నైరుతి వచ్చేస్తోంది..మరో తుఫాన్ ముప్పు

నైరుతి రుతుపవనాలు 2020, జూన్ 01వ తేదీ సోమవారం కేరళను తాకే అవకాశమున్నదని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇందుకు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్టు వెల్లడించింది. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ వరకు రుతుపవనాల విస్తరణ సాధారణగా ఉంటుందని, వంద శాతం వర్షపాతం నమోదవుతుందని ఏప్రిల్ 15న జారీ చేసిన తొలి దశ అంచనాల్లో IMD తెలిపింది. అయితే సోమవారం కేరళను నైరుతి రుతుపవనాలు తాకగానే రెండో దశ అంచనాలను విడుదల చేస్తామని చెప్పింది.
మరోవైపు నైరుతి రుతుపవనాల విస్తరణ చురుగ్గా ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. విస్తరణ ఇదే స్థాయిలో కొనసాగితే ఈ నెల రెండో వారం ప్రారంభానికి నైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకే అవకాశమున్నదని చెప్పారు. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదుకావచ్చని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. దేశానికి మరో తుపాన్ ముప్పు పొంచి ఉన్నది. ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్ మధ్య అల్ప పీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది.
సోమవారం వాయుగుండంగా, మరుసటి రోజుకు తుపాన్‌గాను మారవచ్చని తెలిపింది. దీనికి నిసర్గా అని పేరు కూడా పెట్టింది. ఇది ఉత్తర దిశగా కదిలి ఈ నెల 3 నాటికి గుజరాత్, ఉత్తర మహారాష్ట్ర తీరానికి చేరవచ్చని అంచనా వేసింది. దీని ప్రభావం వల్ల సోమవారం పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. లక్షద్వీప్, కేరళ, కర్ణాటక తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఈ నెల 3, 4 తేదీల్లో దక్షిణ గుజరాత్, ఉత్తర కొంకణ్, మధ్య మహారాష్ట్ర, డయ్యూ , డామన్, దాద్రా అండ్ నగర్ హవేలిలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
కర్ణాటక, దక్షిణ మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో ఈ నెల జూన్ 2న గంటకు 75 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముంది. 3న తూర్పు మధ్య, ఈశాన్య అరేబియా సముద్రంలోని మహారాష్ట్ర, గుజరాత్ తీర ప్రాంతాల్లో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశమున్నదని ఐఎండీ తెలిపింది. ఈ నేపథ్యంలో నెల 4 వరకు ఆయా తీర ప్రాంతాల్లోని మత్సకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది. (భారీ వర్షం,ఉరుములతో దెబ్బతిన్న తాజ్ మహల్)