Today Headlines : ఇండియా-ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌కు సర్వం సిద్ధం.. విశాఖ వేదికగా తొలి మ్యాచ్‌

హైదరాబాద్ పెద్ద అంబర్ పేట్ లో భారీగా నగదును పట్టుకున్నారు పోలీసులు. కారులో తరలిస్తున్న రూ.2కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు.

Today Headlines : ఇండియా-ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌కు సర్వం సిద్ధం.. విశాఖ వేదికగా తొలి మ్యాచ్‌

ఇండియా-ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌కు సర్వం సిద్ధం.. విశాఖ వేదికగా తొలి మ్యాచ్‌
భారత్, ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్ కు సర్వం సిద్ధమైంది. గురువారం విశాఖ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ఈ నెల 23న పీఎంపాలెం వైఎస్సార్‌ ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియంలో జరగనున్న భారత్‌-ఆస్ట్రేలియా టీ-20 మ్యాచ్‌ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. వన్డే ప్రపంచకప్‌ ముగిసిన నాలుగు రోజుల్లో టీ20 సిరీస్‌ ప్రారంభం అవుతుండడం క్రికెట్‌ ప్రేమికుల్లో సంతోషం నింపింది. 26న తిరువనంతపురం, 28న గౌహతి, డిసెంబర్‌ 1న రాయ్ పూర్‌, 3న బెంగళూరులో పోటీ జరగనుంది. ఈ సిరీస్‌కు సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.

కారులో 2కోట్లు.. హైదరాబాద్ పెద్ద అంబర్‌పేట్‌లో భారీగా నగదు పట్టివేత
హైదరాబాద్ పెద్ద అంబర్ పేట్ లో భారీగా నగదును పట్టుకున్నారు పోలీసులు. కారులో తరలిస్తున్న రూ.2కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఆ నగదు ఎక్కడికి తరలిస్తున్నారు? ఈ వివరాలు తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు చేసి కారులో తరలిస్తున్న రూ.2కోట్ల నగదును పట్టుకున్నారు.

కొడంగల్ లోనూ రేవంత్ కు బుద్ధి చెప్పాలి- సీఎం కేసీఆర్
కొడంగల్ లో బహిరంగ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్.. రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. కామారెడ్డిలో రేవంత్ రెడ్డిని చిత్తుగా ఓడించబోతున్నారని, కొడంగల్ లోనూ ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కొడంగల్ తో పాటు రాష్ట్రానికి పట్టిన పీడ వదిలించుకోవాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. నీతి, నియమం, పద్ధతి, ప్రజలపై ప్రేమ ఉన్నోడు రాజకీయాల్లో ఉండాలి కానీ ఇలాంటి వాళ్లు కాదన్నారు గులాబీ బాస్.


వాళ్లకు రిటర్న్ గిఫ్ట్ ఖాయం ..

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయి. వారి ఆటలు మరెన్నో రోజులు సాగవు, ప్రజలు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారని వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు.

ఉగ్రవాదుల కాల్పులు ..
జమ్మూకశ్మీర్ లోని రాజౌరి జిల్లాలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు జవాన్లు అమరులయ్యారు. బాజిమాల్ వద్ద ఉగ్రవాదులు, జవాన్ల మధ్య ఈ ఎదురు కాల్పులు జరిగాయి.

వాళ్లకు ప్రజలే బుద్ధి చెప్పాలి ..
నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఎమ్మెల్యే షకీల్ పై కాంగ్రెస్ దాడిని ఎమ్మెల్సీ కవిత ఖండించారు. కాంగ్రెస్ నాయకుల దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గూండాయిజం, రౌడీయిజం చేసే వాళ్లకు ప్రజలే బుద్ధి చెబుతారని కవిత హెచ్చరించారు.

స్టీల్ ప్లాంట్ సందర్శన .. 

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎన్ఎండీసీ ఈడీ వెంకటేశ్వర్లు సందర్శించారు. స్టీల్ ప్లాంట్ కు ముడిసరుకు సరఫరా చేయాలని ఐఎన్టీయూసీ నేతలు ఈడీని కోరారు. ఆ మేరకు కృషి చేస్తానని ఈడీ వారికి హామీ ఇచ్చారు.

తరిమికొట్టండి ..
డబ్బు సంచులతో వస్తున్న కాంగ్రెస్ నేతలను తరిమికొట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. హస్తం పార్టీకి ఓటేస్తే అభివృద్ధి కుంటుపడిపోతుందని అన్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ లో ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ పాల్గొన్నారు.

