Movie Theaters: మూవీ లవర్స్ థియేటర్లో సినిమా చూసేందుకు సిద్దంకండి!

Movie Theaters
Movie Theaters: కరోనా మహమ్మారి సమాజంలో చాలా రంగాలలో చాల రకాల మార్పులు తెచ్చింది. అందులో సినీ రంగం కూడా ఒకటి. గత ఏడాది కరోనా వైరస్ మన దేశంలో అడుగుపెట్టినప్పటి నుండి ఎంతగానో ప్రభావితమైంది సినీ పరిశ్రమ. కరోనా ఫస్ట్ వేవ్ దెబ్బకు దేశవ్యాప్తంగా ఎన్నో థియేటర్స్ శాశ్వతంగా మూతపడగా.. మరికొన్ని సెకండ్ వేవ్ దెబ్బకు కనిపించకుండాపోతున్నాయి. ఫస్ట్ వేవ్ నుండి కోలుకొని కాస్త ఊపిరి పీల్చుకొని ఒకటీ, రెండు సినిమాలు పడగానే మళ్ళీ మహమ్మారి విస్తృత వ్యాప్తితో మూతపడాల్సి వచ్చింది.
కేవలం సినిమానే నమ్ముకున్న థియేటర్స్ సినీ పరిశ్రమ మూత పడడంతో తీవ్రంగా నష్టపోయాయి. మరోవైపు ప్రేక్షకులు కూడా ఓటీటీలకు బాగా అలవాటు పడిపోతున్నారు. మరోపక్క ఇప్పట్లో కరోనా భయాలు ప్రజలలో పూర్తిగా తొలిగే అవకాశం కూడా లేదు. అయితే, థియేటర్లోనే సినిమా చూడాలి.. ఆ అనుభూతి, మజానే వేరు అనుకొనే ప్రేక్షకులు కూడా ఉంటారు. వారికి త్వరలోనే మళ్ళీ శుభవార్త వచ్చే అవకాశం ఉంది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతుంది. రోజువారీ కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుతూ వస్తుంది.
ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీలో లాక్ డౌన్ సడలింపులు ఖరారైంది. పాజిటివిటీ రేటు ఆధారంగా మహారాష్ట్రలో సోమవారం నుండి థియేటర్స్ కు కూడా అనుమతినిచ్చారు. సీటింగ్ కెపాసిటీ, ఆక్యుపెన్సీలలో మాత్రం మరికొన్ని రోజులు ఆంక్షలు అమల్లో ఉండనుండగా మొత్తం మీద మళ్ళీ థియేటర్ల తలుపులు తెరుచుకోనున్నాయి. మన తెలుగు రాష్ట్రాలలో సైతం కేసులు భారీగా తగ్గుతుండడంతో త్వరలోనే ఆంక్షలతో లాక్ డౌన్ సడలింపులు ఇచ్చే అవకాశం ఉండగా మళ్ళీ సినీ పరిశ్రమలో కూడా కదలికలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు ల్యాబ్స్ నుండి బయటికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి.