Today HeadLines: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

ముఖ్యమంత్రి నివాసంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ ను కలిశారు.

Today HeadLines: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కలిశారు. ముఖ్యమంత్రి నివాసంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ ను కలిశారు.

అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలపై సీఎం జగన్ సీరియస్
అనంతపురం జిల్లా ఎమ్మెల్యేల తీరుపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. పలువురు ఎమ్మెల్యేలకు క్లాస్ పీకారు జగన్. ఉరవకొండ పర్యటనలో రెండు గంటల పాటు నేతలు, కార్యకర్తలతో జగన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల పనితీరుపై జగన్ కు క్యాడర్ నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అనంతపురం పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం జగన్ ఆరా తీశారు. ఎన్నికలప్పుడే తమను వాడుకుంటున్నారని, ఆ తర్వాత వదిలేస్తున్నారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములు లాక్కుని వేధిస్తున్నారని కొందరు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేశారు. దీంతో పని తీరు మార్చుకోవాలని ఎమ్మెల్యేలను హెచ్చరించారు జగన్.

రాహుల్ గాంధీపై అసోం సీఎం వ్యాఖ్యలను ఖండించిన వీహెచ్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అసోం సీఎం రావణుడు అనటాన్ని ఖండించారు కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు. మోదీ రాముడు- రాహుల్ రావణుడు అనటాన్ని ఆయన తప్పుపట్టారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలా దిగజారి మాట్లాడటం మానుకోవాలన్నారు. మణిపూర్ లో వందలాది మంది చనిపోతే ప్రధాని మోదీ వెళ్లలేదని కానీ, పార్లమెంట్ ఎన్నికల కోసం రాముడిని బీజేపీ ఆయుధంగా వాడుకుంటోందని వీహెచ్ విమర్శించారు.

టీడీపీ గేట్లు తెరిస్తే.. వైసీపీ మొత్తం ఖాళీ..!
వైసీపీ నుంచి వరుసగా నేతలు బయటకు వస్తున్నారని టీడీపీ సీనియర్ నేత నక్కా ఆనంద్ బాబు అన్నారు. టీడీపీ గేట్లు తెరిస్తే వైసీపీ మొత్తం ఖాళీ అవుతుందన్నారాయన. ఇంఛార్జిల మార్పు ద్వారా సీఎం జగన్ వైసీపీ ఓటమిని అంగీకరిస్తున్నారని ఆనంద్ బాబు వ్యాఖ్యానించారు.

ధరణి కమిటీతో మంత్రి పొంగులేటి కీలక భేటీ
ధరణి సమస్యలపై తక్షణ పరిష్కారానికి తయారు చేసిన మధ్యంతర నివేదికపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కమిటీ సభ్యులు చర్చిస్తున్నారు. సచివాలయంలో మంత్రి పొంగులేటితో భేటీ అయిన ధరణి కమిటీ.. భూ సమస్యలపై తయారు చేసిన మధ్యంతర నివేదికను అందించారు. క్షేత్ర స్థాయిలో భూ సమస్యలను ఎలా పరిష్కరించాలి? అనేదానిపై కమిటీతో మంత్రి పొంగులేటి చర్చిస్తున్నారు. కమిటీ ఇచ్చిన నివేదికపై మంత్రి పొంగులేటి సీఎం రేవంత్ రెడ్డితో చర్చించనున్నారు. మరోవైపు ధరణి కమిటీ రేపు నాలుగు జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానుంది.

కేశినేని నాని వెంట కనీసం నలుగురు కూడా లేరు
విజయవాడ ఎంపీ కేశినేని నానిపై ఆయన సోదరుడు కేశినేని చిన్ని హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీలోకి వెళ్లిన నాని వెంట కనీసం నలుగురు వ్యక్తులు కూడా లేరని విమర్శించారు. కేవలం దేవినేని అవిశాశ్ కు అనుచరుడిగా మారడానికి మాత్రమే ఆ పార్టీలో వెళ్లారని చెప్పారు. త్వరలోనే విజయవాడ ప్రజలు నానికి తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీని ఖాళీ చేయించడం కేశినేని నాని వల్ల కాదని, తమ పార్టీలోకే వైసీపీ వాళ్లు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు చిన్ని.

