ప్రతివారం గ్రీన్ ఫ్రైడే, తెలంగాణలో మరో కొత్త కార్యక్రమం, ఆ రోజు ఏం చేయాలంటే..
ఇప్పటికే సీజనల్ వ్యాధుల నివారణకు 'ప్రది ఆదివారం పది గంటలకు పది నిమిషాలు' పేరుతో తెలంగాణ

ఇప్పటికే సీజనల్ వ్యాధుల నివారణకు ‘ప్రది ఆదివారం పది గంటలకు పది నిమిషాలు’ పేరుతో తెలంగాణ
ఇప్పటికే సీజనల్ వ్యాధుల నివారణకు ‘ప్రది ఆదివారం పది గంటలకు పది నిమిషాలు’ పేరుతో తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఓ కార్యక్రమం స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇంటిలో ఉన్న పూల కుండీలు, ఇతర ప్రాంతాల్లో నిల్ల ఉన్న నీటిని తీసేయాలి. తాజాగా ఆయన మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదే ‘గ్రీన్ ఫ్రైడే’. ప్రతి శుక్రవారం చెట్లను నాటడంతోపాటు వాటిని కాపాడాల్సిన బాధ్యత ఇందులో భాగం.
అన్ని పట్టణాల్లో ప్రతి శుక్రవారం గ్రీన్ ఫ్రైడే:
హరితహారం కార్యక్రమంలో భాగంగా అన్ని పట్టణాల్లో ప్రతి శుక్రవారాన్ని గ్రీన్ ఫ్రైడేగా పాటించాలని కేటీఆర్ కోరారు. జూన్ 20 నుంచి ప్రారంభం కానున్న ఆరో విడత హరితహారంలో పురపాలకశాఖ అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు, ప్రజలు చురుగ్గా పాల్గొనాలని ఆదేశించారు. మున్సిపాలిటీ చైర్మన్లు, మేయర్లు, కమిషనర్లు, జిల్లా అదనపు కలెక్టర్లతో మంత్రి కేటీఆర్ శనివారం(జూన్ 13,2020) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
గ్రీన్ ఫ్రైడే గురించి మంత్రి కేటీఆర్ సూచనలు:
* మున్సిపల్ చట్టం మేరకు పురపాలికల బడ్జెట్‌లో పదిశాతం నిధులను హరితపట్టణాలుగా మార్చేందుకు వినియోగించాలని సూచన.
* చెట్లను నాటడంతోపాటు వాటిని కాపాడాల్సిన బాధ్యత కూడా పురపాలకశాఖ, కమిషనర్లు, మేయర్లు, చైర్మన్లు, చైర్‌పర్సన్లదే.
* నాటిన చెట్లలో కనీసం 85శాతం కాపాడాలని కేటీఆర్ స్పష్టం.
* ప్రతి శుక్రవారం ‘గ్రీన్‌ఫ్రైడే’గా పాటించి నాటిన చెట్లను సంరక్షించేందుకు ప్రయత్నించాలి.
* ఇందుకోసం అవసరమైన నీటి వనరులను సమకూర్చుకోవాలి.
* చెత్తను డంప్ చేసే యార్డుల దగ్గర సువాసనలు వెదజల్లే మొక్కలు నాటాలి.
* పట్టణాల్లో మొక్కలను సాధ్యమైనంత ఎత్తయిన ప్రదేశాల్లో నాటడం ద్వారా వాటిని సంరక్షించడం సునాయాసమవుతుందని మంత్రి సూచన.
దోమలను తరిమే మొక్కలు నాటాలి:
హరితహారంలో దోమలను తరిమే ‘మస్కిటో రిపెల్లెంట్’ మొక్కలను నాటాలని మంత్రి కేటీఆర్ చెప్పారు. పట్టణాల్లోని ఖాళీ ప్రదేశాల్లో ఒక ట్రీ పార్కును ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం 90 పట్టణాలకు సమీపంలో అటవీ బ్లాకులు ఉన్నాయని, వాటిలో చెట్లు నాటాలన్నారు. గ్రీన్ బడ్జెట్ వినియోగంపై భవిష్యత్తులో సమీక్ష ఉంటుందని కేటీఆర్ తెలిపారు. అందువల్ల హరితహారం కార్యక్రమాన్ని లేదా గ్రీన్ బడ్జెట్‌ను చిన్నచూపు చూడరాదని హెచ్చరించారు. ప్రతి పట్టణంలో స్మృతివనాల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. హరితహారం కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు మున్సిపల్‌శాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించి, నిరంతరం సమీక్షించాలని సూచించారు.
రూ.1000 కోట్ల మేరకు నిధులు:
గతానికి భిన్నంగా ప్రతి నెల ఫైనాన్స్ కమిషన్ నిధులను ప్రభుత్వం నేరుగా పురపాలికలకు అందిస్తున్నదని, ఇప్పటివరకు సుమారు రూ.1000 కోట్ల నిధులు ఇచ్చామని మంత్రి కేటీఆర్ తెలిపారు. జీహెచ్‌ఎంసీ సహా అన్ని కార్పొరేషన్లకు ప్రతి నెల రూ.148 కోట్ల చొప్పున నేరుగా అందిస్తున్నామని చెప్పారు. ఈ నిధులతో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలన్నారు. వానకాలం ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్ వ్యాధుల నివారణకు కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. ఈ సీజన్ మొత్తం సాధారణంగా చేసే పారిశుద్ధ్యం కంటే అదనంగా నాలుగు రెట్లు ఎక్కువ కార్యక్రమాలను చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు. ఈ పనుల్లో పౌరుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రయత్నించాలని చెప్పారు. ఇందులో భాగంగానే ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాల పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నామని మంత్రి గుర్తుచేశారు. ఈ ఆదివారం జరిగే కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు సహా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. వాన కాలంలోనే కాకుండా మురికి కాల్వలు, వాననీటి కాల్వల పూడికతీత పనులను నిరంతరం కొనసాగించాలని సూచించారు. వానకాలంలో నీళ్లు నిలిచిపోయే ప్రాంతాలు, వాటర్ లాగింగ్ పాయింట్లు, మ్యాన్‌హోళ్ల దగ్గర ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటుచేయాలని ఆదేశాలు జారీచేశారు కేటీఆర్.