Oxford Dream: ఆక్స్​ఫర్డ్​లో చదవాలని పేద విద్యార్థి ఆశ.. 3 గంటల్లో రూ. 37లక్షల డొనేషన్లు!

సోషల్ మీడియా గురించి మనం ప్రత్యకంగా పెద్దగా చెప్పుకోవాల్సిన పనిలేదు. దీని ప్రభావం కూడా ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. అందుకే ఏదైనా ఘటనలు జరిగిన సమయంలో సమస్యాత్మక ప్రాంతాలలో ముందుగా ఇంటర్నెట్ నిలిపివేస్తున్నారు.

Oxford Dream: ఆక్స్​ఫర్డ్​లో చదవాలని పేద విద్యార్థి ఆశ.. 3 గంటల్లో రూ. 37లక్షల డొనేషన్లు!

Oxford Dream

Updated On : June 5, 2021 / 4:18 PM IST

Oxford Dream: సోషల్ మీడియా గురించి మనం ప్రత్యకంగా పెద్దగా చెప్పుకోవాల్సిన పనిలేదు. దీని ప్రభావం కూడా ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. అందుకే ఏదైనా ఘటనలు జరిగిన సమయంలో సమస్యాత్మక ప్రాంతాలలో ముందుగా ఇంటర్నెట్ నిలిపివేస్తున్నారు. ప్రభుత్వాల మీద వ్యతిరేకత పెంచాలన్నా.. ఆకాశానికి ఎత్తేయాలన్నా కూడా సోషల్ మీడియాలో చిటికెలో పనే. ఇదంతా ఒకెత్తు.. ఇదే సోషల్ మీడియా మంచి చేయడంలో కూడా ముందే ఉంది. సోనూసూద్ నుండి ఎందరో ఈ సోషల్ మీడియా ద్వారానే ఎందరికో సాయం అందిస్తున్నారు. చాలా సందర్భాలలో సోషల్ మీడియా ద్వారానే ప్రపంచానికి తెలిసిన దుర్మార్గాలలో కూడా న్యాయం జరిగింది.

అలా సోషల్ మీడియా వలన జరిగిన మంచి పనులలో ఇప్పుడు మీరు చదవబోయేది కూడా ఒకటి. దక్షిణ ఒడిశా కోరాపుట్ జిల్లాలోని మావోల ప్రాంతమైన తెంతులిపదార్ గ్రామానికి చెందిన సుమిత్ తురుక్ కు చదువంటే ప్రాణం. చదువుకొని ఉన్నత స్థానానికి ఎదగాలని బలమైన ఆశ ఉంది. ఢిల్లీ జవహర్​లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చదువుతున్న తురుక్ కు ఆక్స్​ఫర్డ్​లో ఉన్నత విద్యను పూర్తి చేయాలన్నది డ్రీమ్. కానీ.. దళిత కుటుంబానికి చెందిన తురుక్ వద్ద ఆర్ధికంగా అంత స్థోమత లేదు. ముందుగా అందుకోసం ఒడిశా సర్కారు సాయం పొందాలని అనుకున్నాడు. కానీ అలా కుదరలేదు కానీ ఇంగ్లాండ్ వెళ్లి చదువుకునేందుకు మాత్రం అనుమతి లభించింది.

దీంతో సోషల్ మీడియా సాయంతో ఫండ్ రైజింగ్ చేయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఇంగ్లాండ్​కు వెళ్లేందుకు అనుమతి వివరాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి తనకు సాయం చేయాలని కోరాడు. జస్ట్ మూడు గంటల్లో అతనికి రూ. 37 లక్షల డొనేషన్లు అందాయి. దీంతో తురుక్ ఆనందానికి అవధుల్లేకుండాపోయింది. ఇంగ్లాండ్ ప్రయాణానికి మరో పదిలక్షలు కావాల్సి ఉండగా అవి కూడా ఈనెలాఖరుకి వస్తాయని ధీమాగా చెప్తున్నాడు. తనకు సాయం అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పిన తురుక్ చదువు పూర్తయ్యాక గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల ఉన్నత విద్యకోసం సాయం అందిస్తానని చెప్తున్నాడు.