Albumin : మూత్రంలో అల్బుమిన్ ప్రొటీన్ పోతుందా…ఎందుకో తెలుసా?

స్త్రీలతో పోల్చుకుంటే ఈ వ్యాధి పురుషుల్లో రెండు రెట్లు ఎక్కువ. అలాగే వయసుతోపాటు ఈ సమస్య కూడా పెరుగుతుంది. అధిక రక్తపోటు, మధుమేహం వంటివి ఉన్నాయని తెలిసినప్పుడు చేయించే

Albumin : మూత్రంలో అల్బుమిన్ ప్రొటీన్ పోతుందా…ఎందుకో తెలుసా?

Albumin

Updated On : December 18, 2021 / 11:18 AM IST

Albumin : శరీరం నుండి బయటి వెళ్ళే వ్యర్ధ పదార్ధాల్ని పంపించే ద్రవాన్ని మూత్రంగా చెప్తారు. ఇది రక్తం నుండి వడపోత ద్వారా మూత్ర పిండాలలో తయారై తరువాత మూత్ర నాళాల ద్వారా మూత్రాశయాన్ని చేరి మూత్ర విసర్జనం ద్వారా శరీరం నుండి బయటకు పోతుంది. మన శరీరంలో జీవక్రియలలో తయారయ్యే వివిధములైన వ్యర్ధ పదార్ధాలు ముఖ్యంగా నైట్రోజన్ సంబంధించినవి రక్తం నుండి బయటికి పంపించాల్సిన అవసరం ఉన్నది.

మన రక్తంలో ఆల్బుమిన్ అనే ప్రొటీన్ ఉంటుంది. రక్తం ప్రవాహ పీడనాన్ని నిర్దేశిత స్థితిలో ఉంచటం దీని ప్రధాన కర్తవ్యం. దీనికోసం శరీరంలో రక్తంతోపాటు ప్రొటీన్ కూడా సంచరిస్తుంటుంది. ఈ నేపథ్యంలో ప్రొటీన్‌తోకూడిన రక్తం మూత్ర పిండాలను చేరుకుంటుంది. కిడ్నీలు రక్తంలో అదనంగా ఉండే ప్రొటీన్‌ని వడపోత ద్వారా వేరుపరిచి వెలుపలకి విసర్జిస్తాయి. ఇది శారీరక క్రియలో భాగంగా కనిపించే సహజ ప్రక్రియ. అయితే ఏదైనా కారణం చేత మూత్రపిండాలు విసర్జించాల్సిన స్థాయి కంటే ఎక్కువ ప్రొటీన్‌ని లేదా ఆల్బుమిన్‌ని మూత్రం ద్వారా వెలువరిస్తే దానిని ఆల్బుమినూరియా అంటారు. దీనినే మైక్రోఆల్బిమునూరియా అని కూడా పిలుస్తారు.

మన శరీరాల్లో అల్బుమిన్ ప్లాస్మా ప్రొటీన్లనేవి ఉండటం అవసరం. ఈ ప్రొటీన్లు వెలుపలకు వెళ్లిపోకుండా చేయడంలో కిడ్నీలు కీలకపాత్ర పోషిస్తాయి. గ్లోమరూలర్ ఫిల్టరేషన్ బ్యారియర్ ద్వారా ప్రొటీన్లు వెళుతున్నప్పుడు కిడ్నీలలోని రీనల్ ట్యూబ్యూల్స్ అనే నిర్మాణాలు ఈ ప్రొటీన్లను తిరిగి శరీరంలోకి గ్రహిస్తాయి. ఆరోగ్యవంతుల్లో రోజు మొత్తం విసర్జించిన మూత్రంలో 150 మిల్లీ గ్రాముల వరకూ అనగా 100 మిల్లీలీటర్ల మూత్రంలో 10 మిల్లీ గ్రాముల వరకూ ప్రొటీన్ కనిపించడం సహజం. ఇంతకంటే ఎక్కువ మొత్తాల్లో ప్రొటీన్ మూత్రంతోపాటు వెళుతుంటే దానిని అసాధారణంగా భావించాలి. కిడ్నీ వ్యాధులుగాని లేదా ఇతర సాధారణ వ్యాధులు వచ్చినట్లుగా భావించాల్సి ఉంటుంది.

