తెలంగాణలో లాక్ డౌన్ సడలింపులు : రాత్రి వేళ RTC సర్వీసులు..హైదరాబాద్ లో మాత్రం

లాక్‌డౌన్ నుంచి తెలంగాణలో ప్రభుత్వం మరిన్ని సడలింపులు ఇచ్చింది. ప్రధానంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో సడలింపులు ఇచ్చింది. హైదరాబాద్‌లో 2020, మే 28వ తేదీ గురువారం నుంచి అన్ని రకాల షాపులు తెరవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే మాల్స్ తెరవడానికి మాత్రం అనుమతి ఇవ్వలేదు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఒక షాపు తప్పించి.. మరోషాపు తెరిచే వెసులుబాటు ఉంది. ఒకరోజు తెరిస్తే.. మరో రోజు మూసివేస్తున్నారు. దీనివల్ల ఒకేషాపులో ఎక్కువమంది గుమిగూడుతున్నారు. దీంతో ఎక్కువ షాపులు తెరిచి.. తక్కువ మంది పోగయ్యే విధానం అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో నేటి నుంచి మాల్స్ మినహా అన్ని షాపులు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది.
మాస్క్ తప్పనిసరి :-
షాపుల యజమానులు, వినియోగదారులు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం సూచించింది. కస్టమర్లకు షాపు యజమానులు శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని కోరింది. ఇక ఇంట్లో నుంచి బయటకు వెళ్లే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌ను ధరించాలని స్పష్టం చేసింది. మాస్క్ ధరించని వారికి వెయ్యి రూపాయల జరిమానా విధించనున్నట్టు హెచ్చరించింది.
RTC బస్సులకు నిబంధనలు సడలింపు :-
RTC బస్సులకూ ప్రభుత్వం లాక్‌డౌన్ నుంచి మరికొన్ని నిబంధనలు ఇచ్చింది. ఆర్టీసీ బస్సులకు కర్ఫ్యూ నిబంధనల నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. అంటే… ఇక నుంచి రాత్రిపూట కూడ బస్సులు తిరిగేందుకు ప్రభుత్వం లైన్ క్లియర్ చేసింది. అంతేకాదు 2020, మే 28వ తేదీ గురువారం నుంచి జిల్లాల నుంచి వచ్చే బస్సులను సిటీలోకి కూడా అనుమతించనున్నారు. ప్రస్తుతం ఒక్క JBSకు రావడానికి మాత్రమే బస్సులకు అనుమతి ఉంది. ఉమ్మడి మహబూబ్‌నగర్, వరంగల్, నల్లగొండ ఇతర జిల్లాల నుంచి వచ్చే బస్సులను సిటీ శివారు వరకే వరకు అనుమతించారు. ప్రభుత్వం నిర్ణయంతో గురువారం నుంచి ఇమ్లీబన్ వరకు రానున్నాయి.
ఆర్టీసీ ఆదాయం :-
కొద్ది రోజుల క్రితం ఆర్టీసీ బస్సులు నడవడానికి అవకాశం ఇచ్చినప్పటికీ రాత్రిపూట కర్ఫ్యూ కారణంగా పూర్తి స్థాయిలో బస్సులు తిరగడం లేదు. దీంతో ఆర్టీసీకి ఆదాయం రావడం లేదు. రోజుకు 11 కోట్ల నుంచి 12 కోట్ల వరకు ఆదాయం రావాలి. ఎండాకాలం, పెళ్లిళ్ల సీజన్ లో 15 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. కానీ, ఇప్పుడు కేవలం 2 కోట్లు మాత్రమే వస్తుంది. కేవలం 39 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే వస్తున్నది. దీనికి ప్రధాన కారణం రాత్రి పూట విధించే కర్ఫ్యూ. ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు రాత్రి 7 గంటల లోపు గమ్యస్థానాలకు చేరుకోవడం సాధ్యం కావడం లేదు. ఎండాకాలం కావడంతో ప్రజలు అయితే ఉదయం, లేదంటే సాయంత్రం మాత్రమే ప్రయాణం చేయడానికి మొగ్గు చూపుతున్నారు. పగటి పూట మాత్రమే బస్సులు నడపడం వల్ల ప్రజలకు ఉపయోగపడడం లేదు. దీంతో ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు రాత్రిపూట తిరిగేందుకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది.
రాత్రి వేళల్లో బస్సులు :-
తెలంగాణలో ప్రస్తుతం సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ కొసాగుతుంది. ఈ సమయంలో ఎవరూ బయట తిరగడానికి అవకాశం లేదు. చివరికి బస్సులు కూడా కర్ఫ్యూ సమయంలో తిరగడానికి అనుమతి లేదు. కానీ ప్రభుత్వం కర్ఫ్యూ నుంచి ఆర్టీసీ బస్సులకు మినహాయింపులు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం అన్ని జిల్లాల్లోనూ ఆర్టీసీ బస్సులు రాత్రిపూట కూడా తిరగనున్నాయి. అంతేకాదు.. బస్టాండ్లలో ట్యాక్సీలు, ఆటోలతోపాటు ఇతర రవాణా వాహనాలకు అనుమతి ఇస్తారు. బస్ టికెట్ కలిగిన ప్రయాణికులు కర్ఫ్యూ సమయంలో కూడా ప్రైవేట్ వాహనాల్లో తమ ఇళ్లకు చేరుకోవడానికి అనుమతి ఉంటుంది.
హైదరాబాద్ లో మాత్రం :-
హైదరాబాద్ నగరంలో మాత్రం సిటీ బస్సులు తిరగడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. మరికొన్ని రోజులు సిటీ బస్సులకు అనుమతి ఉండకపోవచ్చు. కరోనా కేసులు హైదరాబాద్‌లోనే ఎక్కువగా నమోదవుతుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఇతర రాష్ట్రాల బస్సులకు రాష్ట్రంలోకి అనుమతి లేదు.