గ్రేటర్‌లో గెలుపెవరిది? ఓటర్లు ఎవరికి పట్టం కడతారు?

GHMC Elections political parties : గ్రేటర్‌లో గెలుపెవరిది? కారు స్పీడెంత? కమలం జోరెంత? హస్తం పవరెంత?.. పతంగి ఎన్ని డివిజన్లలో ఎగురుతుంది. విజయంపై పార్టీలు వేసుకుంటున్న లెక్కలేంటి? బల్దియా పోలింగ్ ముగియడంతో రాజకీయ పార్టీలు గెలుపుపై లెక్కలు వేసుకుంటున్నాయి. పోలింగ్ సరళిని బట్టి విజయం మాదంటే.. మాదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
మళ్లీ మేయర్ కుర్చీ తమదేనని, ఈసారి కచ్చితంగా 100 స్థానాల్లో గెలుస్తామని టీఆర్ఎస్ అంచనా వేసుకుంటుంది. పోలింగ్ జరిగిన తీరు, ప్రజాభిప్రాయం కూడా ఇదే చెబుతోందని టీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. ప్రభుత్వ పథకాల లబ్దిదారుల ఓట్లన్నీ కారు ఖాతాలోనే చేరాయని చెబుతున్నారు. చాలా డివిజన్లలో వార్ వన్ సైడ్ అయిందని భావిస్తున్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో తమ ఓటింగ్ షేర్ అనూహ్యం పెరిగిందని బీజేపీ అంచనా వేస్తుంది. గతంలో 4 స్థానాలే గెలిచామని ఇప్పుడు 45కు పైగా డివిజన్లలో సత్తా చాటుతామంటున్నారు. బస్తీ ఓట్లు.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ తమ ఖాతాలోనే చేరాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు .
కొన్నిచోట్ల ఓటర్లే ఫోన్ చేసి డబ్బులు పంచేవారిని పట్టించారని.. ఈలెక్కన మెజారిటీ ఓటర్లు కమలంవైపే ఉన్నట్టు అంచనా వేస్తున్నామంటున్నారు. ఇక హిందుత్వ ఓట్లతో పాటు న్యూట్రల్ ఓట్లు కూడా రాబట్టామని చెబుతున్నారు.
పాతబస్తీలో ఎంఐఎం కోటలకు బీటలు తప్పవంటున్నారు బీజేపీ నేతలు. ఓల్డ్ సిటీలో 7 నుంచి 9 డివిజన్లలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు డీలాపడ్డ కాంగ్రెస్‌లో పోలింగ్ సరళితో కొత్త ఆశలు చిగురించేలా చేసిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. తమ 12 శాతం ఓట్ షేరింగ్ ఢోకా లేదంటున్నారు. 12 నుంచి 15 వరకు స్థానాల్లో గెలుస్తామని చెబుతున్నారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలో ఎక్కువ సీట్లు గెలుస్తామంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లపై కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది.
ఎంఐఎం ఎప్పటిలాగే పాతబస్తీలో పాగా వేస్తామనే విశ్వాసంతో ఉంది. 40 చోట్ల పతంగి ఎగరడం ఖాయమంటుంది. పాతబస్తీ బయట కూడా రెండు మూడు సీట్లు గెలుస్తామంటుంది ఎంఐఎం. అటు 29 స్థానాల్లో పోటీ చేసిన సీపీఐ, సీపీఎంలతో పాటు 26 చోట్ల బరిలోకి దిగిన టీజేఎస్ కూడా తాము గట్టిపోటీ ఇవ్వగలిగామనే అభిప్రాయంతో ఉన్నాయి.
స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో సత్తా చాటుతామనే ధీమాలో ఉన్నారు. గెలుపుపై ఏ పార్టీ లెక్క ఎలా ఉన్నా.. అసలు గ్రేటర్ ఓటర్లు ఎవరికి పట్టం కట్టారో తెలియాలంటే శుక్రవారం వరకు ఆగాల్సిందే.