ఖర్గే కౌంటర్ ..
హరిత విప్లవం తీసుకొచ్చినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారంటూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. ఇందిరపై కేసీఆర్ వ్యాఖ్యలకు ఖర్గే కౌంటర్ ఇచ్చారు. నల్గొండలో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రధాని మోదీ కాంగ్రెస్ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. నెహ్రూ స్థాపించిన నేషనల్ హెరాల్డ్ పత్రికపై కుట్ర చేశారని ఆరోపించారు.

కాంగ్రెస్‌ వస్తే మళ్లీ దళారీ రాజ్యమే..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళారీ రాజ్యమే వస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ధరణిని తీసేసి భూమాత అని పేరు పెడతారట.. భూమాతనా.. భూమేతనా? అంటూ కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు కేసీఆర్.

జగన్ బెయిల్ రద్దుపై సుప్రీంలో విచారణ .. 

ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరపనుంది. సుప్రీంకోర్టు జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ విచారణ చేపట్టనుంది. అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని వైసీపీ ఎంపీ రఘురామరాజు సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అక్రమాస్తుల కేసులో గత పదేళ్లుగా బెయిల్ పై బయట ఉన్న జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ గతంలో తెలంగాణ హైకోర్టులో ఆయన పిటీషన్ దాఖలు చేశారు. సీబీఐ రిప్లయ్ తో జగన్ బెయిల్ రద్దు పిటీషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేశారు రఘురామరాజు.

తెలంగాణ పోరాట స్ఫూర్తే కారణం : పవన్ కల్యాణ్
బీజేపీ విజయ సంకల్ప సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. తెలంగాణలో అవినీతి రాజ్యం నడుస్తోందన్నారు. బీజేపీని గెలిపించి బీసీని సీఎం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ పోరాట స్ఫూర్తితోనే ఏపీలో జనసేన పార్టీ నడుస్తుందని అన్నారు. ఏపీలో రౌడీలు, గూండాల పాలన నడుస్తోందని.. అటువంటి పరిస్థితుల్లో తట్టుకుని నిలబడుతున్నానంటే దానికి తెలంగాణ పోరాట స్ఫూర్తే కారణమన్నారు. బలిదానాలపై ఏర్పడ్డ తెలంగాణలో ఇంత అవినీతి ఉంటుందని  ఊహించలేదన్నారు. తనకు ఆంధ్ర జన్మనిస్తే తెలంగాణ పునర్ జన్మనిచ్చిందన్నారు. తాను పార్టీ పెట్టిన ఇన్నేళ్లలో ఎప్పుడూ తెలంగాణపై మాట్లాడలేదన్నారు.

కాళేశ్వరం మీకు కాటేశ్వరమే..
అలంపూర్ లో కాంగ్రెస్ ప్రజాగర్జన సభలో పాల్గొన్న విజయశాంతి.. బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్లు దోచేశారు అంటూ మండిపడ్డారు. కాళేశ్వరం మేడిగడ్డ కూలిపోవటానికి సిద్ధంగా ఉందని.. అదే కాళేశ్వరం మీకు కాటేశ్వరం అవుతుందని.. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాటికి పంపే ఈశ్వరం అవుతుందన్నారు.

దమ్ముందా..?
ప్రాజెక్టుల పేరిట ఓట్లడిగే దమ్ము BRSకు ఉందా..? అని రేవంత్‌ రెడ్డి సవాల్ విసిరారు. కాంగ్రెస్‌కు 80 సీట్లు రావడం ఖాయంని ధీమా వ్యక్తంచేశారు.

గెలుపు ధీమా
వంద మంది కేసీఆర్‌లు వచ్చినా తన గెలుపును ఆపలేరు అంటూ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్‌ అధికారంలోకి రావటం ఖాయమన్నారు.

వాయిదాల పర్వం..
చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. మద్యం కేసులో విచారణను రేపటికి వాయిదా వేసింది ధర్మాసనం. అలాగే ఇసుక కేసులో ఎల్లుండికి వాయిదా వేసింది.

