Bjp Chief Bandi Sanjay: సీఎం కేసీఆర్ ప్రధానిని ఫాసిస్ట్ అంటే తప్పులేదట .. ఈటల స్పీకర్ ను మరమనిషి అంటే తప్పు వచ్చిందా? : బండి సంజయ్

Telangana BJP Chief Bandi Sanjay Fire
Bjp Chief Bandi Sanjay : అసెంబ్లీ సమావేశాల నుంచి హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సస్పెన్షన్ వేటు వేశారు. ఈ సస్పెన్షన్ ఈ సమావేశాలు ముగిసే వరకు కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ఈటల రాజేందర్ స్పీకర్ ను మరమనిషి అన్న వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ టీఆర్ఎస్ నేతలు ఈరోజు సభకు హాజరైన ఈటల స్పీకర్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ ఈటల క్షమాపణ చెప్పటానికి అంగీకరించాలేదు. ఈ క్రమంలో జరిగిన పరిణామాలతో స్పీకర్ పోచారం ఈటలను సస్పెండ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు.
ఈటల సస్పెన్షన్ పై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈటల రాజేందర్ అన్నదాంట్లో తప్పేముంది? అంటూ ప్రశ్నించారు. స్పీకర్ నిజంగానే టీఆర్ఎస్ చెప్పినట్లుగా చేసే మరమనిషిలా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. నిండు సభలో సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్రమోడీని ‘ఫాసిస్ట్’అనలేదా? ప్రధాని అంతటి స్థాయిగల వ్యక్తిని ఫాసిస్ట్ అంటే తప్పుగా అనిపించలేదా? దానిపై స్పీకర్ ఎందుకు స్పందించలేదు? ప్రధానిని ఫాసిస్ట్ అంటే తప్పుగా అనపించనప్పుడు ఈటల స్పీకర్ ను మరమనిషి అంటే తప్పు వచ్చిందా? అంటూ ఆగ్రహంతో ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వాన్ని దూషించటానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లుగా ఉందని..ప్రతి విషయంలోనే కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టటానికే అన్నట్లుగా చేస్తున్నారని..కేంద్రంపై చేసే విమర్శలకు బీజేపీ ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వటానికి యత్నిస్తే కనీసం సభలో మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వలేదని..ఇదే టీఆర్ఎస్ పరిపాలన ఇదేనా? అంటూ దుయ్యబట్టారు బండి సంజయ్. ఈటలను సభ నుంచి సస్పెండ్ చేయటం అన్యాయమని దీనిపై న్యాయపోరాటం చేస్తామని బండి సంజయ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను ప్రజలు సస్పెండ్ చేయటం ఖాయం అని బండి అన్నారు.
తనపై స్పీకర్ పోచారం సస్పెండ్ వేటు వేయటంతో ఈటల రాజేందర్ సభ నుంచి వెలుపలకు వచ్చారు. తన వాహనంలో బయటకు వెళ్తున్న ఈటలను పోలీసులు అడ్డుకున్నారు. ఆ వాహనం దించి పోలీసుల వాహనంలో ఈటలను పంపించారు. ఇటువంటి సమయంలో నన్ను అరెస్టు చేస్తున్నారా? అని ఈటల రాజేందర్ పోలీసులను ప్రశ్నించారు. మరోవైపు, ఈటల రాజేందర్ సభాపతిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈటల రాజేందర్ క్షమాపణలు చెప్పి సభలోకి రావాలని అన్నారు. తాము సభలో చర్చించాలనే అనుకుంటున్నామని, బీజేపీ నేతలు మాత్రం చర్చించకుండా బయట అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు.
కాగా.. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని మర మనిషి అంటూ ఈటల రాజేందర్ ఇటీవల అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర అవమానించారని టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈటలను సభ నుంచి సస్పెండ్ చేశారు.