వికారాబాద్‌లో రేషన్ కష్టాలు, ఆధార్ సెంటర్ల దగ్గర రాతంత్రా పడిగాపులు

que infront of aadhaar center: రేషన్ సరుకులు పొందాలంటే ఆధార్ తో మొబైల్ నెంబర్ లింక్ తప్పనిసరి చేయడంతో వికారాబాద్ లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు ఆధార్ సెంటర్లకు క్యూ కట్టారు. ఆధార్ తో మొబైల్ నెంబర్ అనుసంధానం చేసుకునేందుకు అవస్థలు పడుతున్నారు. ఆర్డీవో ఆఫీస్ ఆవరణలో ఉన్న ఆధార్ సెంటర్ లో రాత్రంతా పడిగాపులు కాస్తున్నారు. రేషన్ రాదన్న భయం ప్రజలను వెంటాడుతోంది. మూడు రోజుల నుంచి ఆధార్ సెంటర్ చుట్టూ తిరుగుతూనే ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధార్ తో మొబైల్ నెంబర్ అనుసంధానం ఆప్షన్ ఎత్తివేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
రేషన్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్‌తో ప్రజలు కష్టాలుపడుతున్నారు. మూడు రోజులుగా ఆధార్ సెంటర్ చుట్టూ తిరుగుతున్నా తమ వంతు రావడం లేదని లబ్ధిదారులు వాపోయారు. ఆధార్ సెంటర్ దగ్గర అర్ధరాత్రి తీవ్ర చలిలో మంటలు వేసుకుని మరీ జనం పడిగాపులు కాస్తున్నారు. మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే బియ్యం ఇవ్వరేమోననే భయం ప్రజల్లో ఉంది. ఈ వ్యవహారంపై అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
కరోనా వైరస్ ను నియంత్రించడంలో భాగంగా ఫిబ్రవరి 1 నుంచి కొత్త విధానం తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. రేషన్ కార్డు కలిగిన వారు కచ్చితంగా వారి ఆధార్ కార్డుతో మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్ ఓటీపీ ద్వారా రేషన్ సరుకులు తీసుకోవడం వీలవుతుంది. కోవిడ్ 19 వల్ల బయోమెట్రిక్ అథంటికేషన్‌ను నిలుపుదల చేసిన విషయం తెలిసిందే.
కొత్త రూల్ ప్రకారం రేషన్ కావాలంటే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ చెప్పాల్సిందే. తెలంగాణలో మొదటిసారిగా ఓటీపీ విధానాన్ని అమలు చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా పరిధిలో రేషన్ తీసుకోవాలంటే రేషన్ కార్డు హోల్డర్ల రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెప్తేనే సరుకులు తీసుకోవడం సాధ్యమవుతుంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఐరిస్ ఆథెంటికేషన్ సిస్టమ్ ఇక పనిచేయదు.
తెలంగాణలోని మొత్తం 87లక్షల 44వేల 251 రేషన్ కార్డు లబ్దిదారులు ఉండగా వారిలో 5లక్షల 80వేల 680 కార్డులు హైదరాబాద్‌లో.. 5లక్షల 24వేల 656 కార్డులు రంగారెడ్డి జిల్లాలో.. 4లక్షల 94వేల 881 కార్డులు మేడ్చల్ మల్కార్‌జిరి జిల్లాలో.. 2లక్షల 34వేల 940 కార్డులు వికారాబాద్ జిల్లాలో ఉన్నాయి. ఈ రేషన్ కార్డు హోల్డర్లంతా ఇకపై తమ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ చెప్పి రేషన్ షాపులో సరుకులు తీసుకోవాలి. కాబట్టి రేషన్ కార్డులు ఉన్నవారంతా తమ మొబైల్ నెంబర్‌ను ఆధార్ నెంబర్‌కు లింక్ చేయడం తప్పనిసరి. అన్నపూర్ణ, అంత్యోదయ కార్డులకు కూడా ఇదే రూల్ వర్తిస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సరుకులతోపాటు కేంద్ర ప్రభుత్వానికి చెందిన అన్నపూర్ణ, అంత్యోదయ స్కీమ్‌ల ద్వారా ఇచ్చే సరుకుల్ని రేషన్ కార్డులపై పొందొచ్చు. ఈ పథకాలే కాదు మరిన్ని ప్రభుత్వ స్కీమ్‌ల ద్వారా లబ్ధి పొందడానికి రేషన్ కార్డు ముఖ్యమైన డాక్యుమెంట్. కరోనా వైరస్ మహమ్మారి లాక్‌డౌన్ సమయంలో పేదలకు సరుకులు అందజేసేందుకు రేషన్ షాపుల పాత్ర కీలకంగా మారింది. కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అంటే రేషన్ కార్డు హోల్డర్లు దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు.
ఎవరైనా రేషన్ కార్డుకు అప్లై చేయొచ్చు. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారికి ప్రత్యేక పథకాలు ఉన్నాయి. బిలో పావర్టీ లైన్-BPL, నాన్ బీపీఎల్ పేరుతో రెండు రకాలుగా రేషన్ కార్డులు ఉంటాయి. 18 ఏళ్లు దాటినవారు ఎవరైనా రేషన్ కార్డుకు దరఖాస్తు చేయొచ్చు. ఒక రాష్ట్రంలో మాత్రమే రేషన్ కార్డుకు అప్లయ్ చేయాలి. రేషన్ కార్డులో యజమాని పేరుతో పాటు కుటుంబ సభ్యుల పేర్లు ఉంటాయి.