Today HeadLines: మెట్రో రైల్ నూతన రూట్ మ్యాప్‌ సిద్ధం

సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో నూతన మెట్రో రైల్ రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసింది హెచ్ఎంఆర్ఎల్. ఫేస్ 2లోని జూబ్లిబస్ స్టాండ్, సికింద్రాబాద్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న మెట్రోని చాంద్రాయణ గుట్ట వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకుంది.

Today HeadLines: మెట్రో రైల్ నూతన రూట్ మ్యాప్‌ సిద్ధం

మెట్రో రైల్ నూతన రూట్ మ్యాప్‌ సిద్ధం
సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో నూతన మెట్రో రైల్ రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసింది హెచ్ఎంఆర్ఎల్. ఫేస్ 2లోని జూబ్లిబస్ స్టాండ్, సికింద్రాబాద్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న మెట్రోని చాంద్రాయణ గుట్ట వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. ఫేస్ 2లో 70 కిలోమీటర్లు మెట్రో నిర్మించాలని నిర్ణయించింది. మూడు నెలల్లో డీపీఆర్ సిద్ధం చేస్తామని చెప్పింది.

రావణుడి గురించి ఇప్పుడెందుకు?: అసోం సీఎం సంచలన కామెంట్స్
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సమయంలో రావణుడిలాంటి రాహుల్ గాంధీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదంటూ అసోం సీఎం హిమంత బిశ్వశర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్యకు ఇవాళ రాహుల్‌ను ఎందుకు ఆహ్వానించలేదని మీడియా అడగడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిందని, కనీసం ఈరోజైనా రావణుడి గురించి మనం మాట్లాడుకోవద్దని అన్నారు.

ఎమ్మెల్సీలుగా మహేష్‌కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ ఏకగ్రీవ ఎన్నిక
మహేష్‌కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. రెండు ఎమ్మెల్సీ స్ధానాలకు రెండునామినేషన్లు మాత్రమే రావడంతో మహేష్‌కుమార్ గౌడ్, వెంకట్ ఏకగ్రీవంగా ఎన్నికయినట్టు అసెంబ్లీ కార్యాలయం ప్రకటించింది. రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి ఎమ్మెల్సీ సర్టిఫికెట్లను వారిద్దరు అందుకున్నారు. ఏకగ్రీవంగా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన మహేష్‌కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్‌కు మంత్రి శ్రీధర్ బాబు అభినందనలు తెలిపారు.

ధరణి కమిటీ మూడో సమావేశం.. కీలక నిర్ణయాలు
తెలంగాణలో భూ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ధరణి కమిటీ మూడో సమావేశం ఇవాళ హైదరాబాద్‌, నాంపల్లిలోని సీసీఎల్‌ఏ భవనంలోని ఆఫీసులో జరిగింది. ధరణి డేటాను పరిశీలించడం, ఆ పోర్టల్‌లో చేయాల్సిన సాంకేతిక మార్పులను గురించి చర్చించారు. అనంతరం ధరణి కమిటీ సభ్యుడు రేమండ్ పీటర్ మీడియా సమావేశలో మాట్లాడారు. ధరణిలో ఉన్న లొసుగులపై చర్చించినట్లు తెలిపారు.

500 ఏళ్ల కల నెరవేరింది..
ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయింది. బాలరాముడి దర్శనంతో భారతావని పులకించింది. స్వర్ణాభరణాలతో భక్తులకు బాలరాముడు దర్శనమిచ్చారు. ప్రధాని మోదీ తొలిహారతి ఇచ్చి.. బాలరాముడికి సాష్టాంగ నమస్కారం చేశారు. అనంతరం జరిగిన సభలో యోగి ఆధిత్యనాథ్ మాట్లాడుతూ.. 500ఏళ్ల కల నెరవేరిందని చెప్పారు. ఎన్నో పోరాటాల తర్వాత ఈ అద్భుత ఘట్టం సాకారమైందని, ఈ క్షణంకోసం దేశమంతా ఎన్నో ఏళ్లు ఎదురుచూసిందని అన్నారు. ఈ అద్భుత ఘట్టాన్ని నేను మాటల్లో వర్ణించలేనని యోగి ఆధిత్యనాథ్ భావోద్వేగంతో చెప్పారు.

బాలరాముని ప్రాణప్రతిష్ఠ..
ప్రధాని నరేంద్ర మోదీ చేతులుమీదుగా అయోధ్యలోని ఆలయంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. 12.29 గంటలకు అభిజిత్ లఘ్నంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. 84 సెకన్లపాటు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కొనసాగింది.

‘జై శ్రీరామ్… ఈ అతీంద్రియ క్షణమైన ప్రాణ ప్రతిష్టలో భాగమైనందుకు నాకు చాలా ఆనందంగా ఉందిని ప్రధాని మోదీ మాట్లాడుతూ అన్నారు.

అయోధ్యలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం..
అయోధ్యలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య ప్రాణప్రతిష్ఠ క్రతువు కొనసాగుతోంది. స్వామివారికి పట్టువస్త్రాలు, ఛత్రంను ప్రధాని మోదీ సమర్పించారు. అయోధ్య రామాలయంపై హెలికాప్టర్ తో పూలవర్షం కురిసింది.

మారిషస్ లోనూ ..
అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మారిషస్ లోనూ ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అధికారులకు రెండు గంటల ప్రత్యేక సెలవుసైతం ప్రకటించారు. ఆ దేశ ప్రధాని ప్రవింద్ కుమార్ జగన్నాథ్ ప్రత్యేక సందేశం ఇచ్చారు. శ్రీరాముడు అయోధ్యకు తిరిగొస్తున్న వేళ మనమంతా సంతోషిద్ధాం.. మన మార్గంపై వెలుగులు ప్రసరింపజేసి శాంతి, శ్రేయస్సు వైపు అడుగులు వేసేలా ఆయన బోధనలు, ఆశీస్సులు కొనసాగాలని ప్రార్థిద్దాం.. జై హింద్ అని ట్విటర్ లో పోస్టు చేశారు.

అంగన్ వాడీల చలో విజయవాడ..
ఏపీ అంగ‌న్‌వాడీ కార్యకర్తల చలో విజయవాడ పిలుపు నేపథ్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. జిల్లాల నుంచి విజయవాడకు రాకుండా ఎక్కడికక్కడ వారిని అడ్డుకుంటున్నారు. ఆదివారం అర్ధరాత్రి నుంచే విజయవాడకు తరలివస్తున్న అంగన్ వాడీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ప్రధాని మోదీకి రాష్ట్రపతి లేఖ ..
అయోధ్య శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ప్రధానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లేఖ రాశారు. 11 రోజులుగా ఎంతో నిష్ఠగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శ్రీరాముడు సాహసం, కరుణ, కర్తవ్య నిష్ఠకు ప్రతీక అని అన్నారు. మన సంస్కృతి, ఆధ్యాత్మికత రాముడి జీవితంతో ముడిపడి ఉందని రాష్ట్రపతి లేఖలో పేర్కొన్నారు. జాతి నిర్మాతలకు రామాయణం ఎంతో ప్రేరణగా నిలిచిందని అన్నారు. సత్యనిష్ఠ గొప్పతనం రాముడి వల్లే గ్రహించానని గాంధీ అన్నారని, సుపరిపాలన అంటే ఇప్పటికీ రామరాజ్యమే గుర్తుకొస్తుందని, అయోధ్య కార్యక్రమంతో దేశమంతా పండుగ వాతావరణం నెలకొందని రాష్ట్రపతి ముర్ము అన్నారు.