అతి నిద్ర కారణంగా గుండె జబ్బుల ప్రమాదం?

వారాంతంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ గంటలు నిద్రపోయేవారిలో గుండె పనితీరు దెబ్బతింటుందని తేలింది. నిద్ర తక్కువ కావడం వల్ల కంటే అతిగా నిద్రపోవడం వల్ల ఎక్కువ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

అతి నిద్ర కారణంగా గుండె జబ్బుల ప్రమాదం?

More Than 10 Hours of Sleep Increases Heart Disease Risk

అతిగా నిద్రపోవడం వలన అనేక దీర్ఘకాలిక ప్రభావాలు ఉండవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. గుండె జబ్బులు, ఊబకాయం, డిప్రెషన్, తలనొప్పి మరియు టైప్ 2 మధుమేహం ఎక్కువగా నిద్రపోవడంతో సంబంధం కలిగి ఉంటాయి. అతిగా నిద్రపోయే వారిలో 49శాతం మందికి గుండె సంబంధి వ్యాధులు వచ్చే ప్రమాదముందని ఒక అధ్యయనంలో తేలింది. రోజుకు 10 గంటలకు మించి నిద్రపోయే వారికి మరణించే ముప్పు 41శాతం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఎక్కువ నిద్రపోవడం లేదా తక్కువ నిద్రపోవడం ఈ రెండింటి వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపుతాయి. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి 8 గంటల నిద్ర అవసరమని డాక్టర్లు చెబుతుంటారు. అయితే వయసుని బట్టి మనం నిద్రపోయే సమయం ఆధారపడుతుంది. వయస్సును బట్టి రోజుకు ఎన్ని గంటలు నిద్ర పోవాలనేది మారుతుంటుంది. శిశువులు 18-20 గంటల పాటు కచ్చితంగా నిద్రపోవాలి. స్కూలుకు వెళ్లే పిల్లలకు 9-10 గంటలు నిద్రపోవాలి. 20 ఏళ్ల దాటిన తర్వాత 8గంటల పాటు నిద్రకు కేటాయించాలి. వృద్ధులైతే ఆరు గంటల పాటు సరిపోతుందని వైద్యులు చెబుతున్నారు.

చాలామంది ఖాళీగా ఉన్నాం కదా అని ఎక్కువగా నిద్రపోతుంటారు. వారాంతాల్లో ఓవర్ స్లీపింగ్ మానుకోండి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చేసిన ఒక అధ్యయనం ప్రకారం, వారాంతంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ గంటలు నిద్రపోయేవారిలో గుండె పనితీరు దెబ్బతింటుందని తేలింది. నిద్ర తక్కువ కావడం వల్ల కంటే అతిగా నిద్రపోవడం వల్ల ఎక్కువ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

పగటిపూట మిమ్మల్ని మెలకువగా ఉంచడంలో సహాయపడటానికి, హైడ్రేటెడ్ గా ఉండటానికి నీరు బాగా త్రాగండి. అయినా మగతగా అనిపిస్తే చిన్న చిన్న వ్యాయామాలు చేయండి. వ్యాయామం మానసిక స్థితిని సమతుల్యం చేస్తుంది. ఓవర్ స్లీపింగ్ ను ఆపటానికి నిద్రవేళను, మేల్కొనే సమయాన్ని సెట్ చేసుకోవాలి. నిద్రకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించుకోవాలి. తద్వారా ప్రశాంతంగా నిద్రించేందుకు అవకాశం ఉంటుంది.

ఆరోగ్యకరమైన ఆహారం నిద్రపై ప్రభావం చూపిస్తుంది. పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల మెదడు నిద్రకు అవసరమైన న్యూరోట్రాన్స్‌మిటర్‌లను ఉత్పత్తి చేస్తుంది.