Indian Racing League : హైదరాబాద్ కార్ రేసింగ్‌లో మరో ప్రమాదం, రెండు రేస్ కార్లు ఢీ

హైదరాబాద్ ఇండియన్ కార్ రేసింగ్ లీగ్ లో మరో ప్రమాదం జరిగింది. ఎన్టీఆర్ మార్గ్ లో సింగిల్ సీటర్ స్ప్రింటర్ రేస్ లీగ్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Indian Racing League : హైదరాబాద్ కార్ రేసింగ్‌లో మరో ప్రమాదం, రెండు రేస్ కార్లు ఢీ

Updated On : November 20, 2022 / 6:14 PM IST

Indian Racing League : హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఇండియన్ కార్ రేసింగ్ లీగ్ లో మరో ప్రమాదం జరిగింది. ఎన్టీఆర్ మార్గ్ లో సింగిల్ సీటర్ స్ప్రింటర్ రేస్ లీగ్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్ప్రింటర్ రేస్ ట్రాక్ మళ్లింపు వద్ద రెండు రేస్ కార్లు ఢీకొట్టుకున్నాయి. టర్నింగ్ వద్ద రెండు రేసింగ్ కార్లు అత్యంత సమీపంగా వేగంగా వెళ్లి ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో రెండు రేసింగ్ కార్లు ధ్వంసం అయ్యాయి.

చెన్నై టర్బోరైడర్స్‌ కారును గోవా ఏసెస్ రేసింగ్ కారు ఢీకొట్టింది. హుస్సేన్‌సాగర్‌ తీరాన ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌లో ట్రయల్‌ ఆకట్టుకుంది. శనివారం కార్ల రేస్‌ ఉత్కంఠగా సాగింది. రెప్పపాటు వేగంతో దూసుకెళ్లిన కార్లను చూసి అంతా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఎన్టీఆర్‌ గార్డెన్‌ చుట్టూ హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో సిద్ధం చేసిన 2.7 కిలోమీటర్ల రేసింగ్‌ ట్రాక్‌పై శనివారం మధ్యాహ్నం కార్లు దూసుకెళ్లాయి.

హైదరాబాద్ లో ఇండియన్ రేసింగ్ లీగ్ రెండో రోజూ కొనసాగుతోంది. విదేశాల్లో ట్రాక్‌పై కార్లు పరుగెడుతుంటే టీవీల్లో చూసిన అభిమానులు.. ఇప్పుడు అలాంటి రేసులను హైదరాబాద్‌లో నేరుగా వీక్షించి ఎంజాయ్ చేస్తున్నారు. దేశంలోనే మొట్టమొదటిగా ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ నగరంలోని హైదరాబాద్‌ స్ట్రీట్‌ సర్క్యూట్‌లో శనివారం ఆరంభమైంది. లీగ్‌లో భాగంగా తొలి రౌండ్‌ పోటీలకు హుస్సేన్‌సాగర్‌ పరిసరాల్లో నిర్మించిన కొత్త ట్రాక్‌ వేదికైంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

కళ్లు మూసి, తెరిచే లోపు దూసుకెళ్లే కార్లతో.. రయ్‌.. రయ్‌.. శబ్దాలతో హుస్సేన్‌సాగర్‌ పరిసరాలు హోరెత్తాయి. మొట్టమొదటి ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ (ఐఆర్‌ఎల్‌) ఘనంగా ఆరంభమైంది. హైదరాబాద్‌లో కొత్తగా నిర్మించిన ట్రాక్‌పై కార్లు పరుగులు తీశాయి. హైదరాబాద్‌ స్ట్రీట్‌ సర్క్యూట్‌పై రేసర్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. దేశంలో మోటార్‌ స్పోర్ట్స్‌కు ఆదరణ పెంచే దిశగా రేసింగ్‌ ప్రమోషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ శ్రీకారం చుట్టిన ఈ లీగ్‌ తొలి రౌండ్‌కు భాగ్యనగరం వేదికగా నిలిచింది.

