మేఘాలు బాగున్నాయి.. Odd-even స్కీమ్ అక్కర్లేదు : సీఎం కేజ్రీవాల్

దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ఢిల్లీ ప్రభుత్వం సరి-బేసి ఫార్ములాను అమల్లోకి తెచ్చింది. అప్పటినుంచి ఇదే ఫార్ములాను కొనసాగిస్తోంది. ఇప్పటి వరకూ ఢిల్లీలో మూడో విడతలో భాగంగా నవంబర్ 4 నుంచి నవంబర్ 15 వరకు సరి-బేసి స్కీమ్ కొనసాగింది. కొన్ని రోజుల నుంచి ఢిల్లీలో కాలుష్య స్థాయి తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో సరి-బేసి స్కీమ్ కొనసాగించాలా లేదా పొడిగించాలా? అనేదానిపై మిశ్రమ స్పందన వస్తోంది.
తాజాగా సోమవారం (నవంబర్ 18, 2019) సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఢిల్లీలో గాలి కాలుష్య స్థాయి తగ్గిపోతే.. సరి-బేసితో పాటు రోడ్ రేషనింగ్ స్కీమ్ కూడా తిరిగి ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదని సీఎం స్పష్టం చేశారు. ‘ఇప్పుడు ఆకాశంలో మేఘాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏ స్కీమ్ అవసరం లేదు’ అని ఆయన అన్నారు. గాలి నాణ్యత క్రమంగా మెరుగుపడుతుండటంతో సరి-బేసి స్కీమ్ పొడిగింపుపై నిర్ణయాన్ని గతవారమే కేజ్రీవాల్ వెనక్కి తీసుకున్నారు.
సోమవారం ఢిల్లీలో ఉదయం 8గంటల సమయంలో గాలి (222) నాణ్యత చాలా తక్కువగా ఉందని సెంట్రల్ పొల్యుషన్ కంట్రోల్ బోర్డు (CPCB), ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) డేటా వెల్లడించింది. గాలి కాలుష్య ప్రభావం ప్రమాదకర స్థాయికి పెరిగిపోవడంతో గతవారమ ఢిల్లీలోని NCR పరిసర ప్రాంతాల్లోని స్కూళ్లను రెండు రోజుల పాటు మూసివేశారు.