Tulu language: అధికారిక భాషగా తుళు.. హోరెత్తుతున్న ప్రచారం!

తుళు భాషను కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో అధికారిక భాషగా ప్రకటించాలని సోషల్ మీడియా వేదికగా ప్రచారం హోరెత్తుతోంది. ఈ ప్రచారానికి కొందరు రాజకీయ నేతలు కూడా మద్దతు ఇస్తుండడంతో ఈ వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుందోనని ఆసక్తిగా మారుతుంది.

Tulu language: అధికారిక భాషగా తుళు.. హోరెత్తుతున్న ప్రచారం!

Twitter Campaign For Tulu As Official Language Gets Good Response In Social Media

Updated On : June 14, 2021 / 10:04 PM IST

Tulu language: తుళు భాషను కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో అధికారిక భాషగా ప్రకటించాలని సోషల్ మీడియా వేదికగా ప్రచారం హోరెత్తుతోంది. ఈ ప్రచారానికి కొందరు రాజకీయ నేతలు కూడా మద్దతు ఇస్తుండడంతో ఈ వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుందోనని ఆసక్తిగా మారుతుంది. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో #TuluOfficialinKA_KL హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్లో ఈ ప్రచారం మొదలు కాగా కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో తుళును అధికార భాషగా ప్రకటించాలని జై తలుంద్ డిమాండ్ చేసింది.

పలు తుళు సంస్థలు ఈ ఉద్యమానికి మరింత ఊతమిస్తూ పోస్టులు చేయగా పలువురు రాజకీయ నాయకులతోపాటు తీర ప్రాంత ప్రజలు కూడా మద్దతు పలుకుతూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దక్షిణ కన్నడ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ ఇప్పటికే ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించి తుళులో ట్వీట్ చేస్తూ 8వ షెడ్యూల్‌లో తుళును చేర్చేందుకు ప్రయత్నాలు, చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలోనే తుళును అధికారిక భాషగా ప్రకటించే ప్రయత్నం చేస్తామన్నారు.

మాజీ ఎమ్మెల్సీ గణేశ్ కార్నిక్, ఎమ్మెల్యే వేదవ్యాస్ కమాత్, మంగళూరు నగర్ నార్త్ ఎమ్మెల్యే భరత్ శెట్టి, దక్షిణ కన్నడ జిల్లా ఇన్‌‌చార్జ్ మంత్రి కోటా శ్రీనివాస్ పూజారీ కూడా ఈ ఉద్యమానికి మద్దతు పలికారు. తుళు భాషకు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తున్న తుళునాడు ప్రజల డిమాండ్‌ కు మద్దతు ఇస్తున్నట్టు మంత్రి శ్రీనివాస్ తెలిపారు. ట్విట్టర్‌లో జరుగుతున్న ఈ ప్రచారానికి ఒక్క రోజులోనే 2.5 లక్షల మందికిపైగా మద్దతు ప్రకటించగా కర్ణాటకలో ఇది రాజకీయంగా ఎలాంటి మలుపు తిరిగుతుందనే ఆసక్తి నెలకొంది.