కాలిపోయిన మోటార్లు, ఎండిపోయిన పొలాలు : కేటీఆర్
కోదాడలో మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రోడ్ షోలో మాట్లాడుతూ..కాంగ్రెస్ హయాంలో కరెంట్ ఎలా ఉండేది.? కాలిపోయిన మోటార్లు, ఎండిపోయిన పొలాలు తప్ప ఏమన్నా ఉన్నాయా..? అని ప్రశ్నించారు. కానీ బీఆర్ఎస్ పాలనలో పచ్చని పొలాలు కళకళలాడుతూ కనిపిస్తున్నాయన్నారు. కరెంటు 3 గంటలు చాలు అనే కాంగ్రెస్ కు.. విద్యుత్ గురించి ప్రశ్నించే అర్హత లేదన్నారు. 24 గంటలు కరెంట్ కావాలంటే బీఆర్ఎస్ కు ఓటు వేయాలని కోరారు. 3 గంటలే చాలు అనే కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలన్నారు.

రేవంత్ సీఎం కాలేడు..
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనటానికి డబ్బుల మూటలు ఇచ్చి అడ్డంగా దొరికిపోయి జైలుకెళ్లిన దొంగ రేవంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు కేసీఆర్. కొడంగల్ బీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్.. రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. రేవంత్ భూకబ్జాలు చేస్తారని ఆరోపించారు. రేవంత్ సీఎం కావాలని కలలు కంటున్నాడు.. కానీ ఎప్పటికీ సీఎం కాలేడని కేసీఆర్ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణిని తీసేస్తారని చెప్పారని.. ధరణిని తీసివేసి ‘భూమాత’ అని పేరు పెడతారట.. అది భూమాతనా..? భూ మేతనా..? అంటూ ప్రశ్నించారు. రేవంత్‌ గెలిస్తే దళారీలదే రాజ్యం అంటూ  మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ టికెట్లు అమ్ముకుంటోందని ఆ పార్టీ వారే అన్నారు. అటువంటి వ్యక్తికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

అక్బరుద్దీన్‌పై కేసు నమోదు
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై సంతోష్‌నగర్‌ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు పోలీసులు. డ్యూటీలో ఉన్న ఇన్ స్పెక్టర్ ను దుర్భాషలాడాడు అంటూ కేసు నమోదైంది.

ఇద్దరూ ఒక్కటే..
తెలంగాణలో కాంగ్రెస్‌ గెలుపు దేశానికి ఒక మెసేజ్‌ కావాలని మల్లికార్జున ఖర్గే అన్నారు. అలంపూర్ లో కాంగ్రెస్ ప్రజాగర్జన సభలో పాల్గొన్న ఖర్గే.. కేసీఆర్‌, మోదీ ఇద్దరూ ఒక్కటేనన్నారు.

మా సంగతేంటి..?
ఇందిరా పార్క్ దగ్గర కర్ణాటక రైతులు ఆందోళన నిర్వహించారు. బీజేపీ, కాంగ్రెస్ హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు.

పొలిటికల్‌ ఫైట్‌
నిజామాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు.

కాపాడండి..
చివరిదశకు చేరిన టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ ముగియనుంది. సొరంగంలో చిక్కుకున్న కార్మికుల కోసం చేస్తున్న కృషికి ఫలితం దక్కనుంది. ఈ రాత్రి లేదా రేపు ఉదయం లోపు ఈ ఆపరేషన్ ముగిసే అవకాశం ఉంది. సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు ఇప్పటివరకు పైప్‌లైన్ ద్వారా డ్రై ఫ్రూట్స్, నీళ్లు పంపించారు అధికారులు. నిన్న వేడి వేడి ఆహారం అందించారు.

విద్యార్థి సంఘాల ఆందోళన
కొచ్చిలో విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేశాయి.

ఓటు ఓ ఆయుధం.. ఆలోచించి వేయండి..
తాండూరులో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ప్రజల సహాయంతో ప్రభుత్వాన్ని నడుపుతున్నామని అన్నారు. పదేళ్ల మా పాలనలో రాష్ట్రం ఎలా ఉందో మీ కళ్ల ముందే కనిపిస్తోందని, ఆ అభివద్ధిని చూసే ఓటు వేయాలని కోరారు. 15 ఏళ్లు పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నామని.. అటువంటి పోరాటాల తెలంగాణలో మరింత అభివద్ధి జరగాలంటే మరోసారి బీఆర్ఎస్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఓటు మన తలరాతను మారుస్తుందనే విషయాన్ని ప్రతీ ఓటరు గుర్తుంచుకోవాలని, ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. కాంగ్రెస్‌ హయాంలో మంచి నీళ్లు కూడా ఇవ్వలేకపోయారని విమర్శించారు. 50ఏళ్ల కాంగ్రెస్‌.. పదేళ్ల BRS పాలనను గమనించి ఓటు వేయాలని ప్రజలకు సూచించారు కేసీఆర్. తెలంగాణ కోసమే బీఆర్ఎస్ పుట్టిందన్నారు. అటువంటి పార్టీని మరోసారి గెలిపించాలన్నారు.

