Eating Carrots : క్యారెట్ తినటం..గుండెకు మేలు
గుండె జబ్బులకు కారణభూతమయ్యే అథెరోస్కెలెరోసిస్ అభివృధ్ధి చెందకుండా క్యారెట్ దోహదం చేస్తుందని నిర్ధారించారు.

గుండెకు మేలు చేసే క్యారెట్
Eating Carrots : క్యారెట్ తినేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. ఆరంజ్ కలర్ లో నిగనిగలాడే క్యారెట్లను తినటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. చాలా మంది పచ్చివాటినే తినేందుకు ఇష్టపడుతుంటారు. మరొకొందరు జ్యూస్ గా, కర్రీగా చేసుకుని తింటారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. క్యారెట్ అధికంగా తీసుకుంటే కంటి చూపు మెరుగవ్వటంతోపాటు, రోగనిరోధక శక్తికూడా పెరుగుతుంది.
క్యారెట్ వల్ల మరో ప్రయోజనం కూడా ఉందంటున్నారు పరిశోధకులు. క్యారెట్ ను ఇష్టంగా తింటే గుండెకు చాలా మంచిదట. క్యారెట్ ను రోజువారి ఆహారంలో భాగం చేసుకునే వారిలో గుండె జబ్బులు వచ్చే శాతం చాలా తక్కువని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇల్లినాయిస్ యూనివర్శిటీ పరిశోధకులు తమ పరిశోధనల్లో ఈ విషయాన్ని నిర్ధారించారు. కెరోటిన్ క్యారెట్ లో పుష్కలంగా ఉండటం వల్ల అది శరీరంలోకి చేరుకుని విటమిన్ ఎ గామార్పు చెందుతుంది. ఇది రక్తంలో ఉన్న చెడు కొవ్వులను తగ్గిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు.
గుండె జబ్బులకు కారణభూతమయ్యే అథెరోస్కెలెరోసిస్ అభివృధ్ధి చెందకుండా క్యారెట్ దోహదం చేస్తుందని నిర్ధారించారు. మనుషులు , ఎలుకులపై వేరువేరుగా నిర్వహించిన అధ్యయనాల్లో క్యారెట్ వల్ల గుండెకు మంచి మేలు చేకూరుతున్నట్లు గుర్తించారు. ఇదిలా వుంటే క్యారెట్ వల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నట్లు అనేక అధ్యయనాల్లో తేలింది.
క్యారెట్ తినటం వల్ల తక్షణ శక్తి వస్తుంది. ఇందులో ఉండే సోడియం అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. రోజంతా శరీరం చురుకుదనంతో వ్యవహరించేలా చేస్తుంది. రోజు క్యారెట్ తీసుకునే వారిలో చర్మ నిగారింపుగా ఉంటుంది. పలు రకాల క్యాన్సర్లను సైతం నిలువరించే గుణం క్యారెట్లో ఉందని పరిశోధనల్లో తేలింది. ఇంత చక్కని గుణాలు కలిగిన క్యారెట్ ను, తినటం మాత్రం మర్చిపోకండి.