హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌పై కొనసాగుతోన్న సస్పెన్స్‌

  • Published By: madhu ,Published On : July 5, 2020 / 07:58 AM IST
హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌పై కొనసాగుతోన్న సస్పెన్స్‌

Updated On : July 5, 2020 / 8:18 AM IST

జీహెచ్‌ఎంసీ పరిధిలో లాక్‌డౌన్‌ విధించడంపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. గ్రేటర్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి మళ్లీ కఠిన లాక్‌డౌన్‌ విధించాలనే ఆలోచనలను ప్రభుత్వం విరమించుకున్నట్టుగా తెలుస్తోంది. 15 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించాలని వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనలు చేసింది.

అందరిలో ఉత్కంఠ : –
దీనిపై మంత్రివర్గంలో చర్చించి మూడు నాలుగు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతనెల 28న ప్రకటించారు. ఈ ప్రకటన చేసి దాదాపు వారం రోజులు గడుస్తున్నా… ప్రభుత్వం నుంచి ఈ విషయంలో ఎలాంటి ప్రకటనా రాలేదు. దీంతో అసలు లాక్‌డౌన్‌ ఉంటుందా.. ఉండదా అన్న ఉత్కంఠ హైదరాబాదీయులతోపాటు.. వ్యాపార, వాణిజ్య వర్గాల్లో పెరిగిపోయింది.

ప్రజల అభిప్రాయాలు : –
గ్రేటర్‌లో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తే ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయన్న అంశంపై ప్రభుత్వం విస్తృత అధ్యయనం నిర్వహించింది. వైద్యరంగ నిపుణులతో పాటు రాజకీయ నేతలు, వ్యాపార, పారిశ్రామిక వేత్తలు, సాధారణ ప్రజల అభిప్రాయాలు సైతం సేకరించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా వైరస్‌ వ్యాప్తి ఉధృతంగా ఉండటంతో లాక్‌డౌన్‌ విధించడమే సరైందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.

వైద్య నిపుణుల సూచనలు : –
మరికొందరు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించినట్టుగా తెలుస్తోంది. లాక్‌డౌన్‌ ఎంత కఠినంగా అమలు చేసినా కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టలేమని ఇప్పటికే తేలిపోయిందని వైద్య నిపుణులతో పాటు వివిధ రంగాల వ్యక్తులు ప్రభుత్వానికి సూచనలు చేసినట్టు చర్చ జరుగుతోంది.  గ్రేటర్‌లో వైరస్‌ సామాజిక వ్యాప్తి ప్రారంభ దశకి చేరుకుందని.. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ విధించినా పెద్దగా ప్రయోజనం ఉండదని వైద్య నిపుణులు తేల్చిచెప్పినట్టు సమాచారం.

ఆర్థిక పరిస్థితులు : –
రానున్న రోజుల్లో కరోనా రోగుల సంఖ్య భారీగా పెరగనుందని, అవసరమైన వారందరికీ వైద్య సదుపాయాలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని వారు ప్రభుత్వానికి సూచనలు చేసినట్టుగా సమాచారం.  దశల వారీగా లాక్‌డౌన్‌ను సడలిస్తూ వస్తుండడంతో ఇప్పుడిప్పుడే అన్ని రకాల వ్యాపారాలు, వాణిజ్యం పుంజుకుంటోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రాబడి సైతం గణనీయంగా పెరిగింది. ఆర్థికంగా పరిస్థితులు క్రమంగా చక్కదిద్దుకుంటున్నాయి.

లాక్ డౌన్ విధిస్తే : –
చిరు వ్యాపారులు సైతం నిలదొక్కుకుంటున్నారు. దినసరి కూలీలకు మళ్లీ పని దొరుకుతుండడంతో పస్తులు ఉండాల్సిన దుస్థితి నుంచి క్రమంగా బయటపడుతున్నారు. ఈ పరిస్థితిలో లాక్‌డౌన్‌ విధిస్తే మళ్లీ అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని, దీనివల్ల ఆశించిన ప్రయో జనం పెద్దగా ఉండదని ప్రభుత్వానికి సూచనలు అందాయి.

ప్రభుత్వ ప్రకటన : –
లాక్‌డౌన్‌ విధింపుకన్నా… వద్దన్న సూచనలే వస్తుండడంతో ప్రభుత్వం కూడా లాక్‌డౌన్‌పై ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మరికొన్ని రోజులపాటు పరిస్థితులను అంచనా వేసిన తర్వాత దీనిపై ప్రకటన చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. లాక్‌డౌన్‌లాంటి పెద్ద నిర్ణయం కోసం ప్రభుత్వ, పోలీసు యంత్రాంగాన్ని సిద్ధం చేయాల్సి ఉంటుంది.

మంత్రివర్గ సమావేశం : –
అయితే ఆ దిశగా ఇటు ప్రభుత్వ యంత్రాంగానికి, అటు పోలీసులకు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సూచనలు రాలేదు. దీంతో లాక్‌డౌన్‌ విధింపులేనట్టుగా అందరూ భావిస్తున్నారు. మంత్రివర్గాన్ని సమావేశపరిచి లాక్‌డౌన్‌పై మూడు నాలుగు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ ప్రకటించి వారం రోజులు గడిచిపోయింది.

లాక్ డౌన్ విధించే ఛాన్స్ లేదు : –
అసలు మంత్రివర్గ భేటీ ప్రతిపాదనలే ఇప్పటివరకు లేవని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మళ్లీ లాక్‌డౌన్‌ విధించే ఆలోచనే లేదని, ప్రస్తుతం అన్‌లాక్‌ దశలో ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ సైతం సీఎం కేసీఆర్‌కు ఇటీవల ఓ వీడియో కాన్ఫరెన్స్‌లో తెలియజేశారు. దేశం అంతటా అన్‌లాక్‌ అవుతున్న తరుణంలో మళ్లీ హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ విధిస్తే ఇతర మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్‌ వ్యాపార, వాణిజ్యపరంగా తీవ్రంగా నష్టపోయే అవకాశముందని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.

మొత్తానికి హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ విధించే అవకాశం ఉండబోదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. జరుగుతున్న పరిణామాలు కూడా దీన్నే బలపరుస్తున్నాయి. అయితే ఆదివారం, సోమవారం దీనిపై సీఎం కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి ఓ ప్రకటన చేసే అవకాశం మాత్రం ఉంది.