పింగళి వెంకయ్య కుటుంబ సభ్యుల ఓట్లు తీసేశారు
ఓట్ల అవకతవకల విషయంపై టీడీపీ అవగాహన కార్యక్రమం చేపట్టింది. గొల్లపూడిలో చేపట్టిన ఈకార్యక్రమంలో మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు.. సీఎం జగన్ నాయకత్వంలో ఓటర్ల లిస్టులో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఈ అవకతవకల్లో భాగంగా పింగళి వెంకయ్య కుటుంబ సభ్యుల ఓట్లను కూడా తీసేశారని మండిపడ్డారు. టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తీసేసి దొంగ ఓట్లను చేరుస్తున్నారని ఆరోపించారు. వీటిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటంలేదన్నారు.

పోస్టర్ల కలకలం..
చేవెళ్లలో పోస్టర్లు కలకలం సష్టిస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి భీమ్ భారత్ పై కేసులు ఉన్నాయి అంటూ పోస్టర్లు వెలిశాయి. పోస్టర్లు అతికిస్తున్న ఆరుగురు వ్యక్తులను కాంగ్రెస్ కార్యకర్తలు పట్టుకున్నారు. ఓటమి భయంతోనే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు అంటూ కాంగ్రెస్ అభ్యర్థి భీమ్ భారత్ ప్రత్యర్థి పార్టీలపై మండిపడ్డారు.

11 సార్లు అవకాశం ఇస్తే ఏం చేశారు..?
కాంగ్రెస్ కావాలా..? కరెంట్ కావాలా..? అంటూ మంత్రి కేటీఆర్ ఓటర్లను ప్రశ్నించారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ లో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని..గతంలో ఉన్న పరిస్థితులే మరోసారి వస్తాయని కాబట్టి కరెంట్ కావాలంటే బీఆర్ఎస్ కు ఓటేయండి అంటూ పిలుపునిచ్చారు. ఒక్క చాన్స్ ఇవ్వాలని కాంగ్రెస్ అడుగుతోంది. కానీ 11 సార్లు అవకాశం ఇస్తే ఏం చేశారు..? అని ప్రశ్నించారు.

మేం ఏం చేశామో మీ కళ్లముందే ఉంది..
తాండూరులో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు.. ప్రజల సహాయంతో ప్రభుత్వాన్ని నడుపుతున్నామని అన్నారు. 10 ఏళ్ల మా పాలనలో రాష్ట్రం ఎలా ఉందో మీ కళ్లముందే కనిపిస్తోందని, ఆ అభివద్ధిని చూసే ఓటు వేయాలని కోరారు. 15 ఏళ్లు పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నామని.. అటువంటి పోరాటాల తెలంగాణలో మరింత అభివద్ధి జరగాలంటే మరోసారి బీఆర్ఎస్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ప్రపంచంలోనే ఏపీ గొప్ప రాష్ట్రమవుతుంది
ఏపీలో జరుగుతున్న కులగణను చారిత్రాత్మకం అంటూ ఆర్ కృష్ణయ్య అన్నారు. దేశంలో ఎవ్వరు చేయలేని పని జగన్ చేస్తున్నారు అంటూ ప్రశంసలు కురిపించారు. కులాల లెక్క ద్వారా ఆయా కులాలకు న్యాయం జరగుతుందని అని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. 20 ఏళ్లలో ప్రపంచంలోనే ఏపీ గొప్ప రాష్ట్రంగా నిలబడుతుందని అన్నారు.

ఢిల్లీ లిక్కర్ కేసు విచారణ.. కోర్టులో సిసోడియా
ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసుపై రౌస్ అవెన్యు కోర్టు విచారణ జరింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సిసోడియాను సీబీఐ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో 2023 ఫిబ్రవరి 23న సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈకేసులో ఇప్పటికే జ్యుడిషియల్ కస్టడిలో సిసోడియా బెయిల్ కు పలుమార్లు యత్నించినా రాలేదు. ఈక్రమంలో సిసోడియా కస్టడిని డిసెంబర్ 11వరకు రౌస్ అవెన్యు కోర్టు పొడిగించింది.

