Metabolism : శరీర ఆరోగ్యానికి మెటబాలిజం పెంచుకోవటం అవసరమా!
రాత్రిపూట రోజుకి 6-7 గంటలు నిద్రపోవటం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆలస్యంగా పడుకొని, తగినంత నిద్రపోనివారిలో ఒత్తిడి పెరగటమే కాదు, శరీరంలో అవయవాల చుట్టూ కొవ్వు పేరుకుంటుంది.

Metabolism
Metabolism : శరీరంలో జరిగే రసాయనిక ప్రక్రియను మెటబాలిజంగా చెప్పవచ్చు. శరీరంలో మెటబాలిజం బాగా ఉండే కేలరీల ఖర్చు అంత త్వరగా జరుగుతుంది. కేలరీలు ఖర్చయ్యే వేగం అందరిలో ఒకేలా ఉండదు. మెటబాలిజం తగ్గితే అనారోగ్య సమస్యలు వస్తాయి. మెటబాలిజం తగ్గితే శరీరంలో కొవ్వులు పేరుకు పోయి , బరువు పెరుగుతారు. కొందరు ఎక్కువగా తిన్నప్పటికీ సన్నగా ఉండటానికీ.. మరికొందరు ఏ కొంచెం తిన్నా బరువు పెరగటానికీ మెటబాలిజంలో తేడాలే కారణం. జీవక్రియల్లో మార్పుల మూలముగా మధుమేహం, అధిక రక్తపోటు, స్థూలకాయం, క్యాన్సర్ వంటి వాటిని మనం ఎదుర్కోవాల్సి వస్తుందని పరిశోధకులు చెప్తున్నారు.
జీవక్రియల వేగం తక్కువగా ఉండే వారిలో కేలరీలు ఖర్చు కావటమూ నెమ్మదిగా జరుగుతుంది. దీంతో కేలరీలు పోగుపడి, బరువు పెరుగుతుంటారు. అదే జీవక్రియలు వేగంగా జరిగేవారిలో కేలరీలు ఖర్చూ అధికమే. కాబట్టి బరువు పెరిగే అవకాశం తక్కువ. రోజుకి 6-8 గ్లాసుల నీరు తాగటం మంచిది. ఇది జీవక్రియల వేగాన్ని పెంచి శరీరం నుంచి విష పదార్థాలు, అధిక కొవ్వును తొలగించటానికి తోడ్పడుతుంది. భోజనానికి ముందు చల్లటి నీరు తాగితే జీర్ణాశయం కుంచించుకుపోయి కొంచెం తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది.
బిస్కట్లు, బ్రెడ్, చాక్లెట్లు, ఫాస్ట్‌ఫుడ్, వేపుళ్లు, కేకుల వంటి వాటిల్లో ట్రాన్స్‌ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి రక్తంలో కొలెస్ట్రాల్‌ను పెంచి హాని చేస్తాయి. మంచి కొలెస్ట్రాల్ మోతాదునూ తగ్గిస్తాయి. కాబట్టి వీటి జోలికి వెళ్లకపోవటమే మంచిది. ఒకేసారి ఎక్కువగా తినటం కన్నా కొంచెం కొంచెంగా రోజుకి 4-6 సార్లు ఆహారం తీసుకోవటం మంచిది. భోజనాన్ని మానేయటం అసలు చేయరాదు. క్రమం తప్పకుండా ఆహారం తీసుకోకపోతే జీవక్రియలు మందగించి, కొవ్వు పేరుకుపోవటానికి దారి తీస్తుంది. ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనెలను వాడడం వల్ల కూడా మన శరీర మెటబాలిజం పెరుగుతుంది.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం ఎంతో అవసరం. రోజుకి కనీసం 2-3 కి.మీ. నడవాలి. శారీరకశ్రమ మూలంగా గుండె, వూపిరితిత్తులు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తాయి. సాయంత్రం పూట శారీరకశ్రమ మెటబాలిజమ్‌కు ఎంతగానో తోడ్పడుతుంది. ఎందుకంటే రాత్రయ్యే కొద్దీ చాలామందిలో జీవక్రియల వేగం మందగిస్తుంటుంది. రాత్రి భోజనానికి ముందు అరగంట సేపు కదలికలు వేగంగా ఉండే వ్యాయామం చేస్తే జీవక్రియల వేగమూ పెరుగుతుంది. నిత్యం తాగే కాఫీ, టీ లకు బదులుగా గ్రీన్ టీ లేదా ఊలాంగ్ టీ లను తాగితే మన శరీర మెటబాలిజం 4 నుంచి 5 శాతం వరకు పెరుగుతుంది. అందుకనే గ్రీన్ టీ తాగితే త్వరగా బరువు తగ్గుతారు.
రాత్రిపూట రోజుకి 6-7 గంటలు నిద్రపోవటం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆలస్యంగా పడుకొని, తగినంత నిద్రపోనివారిలో ఒత్తిడి పెరగటమే కాదు, శరీరంలో అవయవాల చుట్టూ కొవ్వు పేరుకుంటుంది. చాలామంది బరువు తగ్గించుకోవటానికి ఉపవాసాలు చేయటం వల్ల జీవక్రియల వేగం మందగించి, శరీరంలో కొవ్వు పేరుకుపోవటానికి దోహదం చేస్తుంది. పీచు పదార్థాలు ఎక్కువగా తినేవారిలో అధిక బరువు సమస్య తగ్గించుకోవచ్చు. కొవ్వును కరిగించే వేగం పెరుగుతుంది. రోజుకి సుమారు 25 గ్రాముల చొప్పున మూడుసార్లు పండ్లు, కూరగాయలు తినటం మరవరాదు. అలాగే రోజుకి 70 గ్రాములకు తక్కువ కాకుండా ప్రోటీన్లనూ తీసుకోవాలి. ఇవి రక్తంలోకి ఇన్స్‌లిన్ స్రావాన్ని నియంత్రించి, జీవక్రియలకు ఉత్తేజాన్నిస్తాయి.