Say sorry to friend : ఈ జన్మకే వాళ్లు మీ ఫ్రెండ్స్.. ఈగోతో స్నేహాలు దూరం చేసుకోకండి

కోపం, పట్టుదలకు పోతే ఎంతో అందమైన స్నేహాలు బ్రేక్ అవుతాయి. కాస్త సహనం, ఓర్పుతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బంధాలు నిలబడతాయి. కోల్పోయిన మీ స్నేహాన్ని తిరిగి పొందాలంటే జస్ట్ ఈగోని వదిపెట్టేయడమే. తిరిగి మీ స్నేహాన్ని పొందాలంటే సారీ చెప్పేయడమే.

Say sorry to friend : ఈ జన్మకే వాళ్లు మీ ఫ్రెండ్స్.. ఈగోతో స్నేహాలు దూరం చేసుకోకండి

Say sorry to friend

Updated On : June 11, 2023 / 1:11 PM IST

Say sorry to friend : అప్పటి వరకూ అందంగా అల్లుకున్న స్నేహ బంధం.. ఏదో చిన్న మాట తేడా కావచ్చు.. మధ్యలో ఎవరో చెప్పిన మాట వినడం వల్ల విభేదాలు రావచ్చు. దానికి విడిపోవడం సొల్యూషన్ కాదు. కొంతమంది ఆవేశంలో మంచి స్నేహాల్ని చిన్న మాట పట్టింపు దగ్గర కోల్పోతారు. పట్టుదలలకు పోయి సంవత్సరాల తరబడి దూరం పెడతారు. అలాగని వారిని మర్చిపోలేరు. లోలోపల బాధపడుతూ కుమిలిపోతూ ఉంటారు. పోనీ మాట కలుపుదాం అంటే ఈగో అడ్డువస్తుంది. జీవితం చాలా చిన్నది. ఈ జీవితంలోనే ఎవరికి ఎవరైనా. ఇష్టమైన స్నేహాల్ని మళ్లీ కలుపుకోవాలంటే జస్ట్ మీ ఈగోని కాస్త పక్కన పెట్టేయండి. మనసారా మీ మిత్రులతో మాట్లాడేయండి.

Anger : కోపంతో ఊగిపోతున్నారా! అయితే జాగ్రత్త పడాల్సిందే

బిజీ లైఫ్‌లో కాస్త ఊరటనిచ్చేవి స్నేహాలు. ఇంట్లో వారికి కూడా చెప్పుకోలేని ఎన్నో కష్టనష్టాలు స్నేహితులతో మాత్రమే పంచుకుంటాం. కాసేపైనా వారితో మాట్లాడి ధైర్యం తెచ్చుకుంటాం. అంతగా అల్లుకున్న స్నేహ బంధాలు చెప్పుడు మాటల వల్ల, అపార్ధాల వల్ల విడిపోతుంటాయి. ఎంత గొప్ప స్నేహాన్నైనా విడదీసేవి అవే. గొడవలు లేని, రాని బంధాలు లేవు. కానీ సమస్య ఏంటో మాట్లాడుకుని సర్ది చెప్పుకుంటేనే ఏ బంధమైన నిలుస్తుంది. గొడవకు కారణం ఏంటో కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు సర్దుకుంటాయి. సాగదీస్తే బంధాలు విడిపోతాయి.

 

చాలామంది ఆవేశంలో స్నేహానికి బ్రేకప్ చెప్పేసి తర్వాత బాధపడతారు. తమ స్నేహితుల్ని మర్చిపోలేక వారితో గడిపిన మధుర క్షణాల్ని తలుచుకుని కుమిలిపోతారు. వారిలో తప్పెవరిదైనా తెలసుకునే ప్రయత్నం చేయరు. దానివల్ల కూడా విపరీతమైన ఒత్తిడికి లోనవుతారు. నవ్వుతూ సరదాగా సాగిపోయే జీవితంలో ఇలాంటి బ్రేకప్‌లు మనసుని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తాయి. నిజంగానే అవతలి వ్యక్తి ద్రోహానికి తలపెడితే అలాంటి బంధాలకు బ్రేకప్ చెప్పడంలో తప్పులేదు. మనకు భవిష్యత్‌లో నష్టం వాటిల్లే ప్రమాదం ఉందనుకుంటే అలాంటి వారికి దూరంగా ఉండటమే మేలు. కానీ… చిన్న చిన్న తగాదాలతో స్వచ్ఛమైన స్నేహాన్ని కోల్పోయి బాధపడటం కంటే మాట కలిపేయడం బెటర్.

ఇది నాకు అవసరం.. ఇంత ద్వేషం ఎందుకన్నా?.. కోపం మీ ఆరోగ్యానికి మంచిది కాదు..

స్నేహం కోసం ప్రాణమిచ్చేవారు ఉంటారు. అలాంటిది తప్పు ఎవరిదైనా చిన్న సారీ చెప్పలేరా? ఎలాంటి సమస్యల్ని అయినా క్షణాల్లో మర్చిపోయేలా చేసే పదం సారీ.. చాలా సంవత్సరాలుగా పంతం, పట్టుదలతో కోల్పోయిన మీ బంధాలు నిలబడేందుకు సారీ అనే పదం వాడేయండి. మీ స్నేహాన్ని మరల దగ్గర చేసుకోండి.కష్టాల్లో ధైర్యం చెప్పే ఓ భరోసా.. కన్నీరు తుడిచే ఓ ఆసరా.. నువ్వు ఏదైనా చేయగలవు అని ముందుకు నడిపించేది స్నేహితులు మాత్రమే. జీవితంలో అనేక ఒత్తిడుల నడుమ నలిగిపోతున్న మనుష్యులకు కాసేపు సంతోషాల్ని పంచేది స్నేహితులే. మనసుకి నచ్చిన స్నేహితుడితో ఓ కప్ చాయ్ తాగుతూ పది నిముషాలు కూర్చుంటే చాలు బాధల్ని మర్చిపోయే బలం వచ్చేస్తోంది.

 

వీకెండ్ ఎలా ఎంజాయ్ చేయాలని ఆలోచిస్తున్నారా? మీ సెల్ ఫోన్ తీసుకోండి.. ఇన్ని రోజులు దూరం పెట్టిన మీ మిత్రుడు/మిత్రురాలికి ఫోన్ చేయండి. ఏదైనా ఒక ప్లేస్‌లో కలవండి. మీరు విడిపోవడానికి గల కారణాన్ని మర్చిపోండి. కొత్త విషయాలు మాట్లాడుకోండి. అందమైన మీ స్నేహ బంధాన్ని కంటిన్యూ చేయండి. నీ జట్టు పచ్చి అన్న స్నేహితుడు/స్నేహితురాలికి ఒక్క సారీ చెప్పేస్తే అన్ని సమస్యలు సాల్వ్.. ఆల్ ది బెస్ట్.