ఆదివారం రెండు స్ప్రింట్‌, ఒక ఫీచర్‌ రేసులు జరుగుతున్నాయి. హైదరాబాద్‌ బ్లాక్‌బర్డ్స్‌, గోవా ఏసెస్‌, చెన్నై టర్బో రైడర్స్‌, బెంగళూరు స్పీడ్‌స్టర్స్‌, స్పీడ్‌ డెమాన్స్‌ ఢిల్లీ, గాడ్‌స్పీడ్‌ కోచి.. ఇలా ఆరు జట్లు ప్రధాన రేసులకు సిద్ధమయ్యాయి. ఒక్కో జట్టు నుంచి ఓ అమ్మాయితో సహా నలుగురు రేసర్లు పోటీ పడుతున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్ల రేసులు జరుగుతాయి.

గరిష్ఠంగా 260 కిలోమీటర్ల వేగం..
ఈ లీగ్‌లో పాల్గొన్న కార్లన్నీ పెట్రోల్ తో నడిచేవి. కారు గరిష్ఠ వేగం 260 కిలోమీటర్లు. 2.7 కిలోమీటర్ల ట్రాక్‌ను ఒక్కో కారు నిమిషం నుంచి ఒకటిన్నర నిమిషంలో చుట్టి వచ్చేశాయి. రెప్పపాటుతో దూసుకెళ్తున్న కార్లను ఫోన్లలో బంధించేందుకు చాలా మంది ఆసక్తి కనబరిచారు. ఎలక్ట్రికల్‌ కార్లయితే గరిష్ఠంగా 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని నిర్వాహకులు తెలిపారు. పురుషులతో పోటీ పడి మహిళా రేసర్లు రయ్యుమంటూ కార్లను నడిపారు. కార్లు దూసుకెళ్తున్న శబ్ధం కిలోమీటర్ల మేర వినిపించింది.

పకడ్బందీగా ఏర్పాట్లు..
రేస్‌ కారు అదుపు తప్పినా బయటకు దూసుకురాకుండా ఇరువైపులా బారీకేడ్లను ఏర్పాటు చేశారు. 15 అడుగుల మేర భారీ ఇనుప కంచెను ఉంచారు. 2.7 కిలోమీటర్ల ట్రాక్‌పై 17 మలుపులున్నాయి. ప్రతీ మలుపు వద్ద ప్రముఖ ఆస్పత్రికి చెందిన వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పదికి పైగా అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచారు. అవసరమైతే అత్యవసర చికిత్స అందించే వైద్య సిబ్బందిని నియమించారు.

నెక్లెస్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన 2.7 కిలోమీటర్ల ప్రత్యేక ట్రాక్‌లో ఈ పోటీలు సాగుతున్నాయి. 6 బృందాలుగా మొత్తం 24 మంది రేసర్లు పాల్గొంటున్నారు. ఈ రేసింగ్‌లో సగం మంది రేసర్లు మన దేశానికి చెందిన వారు కాగా, మరో సగం మంది విదేశాలకు చెందిన వారు. ఐమాక్స్‌ ఇందిరా గాంధీ విగ్రహం వద్ద నుంచి ఎన్టీఆర్‌ మార్గ్‌, లుంబినీ పార్క్‌, ఎన్టీఆర్‌ పార్క్‌, ఐమ్యాక్స్‌ వరకూ రేస్‌ సర్య్కూట్‌ ఏర్పాటు చేశారు. రేసింగ్‌ ట్రాక్‌ను సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు వేలాది మంది ప్రేక్షకులు కూర్చునేలా గ్యాలరీలు ఏర్పాటుచేశారు.

మరోవైపు ప్రసాద్ ఐమ్యాక్స్ దగ్గర అభిమానులను పోలీసులు అనుమతించకపోవడం వివాదానికి దారితీసింది. వీఐపీ టికెట్ ఉన్నా గ్యాలరీ లోపలికి అనుమతించలేదు. రూ.6వేల నుంచి రూ.12వేల వరకు డబ్బులు పెట్టి అభిమానులు టికెట్లు కొన్నారు. టికెట్ తీసుకున్న వారితో కాకుండా వీఐపీ, పోలీస్ కుటుంబసభ్యులతో వీఐపీ గ్యాలరీ నిండింది. ఓవర్ లోడ్ అంటూ టికెట్లు తీసుకున్న వారిని సిబ్బంది లోనికి పంపలేదు. దీంతో అభిమానులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుపై అభిమానులు మండిపడ్డారు.