అధిష్టానం నిర్ణయానికి అంతా కట్టుబడి ఉండాలి
నరసరావుపేట ఎంపీ టికెట్ బీసీ వర్గానికి ఇస్తే బాగుంటుందని వైసీపీ అధిష్టానం భావించిందన్నారు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. అధిష్టానం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలన్నారు. శ్రీకృష్ణదేవరాయలు గుంటూరు నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయన్నారు. ఆయన వ్యక్తిగత అభిప్రాయం మేరకే రాజీనామా చేశారని గోపిరెడ్డి అన్నారు.

హైదరాబాద్ లో జైషా..
బీసీసీఐ కార్యదర్శి జైషా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మంగళవారం హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో వారికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు స్వాగతం పలికారు. సాయంత్రం హైదరాబాద్ లోని ఒక హోటల్ లో జరగనున్న బీసీసీఐ అవార్డు వేడుకల్లో బీసీసీఐ ప్రముఖులు, పలువురు క్రికెట్ దిగ్గజాలు పాల్గోనున్నారు.

విచారణ వాయిదా..
కోడికత్తి శ్రీను బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. కోడికత్తి శ్రీనుకు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. లాయర్లు పిచ్చుక శ్రీనివాసు, పాలేటి మహేశ్ లు లంచ్ మోహసన్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.

ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు..
భారత దేశానికి ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడం హాస్యాస్పదంగా ఉందని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. ఐరాస దాని అనుబంధ సంస్థలను సవరించాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్ కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడం హాస్యాస్పదంగా ఉంది. శక్తివంతమైన దేశాలు తమ స్థానాలను వదులుకునేందుకు ఇష్టపడకపోవడమే అసలు సమస్య. ఆఫ్రికా యూనియన్ కు సమష్టిగా ఒక శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని మస్క్ అభిప్రాయ పడ్డారు.

జగన్ అనంత టూర్..
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాళ అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఉరవకొండలో వైఎస్ఆర్ ఆసరా నాల్గో విడత కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. బటన్ నొక్కి డ్వాక్రా సంఘాల బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేస్తారు.

బాలరాముని దర్శనం..
నేటి నుంచి సాధారణ భక్తులు అయోధ్యలోని బాలరాముని దర్శనం చేసుకోవచ్చు. 24 అడుగుల దూరం నుంచి బాలరాముని దర్శనం చేసుకోవచ్చు. దర్శన సమయాలను రెండు స్లాట్లుగా విభజన చేశారు. ఉదయం 7గంటల నుంచి ఉదయం 11.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7గంటల వరకు భక్తులు బాలరాముని దర్శనం చేసుకోవచ్చు. ప్రతిరోజూ మూడు హారతులు ఉంటాయి. ఉదయం 6.30 గంటలకు శృంగారం హారతి, మధ్యాహ్నం 12గంటలకు భోగ్ హారతి, రాత్రి 7.30 గంటలకు సంధ్యా హారతి ఉంటుంది.

శ్రీకాకుళం జిల్లాలో షర్మిల పర్యటన..
ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఇచ్చాపురం చేరుకుంటారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర విజయస్తూపం వద్ద నివాళి అర్పించనున్నారు. అనంతరం ఆర్జే ఫంక్షన్ హాల్ లో పార్టీ శ్రేణులతో సమావేశం అవుతారు.

విచారణకు అవకాశం ..
కోడికత్తి శ్రీను బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ జరిగే అవకాశం ఉంది. కోడికత్తి శ్రీను బెయిల్ పై సోమవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. లాయర్లు పిచ్చుక శ్రీనువాసు, పాలేటి మహేష్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

సమ్మె విరమణ..
అంగన్వాడీలతో ఏపీ ప్రభుత్వం చర్చలు సఫలం అయ్యాయి. అంగన్వాడీ యూనియన్ నాయకులతో మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డిలు చర్చలు జరిపారు. చర్చలు సఫలం కావడంతో నేటి నుంచి విధుల్లోకి రానున్నారు. అంగన్వాడీల పట్ల సానుకూలంగా ఏపీ ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వం ముందు అంగన్వాడీలు 11 డిమాండ్లు ఉంచారు. 10 డిమాండ్లను నెరవేరుస్తామని మంత్రి బొత్స తెలిపారు. వేతనాలు పెంచాలనే డిమాండ్ ను జులైలో నెరవేరుస్తామని అన్నారు. సమస్యలు పరిష్కారంకు ప్రభుత్వం హామీతో అంగన్వాడీలు సమ్మె విరమిస్తామని చెప్పారని బొత్స అన్నారు.