శారీరక శ్రమ, తీవ్రావస్థలో కనిపించే వ్యాధులు, హెచ్చు స్థాయి జ్వరాలు, నెలసరిలో అపక్రమం, గర్భధారణ, అసాధారణమైన యోనిస్రావాలు, ఆహారంలో తేడాలు, అధిక రక్తపోటు, రక్తంలో చక్కెర నిల్వలు పెరగటం వంటి అనేక అంశాలు మైక్రో ఆల్బునూరియాకి కారణమవుతాయి. రాత్రి కంటే పగటిపూట ఆల్బుమిన్ విసర్జన 25 శాతం అధికంగా ఉంటుంది. టైప్ 1 మధుమేహంలో ఆల్బుమినూరియా కనిపిస్తే మూత్ర పిండాల వైఫల్యాన్ని పరిగణించాలి. కాగా టైప్ 2 మధుమేహంలో ఆల్బుమినూరియా కనిపిస్తే గుండె కండరాలకు రక్త సరఫరా తగ్గటంవల్ల ఉత్పన్నమయ్యే ఇస్కీమిక్ గుండె జబ్బులను దృష్టిలో ఉంచుకోవాలి.

స్త్రీలతో పోల్చుకుంటే ఈ వ్యాధి పురుషుల్లో రెండు రెట్లు ఎక్కువ. అలాగే వయసుతోపాటు ఈ సమస్య కూడా పెరుగుతుంది. అధిక రక్తపోటు, మధుమేహం వంటివి ఉన్నాయని తెలిసినప్పుడు చేయించే రొటీన్ పరీక్షల్లో ఆల్బూమినూరియా ఉన్నట్లు బయటపడుతుంది. ఆల్బూమినూరియా ఉన్నంత మాత్రాన దానిని ప్రమాదభరితమైన మూత్రపిండాల వ్యాధులకు ముడిపెట్టాల్సిన పనిలేదు. మామూలు వ్యాధుల్లో సైతం ఈ లక్షణం కనిపించే అవకాశం ఉంది. ఆల్బూమినూరియా ఉన్నదని తేలినప్పుడు మూత్రంలో ఎరుపుదనం, నురగ వంటి లక్షణాలు కనిపిస్తాయి. అదేసమయంలో మడమల్లోను వాపు, కంటిచుట్టూ వాపు, వృషణాలూ, యోని పెదవుల్లో వాపు వంటివి అనుబంధంగా లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుంది.

రక్తంలో కొలెస్టరాల్ అధికంగా ఉండటం, గర్భధారణలో కిడ్నీలు వ్యాధిగ్రస్తమైన సందర్భాలు ఉండటం, మధుమేహం ఉండటం, కుటుంబంలో ఇతరులకు మధుమేహం ఉండటం, రుమటాయిడ్ ఆర్థరైటిస్, సిస్టమిక్ ల్యూపస్ వంటి ఇన్‌ఫ్లమేటరీ వ్యాధులుండటం, క్షయ, మలేరియా, సిఫిలిస్, ఎండోకార్డైటిస్ వంటి వ్యా ధుల బారిన పడిన సందర్భాల్లో,హెచ్‌ఐవి, హెపటైటిస్-బి వంటి వ్యాధుల బారిన పడిన వారిలో యూరిన్ లో అల్బుమిన్ పోవటాన్ని గుర్తించవచ్చు.

శాశ్వతంగా మూత్రంలో ప్రొటీన్ పోతుండటం, మూత్రంతోపాటు విసర్జితమయ్యే ప్రొటీన్ మొత్తాలు 500 మిల్లీ గ్రాముల ఉండటం అనేది అంతర్గత కిడ్నీ వ్యాధిని సూచిస్తుంది. అల్బుమిన్‌ అనేది ఒక రకం ప్రోటీను. మూత్రంలో ఈ సుద్ద ఎక్కువగా పోతోందంటే కిడ్నీల వడపోత సామర్ధ్యం తగ్గిపోతున్నట్టుగా గుర్తించాలి. శరీరాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసే శుద్ధి యంత్రాలుగా కిడ్నీలను చెప్పవచ్చు. అలాంటి కిడ్నీలు పనిచేయడం మానేస్తే.. మన శరీరమే విషతుల్యం అయిపోతుంది. కిడ్నీల పనితీరు విషయంలో ఏడాదికి ఒకసారైనా తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవటం మంచిది. ఇలాంటి పరిస్ధితుల్లో వైద్యుని సూచనలు సలహాలు తీసుకుని అవసరమైన చికిత్స పొందటం ఉత్తమం.