Good Cholesterol : శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే ఆరోగ్యానికి మంచిదా?..
హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ మోతాదును పెంచేందుకు కొన్ని మందులున్నప్పటికీ, నిత్యం తప్పనిసరి వ్యాయామం, రోజూ కొంతసేపు ఎండలో గడపటం, పొగ మానెయ్యటం, బరువు తగ్గటం వంటి జీవనశైలీ మార్పులు మంచి కొలెస్ట్రాల్ పెరగటానికి దోహదం చేస్తాయి.

Hdl Cholesterol
Good Cholesterol : మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఒకటి చెడు కొలెస్ట్రాల్. దీన్నే ఎల్‌డీఎల్ అంటారు. రెండోది మంచి కొలెస్ట్రాల్. దీన్నే హెచ్‌డీఎల్ అంటారు. అయితే మనం తినే ఆహారాలు, తాగే ద్రవాలు, పాటించే అలవాట్ల వల్ల శరీరంలో ఎల్‌డీఎల్ పేరుకుపోతుంది. దాన్ని తగ్గించేందుకు హెచ్‌డీఎల్ అవసరం అవుతుంది. ఎల్‌డీఎల్ స్థాయిలు ఎక్కువగా ఉంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. హార్ట్ ఎటాక్‌లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అందువల్ల ఎల్‌డీఎల్ లెవల్స్ ను తగ్గించుకోవాలి. అందుకుగాను హెచ్‌డీఎల్‌ను పెంచుకోవాల్సి ఉంటుంది.
సాధారణ ఆరోగ్యవంతుల కంటే మధుమేహులకు గుండె జబ్బులు, పక్షవాతం ముప్పు ఎక్కువ. అయితే రక్తంలో మంచి కొలెస్ట్రాల్ హెచ్‌డీఎల్ స్థాయులను పెంచుకోవటం ద్వారా ఈ ముప్పులను బాగా తగ్గించుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రక్తంలో హెచ్‌డీఎల్ స్థాయి 5 ఎంజీ/డీఎల్ పెరిగినా గుండె జబ్బులు, పక్షవాతం కారణంగా ఆసుపత్రి పాలు కావటమనేది 4% తగ్గుతున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. మరోవైపు ఈ హెచ్‌డీఎల్- 6.5 ఎంజీ/డీఎల్ తగ్గితే ఆసుపత్రిలో చేరాల్సి వచ్చే ముప్పు 11% పెరుగుతోందని వెల్లడైంది. అంటే మంచి కొలెస్ట్రాల్ స్థాయులను పెంచుకోవటం అత్యుత్తమం, కనీసం అది తగ్గకుండా చూసుకోవటం అత్యవసరం. సాధారణంగా హెచ్‌డీఎల్ స్థాయి 40 ఎంజీ/డీఎల్ కన్నా ఎంత ఎక్కువుంటే మంచిది.
మన శరీరంలో హెచ్‌డీఎల్ లెవల్స్ 60 mg/dL వరకు ఉండాలి. 40 mg/dL కన్నా తక్కువగా ఉంటే ఆ స్థాయిలను పెంచుకోవాలని అర్థం. లేదంటే ఎల్‌డీఎల్ పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే కింద తెలిపిన పలు ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ హెచ్‌డీఎల్ లెవల్స్ ను పెంచుకోవచ్చు. దీంతో ఎల్‌డీఎల్ తగ్గుతుంది. మరి ఆ ఆహారాలు ఏమిటంటే..
హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ మోతాదును పెంచేందుకు కొన్ని మందులున్నప్పటికీ, నిత్యం తప్పనిసరి వ్యాయామం, రోజూ కొంతసేపు ఎండలో గడపటం, పొగ మానెయ్యటం, బరువు తగ్గటం వంటి జీవనశైలీ మార్పులు మంచి కొలెస్ట్రాల్ పెరగటానికి దోహదం చేస్తాయి. అంతే కాకుండా మంచి కొవ్వులను పెంచుకునేందుకు తగిన ఆహారపదార్ధాలను తీసుకోవాలి. బీన్స్, పప్పు దినుసులు, శనగలు, పెసలు, సోయాబీన్స్ లలో ఐరన్ అధికంగా ఉంటుంది. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి హెచ్‌డీఎల్‌ను పెంచుతాయి. అందువల్ల ఈ ఆహారాలను రోజూ తీసుకుంటే మంచిది. వీటిల్లో ఉండే ఫోలేట్, మెగ్నిషియం, పొటాషియం గుండె జబ్బులు రాకుండా రక్షిస్తాయి. ఎల్‌డీఎల్‌ను తగ్గిస్తాయి. హెచ్‌డీఎల్‌ను పెంచుతాయి.
వాల్ నట్స్, బాదంపప్పు, జీడిపప్పులో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. అలాగే మెగ్నిషియం, ఐరన్, మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి శక్తి స్థాయిలను పెంచుతాయి. బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తాయి. అవిసె గింజలు, గుమ్మడికాయ విత్తనాలు, చియా సీడ్స్‌లోనూ తగిన మోతాదులో మెగ్నిషియం ఉంటుంది. అలాగే ఫైబర్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి గుండెను సంరక్షిస్తాయి. హెచ్‌డీఎల్ లెవల్స్ ను పెంచుతాయి. ఫ్రీ ర్యాడికల్స్ ను నాశనం చేస్తాయి.
అవకాడోలను తినడం వల్ల వాపులకు వ్యతిరేకంగా పోరాడుతాయి. వీటిని తింటుంటే హెచ్‌డీఎల్ లెవల్స్ పెరుగుతాయి. వీటిల్లో మెగ్నిషియం, పొటాషియం, విటమిన్ బి, కె, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి ఎల్‌డీఎల్‌ను తగ్గిస్తాయి. హెచ్‌డీఎల్ లెవల్స్‌ను పెంచుతాయి. దీంతో ఆరోగ్యంగా ఉంటారు.