రండి..వచ్చేయండి : తెలంగాణకు వలస కూలీలు..పూలు చల్లి స్వాగతం

దిక్కుమాలిన కరోనా వైరస్ కారణంగా భారతదేశంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. 2020, మే 17 వరకు కొనసాగనుంది. ఈ లాక్ డౌన్ వలస కూలీలపై పెను ప్రభావం చూపింది. ఉఫాది లేకపోవడంతో…సొంతూరికి వెళ్లిపోవాలని డిసైడ్ అవుతున్నారు. ఇప్పటికే చాలా మంది వెళ్లిపోయారు కూడా. వీరు వెళ్లడానికి కేంద్రం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో సీన్ రివర్స్ అవుతోంది. మళ్లా తెలంగాణకు వలస కూలీలు క్యూ కడుతున్నారు. తొలి విడతగా…బీహార్ రాష్ట్రంలోని ఖగారియా నుంచి ప్రత్యేక శ్రామిక్ ఎక్సప్రెస్ రైలులో 225 మంది వలస కూలీలు లింగంపల్లి స్టేషన్ కు చేరుకున్నారు.
వలస కూలీలు తిరిగి వస్తున్నారని తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకొంటోంది. వసల కూలీలకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమాలకర్, ఇతర అధికారులు పూలు చల్లి స్వాగతం పలికారు. వీరికి మాస్క్ లు, వాటర్ బాటిల్స్ అందించారు. ఇప్పుడు వచ్చిన వసల కూలీలు రైస్ మిల్లులో పనిచేయడానికి వచ్చారని మంత్రి గంగుల వెల్లడించారు.
లాక్ డౌన్ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వలస కూలీలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎక్కడకు వెళ్లనవసరం లేదని, వీరిని ఆదుకుంటామని స్వయంగా సీఎం కేసీఆర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. వీరితో పనిచేయిస్తున్నవారు ప్రత్యేక దృష్టి పెట్టాలని, వారికి వసతి, భోజనం ఏర్పాటు చేయాలని సూచించారు. అంతేగాకుండా..ప్రభుత్వం రూ. 500, బియ్యాన్ని అందిస్తామన్నారు. చెప్పినట్లుగానే వారికి నగదు, బియ్యాన్ని అధికారులు అందించారు. ప్రస్తుతం సొంత గ్రామాలకు వెళ్లిన వారు తెలంగాణకు తిరిగి రావడం శుభపరిణామంగానే చెప్పవచ్చు.