గాంధీ భవన్ రిమోట్ భగవత్ చేతిలో
గాంధీ భవన్ రిమోలు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేతిలో ఉంది అంటూ ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ పై సెటైర్లు వేశారు. బీజేపీపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టంచేశారు. కాంగ్రెస్ వల్లే బీజేపీ గెలుస్తోంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి జీవితం ఆర్ఎస్ఎస్ లోనే ప్రారంభమైందన్నారు.

ప్రధాని మూడు రోజుల్లో ఆరు సభలు..
ప్రధాని మోదీ మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. తెలంగాణలో గెలుపుపై ఫోకస్ పెట్టిన బీజేపీ ఆ దిశగా కృషి చేస్తోంది. ఢిల్లీ నుంచి అగ్రనేతలు సైతం వచ్చి తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ ప్రచారం నిర్వహించారు. దీంట్లో భాగంగా మరోసారి తెలంగాణకు రానున్నారు. నవంబర్ 25,26,27 తేదీల్లో తెలంగాణలో ప్రచారం చేయనున్నారు. మూడు రోజుల్లో ఆరు సభల్లో ప్రధాని పాల్గొననున్నారు. దీని కోసం తెలంగాణ బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. 25న మహేశ్వరం,కామారెడ్డి, 26న తుఫ్రాన్, నిర్మల్,27న మహబూబాబాద్, కరీంనగర్ లలో మోదీ సభల్లో పాల్గొననున్నారు.

నీళ్ల కోసం..
హైదరాబాద్ లో నిజాం కాలేజీ విద్యార్ధులు ధర్నాకు దిగారు. హాస్టల్ లో నీటి సౌకర్యం లేదంటూ హైదరాబాద్ లో విద్యార్ధుల మండిపడ్డారు. విద్యార్ధుల ధర్నాకు విద్యార్థి సంఘాలు మద్దతుపలికాయి. విద్యార్ధుల ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్ధులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకోవటంతో పలువురు విద్యార్ధి సంఘం నేతలను అదుపులోకి తీసుకున్నారు. నీటి సౌకర్యం కోసం పోరాడుతుంటే అక్రమంగా అరెస్ట్ చేస్తారా..? అంటూ నేతలు మండిపడుతున్నారు.

హస్తం గూటికి దివ్యవాణి..
నటి దివ్యవాణి కాంగ్రెస్ లో చేరారు. టీడీపీలో సుదీర్ఘకాలం పనిచేసి గత కొంతకాలం క్రితం టీడీపీ నుంచి బయటకొచ్చిన ఆమె తాజాగా కాంగ్రెస్ లో చేరారు.మాణిక్ ఠాక్రే దివ్యవాణికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ యాగం..
తిరుమలలో రేపటి నుంచి అలిపిరి వద్ద శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ యాగం జరుగనుంది. ప్రతీరోజు 100 ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ జారీ చేయనుంది. యాగానికి సంబంధించిన టికెట్ ధర రూ.1000లు. ఈ టికెట్ పై ఇద్దరికి అనుమతి ఉంటుందని టీటీడీ వెల్లడించింది.

ఈడీ రైడ్స్..
హైదరాబాద్ : హెచ్ సీఏ మాజీ అధ్యక్షుడు జి. వినోద్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వినోద్ తో పాటు మాజీ క్రికెటర్లు శివలాల్ యాదవ్, అర్షద్ అయూబ్ ఇళ్లల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఉప్పల్ స్టేడియం నిర్మాణంలో అవినీతికి సంబంధించి..ఏసీబీ దాఖలు చేసిన మూడు చార్జ్ షీట్ల ఆధారంగా ఈడీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు.

క్షమాపణలు చెప్పాలి..
రాహుల్‌పై బీజేపీ నేతల విమర్శల వర్షం కురిపించారు. వరుస విజయాలతో ఫైనల్ కు దూసుకెళ్లిన భారత్ తుదిపోరులో పరాజయం పాలవ్వడానికి ప్రధాని మోదీయే కారణమని, ఆయన మ్యాచ్ చూసేందుకు వెళ్లడం వల్లే టీమ్ ఇండియా ఓటమి పాలైందని రాహుల్ విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీపై రాహుల్ చేసిన కామెంట్స్‌ వెనక్కి తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేశారు.