Heart Health : గుండె ఆరోగ్యానికి…పాటించాల్సిన సూచనలు

కొవ్వు పదార్థాలు తగ్గించుకోవాలి. మాంసానికి బదులు చిక్కుళ్లు తినొచ్చు. వీటితో కొవ్వులేకుండానే మంచి ప్రొటీన్‌ లభిస్తుంది. వేపుళ్లు వంటి ఆహారాలు తగ్గించాలి.

Heart Health : గుండె ఆరోగ్యానికి…పాటించాల్సిన సూచనలు

Heart

Updated On : March 7, 2022 / 9:48 AM IST

Heart Health : జీవనశైలి పరమైన అలవాట్లు గుండె మీద ఎంతగానో ప్రభావం చూపుతాయి. కరోనా అనంతరం గుండె జబ్బులతో మరణిస్తున్నవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలో గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవటం, జబ్బులు దరి చేరకుండా చూసుకోవటం ఎంతో ముఖ్యం. మద్యం, పొగ మానేయటం, ఆరోగ్యకరమైన ఆహారం తినటం, చురుకుగా ఉండటం, బరువు తగ్గటం, రక్తపోటు అదుపులో ఉంచుకోవటం, కొలెస్ట్రాల్‌ పెరగకుండా చూసుకోవటం, రక్తంలో గ్లూకోజును తగ్గించుకోవటం వాటి విషయంలో జాగ్రత్తలు పాటిస్తే గుండె ఆరోగ్యంగా పదిలంగా పదికాలాలపాటు జీవితాన్ని గడపవచ్చు. గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం…

రోజువారి ఆహారంలో కూరగాయలు, పొట్టుతీయని ధాన్యాలు, చిక్కుళ్లు, పండ్ల వంటివాటిని చేర్చుకోవాలి. పీచుపదార్ధం అధికంగా ఉండే ఆహారాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రక్తప్రసరణ మెరుగుపడేందుకు విటమిన్ కె ఉండే ఆహారాలను తీసుకోవాలి. విటమిన్ కె రక్త నాళాల్లో పేరుకునే కాల్షియం వంటి ఖనిజాలను తగ్గిస్తుంది. గుండె జబ్బుల ముప్పు తప్పేలా చేస్తుంది. ప్రతి మనిషి శరీరానికి 120 మైక్రోగ్రాముల విటమిన్ కె అవసరమౌతుంది. మొలకలు, బ్రకోలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ, చేపల కాలేయం, మాంసం, గుడ్లు, కివి, అవకాడో, బ్లాక్ బెర్రీస్, దానిమ్మ వంటి వాటిలో విటమిన్ కె అధికంగా ఉంటుంది.

గుండె జబ్బుల నివారణకు వ్యాయామాలు చేయటం ఎంతో అవసరం. వేగంగా నడవటం వంటి వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. నడక, జాగింగ్, ఈత, సైక్లింగ్, వంటి వాటిని అనుసరించటం మంచిది. గంటల తరబడి ఒకే చోట కూర్చో కుండా చూసుకోవాలి. మానసిక ప్రశాంతత కోసం ప్రాణాయామం, ధ్యానం వంటి వంటివి పాటించాలి. దీని వల్ల గుండెజబ్బుల ముప్పు తగ్గుతుందని పలు అధ్యయనాల్లో తేలింది.

కొవ్వు పదార్థాలు తగ్గించుకోవాలి. మాంసానికి బదులు చిక్కుళ్లు తినొచ్చు. వీటితో కొవ్వులేకుండానే మంచి ప్రొటీన్‌ లభిస్తుంది. వేపుళ్లు వంటి ఆహారాలు తగ్గించాలి. పాలిష్‌ పట్టిన బియ్యం కన్నా దంపుడు బియ్యం ఉపయోగించాలి. విటమిన్ సి అధిక రక్తపోటు నుంచి రక్షిస్తుంది. నారింజ, కివి, నిమ్మ, జామ, ద్రాక్షపండు, బ్రకోలీ, కాలీఫ్లవర్, క్యాప్సికమ్ సహా అనేక పండ్లు, కూరగాయలలో లభిస్తుంది. జింక్ ఆక్సీకరణ సమస్యను ఎదుర్కొని గుండె సామర్థ్యాన్ని పెంచటానికి దోహదం చేస్తుంది. మాంసం, షెల్ ఫిష్, చిక్కుళ్ళు, విత్తనాలు, కాయలు, పాడి ఉత్పత్తులు, గుడ్లు, తృణధాన్యాల్లో జింక్ అధికంగా ఉంటుంది. కాబట్టి జింక్ కలిగిన ఆహారం తీసుకుంటే గుండె సమస్యలు అరికట్టవచ్చు.

శరీర బరువు విషయంలో జాగ్రత్త వహించాలి. అధిక బరువు ఏమాత్రం ఆరోగ్యకరంకాదు. దీంతోపాటు రక్తపోటు 120/80 కన్నా తక్కువ ఉండాలి. రక్తంలో మొత్తం కొలెస్ట్రాల్‌ సంఖ్య 200 ఎంజీ/డీఎల్‌ కన్నా మించకూడదు. ఇక పరగడుపున రక్తంలో గ్లూకోజు 100 ఎంజీ/డీఎల్‌ కన్నా తక్కువగా ఉండాలి. వీటిని ఎప్పటికప్పుడు పరీక్షల ద్వారా తెలుసుకుంటూ అందుకు తగ్గట్టు ఆరోగ్య నియమాల విషయంలో మార్పులు చేసుకోవాలి. అవసరమైతే వైద్యులను సంప్రదించి వారి సూచనలు సలహాలు పాటించాలి. దీని వల్ల గుండెఆరోగ్యంగా ఉండేలా చూసుకోవచ్చు.