సాయంపై Col సంతోష్‌బాబు ఫ్యామిలీ ఆనందం

Updated On : June 20, 2020 / 2:31 AM IST

వీరజవాన్లకు తెలంగాణ ప్రభుత్వం సాయం ప్రకటించడంపై సంతోష్‌బాబు భార్య సంతోషి, తండ్రి ఉపేందర్‌ స్పందించారు. తమ కుటుంబానికి సీఎం కేసీఆర్‌కు భరోసా ఇచ్చారంటూ హర్షం వ్యక్తం చేశారు. కొడుకు కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్న తమకు.. కేసీఆర్‌ ప్రకటించిన సాయం.. ఉపశమనాన్ని ఇచ్చిందన్నారు. బాధను కొంత దూరం చేసిందని చెప్పారు. ఇది తెలంగాణ బిడ్డకు దక్కిన గౌరవమన్నారు. తమ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటున్న ప్రభుత్వానికి వారు ధన్యవాదాలు తెలిపారు.

20మంది భారత జవాన్లు : – 
గాల్వాన్‌ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20మంది భారత జవాన్లు చనిపోయారు. ఇందులో తెలంగాణకు చెందిన కల్నల్‌ సంతోష్‌బాబు కూడా ఉన్నారు. కల్నల్‌ సంతోష్‌బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఆయన ఫ్యామిలీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ 5 కోట్ల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. అంతేకాదు… నివాస స్థలంతోపాటు…. సంతోష్‌బాబు భార్యకు గ్రూప్‌-1 స్థాయి ఉద్యోగం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. తాను స్వయంగా సంతోష్‌బాబు ఇంటికి వెళ్లి సాయం అందిస్తానని కేసీఆర్‌ తెలిపారు. కల్నల్‌ సంతోష్‌బాబుతోపాటు చనిపోయిన మరో 19మంది జవాన్లకు కేసీఆర్‌ సాయం ప్రకటించారు. ఒక్కో జవానుకు పది లక్షల సాయం అందించనున్నట్టు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తరపున.. కేంద్ర రక్షణ మంత్రిద్వారా జవాన్ల కుటుంబాలకు అందజేస్తామని తెలిపారు.

మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ : – 
వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలను ఆదుకోవాలని, తద్వారా సైనికుల్లో ఆత్మవిశ్వాసం, వారి కుటుంబాల్లో భరోసా నింపాలని కేసీఆర్‌…  కేంద్ర ప్రభుత్వానికి కూడా సూచించారు. మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో జరిగిన సమావేశంలో కేసీఆర్‌ సైనికులకు భరోసా ఇవ్వడంపైనా సూచనలు చేశారు.  దేశమంతా సైనికుల వెంట ఉందనే సందేశం అందించాలని పిలుపునిచ్చారు.

వీరమరణం పొందిన సైనికులకు కేంద్రం ఎలాగూ సాయం చేస్తుందని.. కానీ రాష్ట్రాలు కూడా సహాయ సహకారాలు అందించాలన్నారు. అప్పుడే సైనికులకు, వారి కుటుంబాలకు దేశం తమవెంట నిలుస్తుందనే నమ్మకం కలుగుతుందన్నారు. సింబల్‌ ఆఫ్‌ యూనిటీని ప్రదర్శించాలన్నారు సీఎం కేసీఆర్. 

Read: త్వరలో Col సంతోష్ బాబు ఇంటికి సీఎం కేసీఆర్