Panjshir : పంజ్‌షీర్‌ ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు!

అఫ్ఘానిస్తాన్ చిట్టచివరి ప్రాంతాన్ని తాలిబన్లు కైవసం చేసుకున్నారు. పంజ్‌షీర్‌ ప్రావిన్స్‌ కోసం హోరాహోరీగా సాగిన ఆధిపత్య పోరులో తాలిబన్లు విజయం సాధించారు.

Panjshir : పంజ్‌షీర్‌ ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు!

Breaking

Updated On : September 6, 2021 / 11:38 AM IST

Panjshir : అఫ్ఘానిస్తాన్ చిట్టచివరి ప్రాంతాన్ని తాలిబన్లు కైవసం చేసుకున్నారు. పంజ్‌షీర్‌ ప్రావిన్స్‌ కోసం హోరాహోరీగా సాగిన ఆధిపత్య పోరులో తాలిబన్లు విజయం సాధించారు. పంజ్‌షీర్‌ ప్రావిన్స్ తరపున పోరాటం చేస్తున్న నేషనల్‌ రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ అఫ్ఘానిస్తాన్‌ వెనకడుగు వేసింది. దీంతో తాలిబన్ బలగాలు పంజ్‌షీర్‌ ప్రాంతంలోకి ప్రవేశించి ఆక్రమించాయి. ఈ ప్రాంతంలో మొత్తం ఏడు జిల్లాలు ఉండగా, నాలుగు జిల్లాలను తాలిబన్లు కైవసం చేసుకున్నట్లు ఆదివారం సాయంత్రం వార్తలు వచ్చాయి.

ఇక ఇప్పుడు మొత్తం పంజ్‌షీర్‌ ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోమవారం ఉదయం అధికారికంగా తాలిబన్లు ఈ విషయాన్ని ప్రకటించుకున్నారు. దీంతో వారంపాటు జరిగిన బీకర పోరులో తాలిబన్లు పైచేయి సాధించారు. ఇక ఈ విషయంపై అఫ్ఘానిస్తాన్ మాజీ అధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌ స్పందించలేదు. పంజ్‌షీర్‌ సాయుధ దళాల నేత అహ్మద్‌ మసూద్‌ కూడా తాలిబన్ల ప్రకటనపై స్పందించలేదు. అయితే వీరిద్దరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇక పంజ్‌షీర్‌ ను స్వాధీనం చేసుకునేందుకు తాలిబన్లను ఆల్ ఖైదాతోపాటు పాకిస్తాన్ సహకరించినట్లుగా వార్తలు వస్తున్నాయి.

పంజ్‌షీర్‌ స్వాధీనం చేసుకోవడంలో తాలిబన్లు సఫలమైనట్లు తాలిబన్‌ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్‌ తెలిపాడు. మరోపక్క పంజ్‌షీర్‌ ప్రావిన్సియల్‌ గవర్నర్‌ కార్యాలయంపై తాలిబన్లు జెండా ఎగరవేస్తున్న దృశ్యాలు.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దాడులకు సంబంధించిన పూర్తి స్థాయి నష్టం వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.