AINU Doctors : నెలలు నిండని శిశువుకు ప్రాణాపాయం.. కాపాడిన ఏఐఎన్‌యూ డాక్టర్లు!
AINU Doctors : ఆ శిశువుకు పోస్టీరియర్ యూరేత్రల్ వాల్వ్స్ (పీయూవీ) అనే అరుదైన సమస్య ఉన్నట్టు నిర్ధారణ అయింది. సాధారణంగా మగ పిల్లలకే వస్తుంది.

AINU doctors saved the life of a one-month-old baby
AINU Doctors : నెలలు నిండని శిశువుల్లో ఆరోగ్య పరంగా అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. కొన్నిసార్లు అది ప్రాణాపాయానికి దారితీస్తుంది. పుట్టిన 32 వారాలకు 2 కిలోల బరువు కలిగిన ఓ పసికందుకు ఇదే పరిస్థితి ఎదురైంది. కానీ, ఆ శిశువుకు రెండు సర్జరీలు చేసి ప్రాణం పోశారు ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) వైద్యులు.
Read Also : Health Insurance: హెల్త్ ఇన్సురెన్స్ నగదు రహిత చికిత్సలపై ఇకపై గంటలోపే నిర్ణయం.. అంతేకాదు..
హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యాపారవేత్తకు నెలలు నిండకముందే శిశువు జన్మించింది. అయితే, ఆ శిశువుకు పోస్టీరియర్ యూరేత్రల్ వాల్వ్స్ (పీయూవీ) అనే అరుదైన సమస్య ఉన్నట్టు నిర్ధారణ అయింది. సాధారణంగా మగ పిల్లలకే వస్తుంది. మూత్రాశయంలోని మూత్రప్రవాహానికి పెరిగిన కణజాలం అడ్డుకుంటుంది. మూత్రం బయటకు రాకపోతే మూత్రపిండాలు దెబ్బతింటాయి.
తల్లి గర్భంలో శిశువు మూత్ర విసర్జన కూడా కష్టంగా ఉంటుంది. ఫలితంగా శిశువు చుట్టూ అమ్నియోటిక్ ద్రవం తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే నెలలు నిండకముందే శిశువు జన్మిస్తారు. ఈ శిశువు కూడా అలానే జన్మించింది. పీయూవీ సమస్య పుట్టుకతోనే వస్తుంది. తల్లి గర్భంలో లేదా ప్రసవం సమయంలో గుర్తించవచ్చు. అడ్డుగా ఉన్న కణజాలాలను తొలగించి శిశువు మూత్రవిసర్జన అయ్యేలా శస్త్రచికిత్స చేస్తారు. ఈ శిశువుకు ఒకేసారి సర్కమ్‌సిషన్, వాల్వ్ ఫల్గరేషన్ అనే రెండు శస్త్రచికిత్సలు చేశారు. ఈ బృందానికి పీడియాట్రిక్ యూరాలజిస్టు డాక్టర్ ప్రభు కరుణాకరన్ నేతృత్వం వహించారు.
శిశువుకు రెండు సార్లు మత్తుమందు ఇచ్చారు. తక్కువ బరువున్న పిల్లలకు శస్త్రచికిత్సకు అనేక సవాళ్లుంటాయి. మత్తుమందు చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. ఇన్ఫెక్షన్లను నియంత్రించాలి. ప్రత్యేక పరికరాలు ఉపయోగించాలి. మూత్రనాళంలోని అడ్డంకులను తొలగించేందుకు ఎండోస్కొపిక్ పద్ధతులు ఉపయోగించారు. ముందుగా సర్కమ్‌సిషన్ చేసి ఆ తర్వాత వాల్వ్ ఫల్గరేషన్ చేశారు. రెండు గంటలపాటు జరిగిన ఈ సర్జరీ సక్సెస్ అయింది. శిశువును నియోనేటల్ ఐసీయూకు తరలించారు. అనంతరం కోలుకునేలా చూశారు. శిశువు మళ్లీ సాధారణ స్థితికి రావడంతో తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
Read Also : Mental Health Study : మానసిక ఆరోగ్యంపై అధ్యయనం.. భారత్‌లో పురుషుల్లో కన్నా మహిళల్లోనే తీవ్ర ఒత్తిడి..!