తలైవా వస్తున్నాడు : డిసెంబరు 31న రాజకీయ పార్టీపై ప్రకటన

Rajinikanth political party : రాజకీయ రంగప్రవేశంపై చాన్నాళ్ల పాటు వాయిదా వేస్తూ వచ్చిన తమిళ తలైవా రజనీ కీలక ప్రకటన చేశారు. డిసెంబరు 31న పార్టీకి సంబంధించిన తొలి ప్రకటన వస్తుందని, మరిన్ని వివరాలు జనవరిలో వెల్లడిస్తానని చెప్పారు. దీంతో రజనీ రాజకీయ ప్రయాణంపై అనేక అంచనాలు నెలకొన్నాయి. పార్టీ నిర్మాణం, జెండా, ఎజెండా , ఎన్నికల గుర్తు తదితర అంశాలన్నీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. రజనీకాంత్ రాజకీయ ప్రకటన తేదీ దగ్గర పడుతున్న కొద్దీ పార్టీ పేరు, చిహ్నం, జెండా ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో నెలకొంది.
పార్టీ పేరు, గుర్తు, జెండా విషయంలో రజనీ కాంత్ బృందం అత్యంత గోప్యతను పాటిస్తున్నా… పార్టీ ఎన్నికల గుర్తు, జెండాకు సంబంధించి లీకులు వస్తున్నాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రజనీ పార్టీ ఎన్నికల గుర్తుగా సైకిల్ ఉండబోతున్నట్టు సమాచారం. పార్టీ జెండా మూడు వర్ణాలతో ఉండవచ్చని తెలుస్తోంది. రజనీకాంత్ పార్టీ ప్రకటనకు వేదికగా తిరుచ్చి లేదా మదురైను ఎంపిక చేయాలనే ఆలోచనలో బృందం ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం కరోనా నిబంధనలు అమల్లో ఉన్న దృష్ట్యా, బహిరంగ సభకు అనుమతి దక్కుతుందా లేదా దక్కపోతే ఏం చేయాలనే దానిపై చర్చించారు. మరోవైపు రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణ గురువారం తిరువణ్ణామలైకు వెళ్లారు. అరుణ గిరినాథర్ ఆలయంలో యాగం, హోమంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆథ్యాత్మికతను నమ్మని ద్రవిడ పార్టీలకు చివరి గడియలు సమీపిస్తున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వరుసగా జరుగుతున్న సంఘటనలతో ఈ నెల 31న రాజకీయ పార్టీ ప్రకటన, జనవరిలో పార్టీతో ప్రజల్లోకి రజనీ రావడం ఖాయమేనని తెలిసిపోయింది. ఇక అంతకుముందు ముఖ్యనేతలు అర్జున్‌మూర్తి, తమిళ రవి మణియన్‌లతో సమావేశం అయ్యారు. త్వరలో ప్రకటించబోయే పార్టీ ప్రకటనకు అవసరమైన కార్యాచరణపై వీరు ప్రధానంగా చర్చించారు. పార్టీ రిజిస్టర్ వ్యవహారాలను ఎవరికి అప్పగించాలి, అందుకు అవసరమైన అంశాలపై కూడా దృష్టి పెట్టేలా ఈ సమావేశం సాగినట్టు సమాచారం. మక్కల్ మండ్రం పోస్టర్లలో రజనీ ఫొటో మాత్రమే ఉండాలని నిర్ణయించారు.
రాజకీయాల్లో ఇప్పటికే సైకిల్ గుర్తుకు ఘనమైన చరిత్ర ఉంది. వెండితెర వేల్పుగా వెలుగొందిన ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్ కావడం విశేషం. సైకిల్ గుర్తుపై పోటీ చేసిన ఎన్టీఆర్ కేవలం ఆర్నేళ్ల వ్యవధిలోనే పార్టీ స్థాపన.. ప్రచారం.. ఎన్నికలకు వెళ్లి విజయం సాధించారు. సరిగ్గా ఎన్టీఆర్ తరహాలోనే రజనీ సైతం తక్కువ కాలంలోనే అసెంబ్లీలో విజయం సాధించేందుకు సైకిల్ గుర్తు సాయం చేస్తుందని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. మరోవైపు ఉత్తరాదిన సమాజ్‌వాదీ పార్టీ గుర్తు కూడా సైకిల్ కావడం గమనార్హం. సైకిల్ గుర్తుపై సమాజ్ వాదీ పార్టీ అనేక విజయాలు సాధించింది. ఓ దశలో ఆ పార్టీ చీఫ్ ములాయంసింగ్ యదవ్ ప్రధాని పదవికి పోటీ పడ్డారు.