Snoring : గురక సమస్యా?…నిర్లక్ష్యం వద్దు..ప్రాణాంతకం కావచ్చు?..

ఊబకాయం అనేది గురకకు అతిపెద్ద ప్రమాద కారకాల్లో ఒకటి. అధిక బరువు, ఊబకాయం ఉండటం వల్ల ఎగువ శ్వాసనాళంలో ఎక్కువ కొవ్వు పేరుకుపోతుంది,

Snoring : గురక సమస్యా?…నిర్లక్ష్యం వద్దు..ప్రాణాంతకం కావచ్చు?..

Snoring

Updated On : February 17, 2022 / 2:36 PM IST

Snoring : నిద్రించే సమయంలో గురక పెట్టే అలవాటు చాలా మందిలో ఉంటుంది. అందరి ఇళ్ళల్లో ఎవరో ఒకరు గురక సమస్యతో బాధపడుతుంటారు. గురుక పెడుతున్న విషయం కుటుంబసభ్యులు చెప్పేంత వరకు వారు తెలుసుకోలేరు. గురుక పెడుతున్నావని చెబితే ఒక పట్టాన చాలా మంది నమ్మరు. రాత్రి సమయంలో గురకపెట్టేవారి పక్కన నిద్రించే ఇతర కుటుంబసభ్యులకు సరిగా నిద్రపట్టదు. నిద్రాభంగం వాటిల్లుతుంది. గురకనే వైద్య పరిభాషలో అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అంటారు. గురక అనేది ఒక సాధారణ శ్వాస రుగ్మత. నిద్రించే సమయంలో బిగ్గరగా వచ్చే శబ్ధంతో దీనిని సులభంగా గుర్తించవచ్చు.

ఇలా బిగ్గరగా గురక పెట్టడం అనేది మీ శరీరంలో సమస్యకు ఇది ఒక సంకేతంగా చెప్పవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో అది ప్రాణాంతకంగా పరిణమించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్రలో ఎగువ వాయుమార్గం నిరోధించబడినప్పుడు గురక వస్తుంది. దీని వల్ల డయాఫ్రాగమ్ , ఛాతీ కండరాలు ఊపిరితిత్తులలోకి గాలిని లాగేందుకు వాయుమార్గాన్ని తెరవడానికి కష్టతరంగా మారుతుంది. కొన్నిసార్లు నిద్రించే వ్యక్తి ఒక్క క్షణం శ్వాసను ఆపివేయవచ్చు..ఆతరువాత మరలా బిగ్గరగా కుదుపుతో ఊపిరి పీల్చుకోవడంతో తిరిగి శ్వాస పీల్చుకోవటం వంటివి చోటు చేసుకుంటాయి. చాలా మందిలో ఇలాంటి పరిస్ధితే ఉంటుంది.

ఊబకాయం, టాన్సిల్స్ సమస్య,ఎండోక్రైన్ రుగ్మతలు లేదా గుండె వైఫల్యం వంటి ఆరోగ్య సమస్యలు దీనికి కారణం కావచ్చు. అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు వంటి అంతర్లీన దీర్ఘకాలిక వ్యాధుల సూచనకు ముందస్తుగా గురక సంకేతాలుగా కూడా భావించ్చని నిపుణులు చెబుతున్నారు. గురక వచ్చేవారు తక్కువ ఆయుర్దాయాన్ని కలిగి ఉంటారని, ఇది దీర్ఘాయువును తగ్గిస్తుందని పలు పరిశోధనల్లో తేలింది.

పెద్ద శబ్ధంతో కూడిన గురకతో పాటు బాధపడుతున్న వ్యక్తిలో అనేక లక్షణాలు కనిపిస్తాయి. పగటిపూట నిద్రపోవడం, నోరు పొడిబారడం, గొంతునొప్పితో మేల్కొనటం, ఉదయం తలనొప్పి, ఏకాగ్రత కోల్పోవటం, డిప్రెషన్, చిరాకు వంటివి కనిపిస్తాయి. తరచుగా అధిక రక్తపోటుతో బాధపడటం, నిద్రలో ఊపిరి ఆగిపోవడం, ఉక్కిరిబిక్కిరి కావటం వల్ల ఆకస్మికంగా మేల్కోవటం వంటివి జరుగుతుంటాయి.

మహిళల్లో కంటే పురుషుల్లో ఈ గురక సమస్య ఎక్కవగా ఉంటుంది. ఒక పరిశోధనా ప్రకారం, పట్టణాల్లో నివశించే పెద్దవారిలో 13.7%, మధ్య వయస్కులలో 7.5% గురక సమస్య ఉన్నట్లు తేలింది. ఇటీవలి అధ్యయనాలు భారతీయులు తరచుగా నిద్రలేమితో బాధపడుతున్నారని, వీరిలో గురక సమస్య పెరుగుతుందని తేలింది. మహిళల్లో గురక లక్షణాలలో స్వల్ప తేడాలు ఉంటాయి. ముఖ్యంగా వృద్ధులు ,ఊబకాయం ఉన్నవారు గురకతో బాధపడుతున్నారని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఊబకాయం అనేది గురకకు అతిపెద్ద ప్రమాద కారకాల్లో ఒకటి. అధిక బరువు, ఊబకాయం ఉండటం వల్ల ఎగువ శ్వాసనాళంలో ఎక్కువ కొవ్వు పేరుకుపోతుంది. ఇది సాధారణ శ్వాసకు అంతరాయం కలిగిస్తుంది. గురకతో బాధపడుతున్న వారిలో దాదాపు 60-70% మంది ఊబకాయంతో బాధపడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. గురక సమస్యకు చికిత్స చేయకుండా వదిలేస్తే మాత్రం కొన్ని సందర్భాల్లో మరణం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మనదేశంలో చాలా మంది గురకను పెద్దగా పట్టించుకోరు. అదేంపెద్ద సమస్యకాదని నిర్లక్ష్యం చేస్తుంటారు. గురక సమస్యతో బాధపడుతున్నవారిలో కేవలం 2% మంది మాత్రమే వైద్యులను సంప్రదిస్తున్నారు. పని ఒత్తిడి, జీవనవిధానం, అనారోగ్య జీవనశైలి కారణంగా నిద్రలేమి ఏర్పడుతుంది. చివరకు ఇది గురకసమస్యను మరింత పెంచుతుంది.

అపోహాలు ఎన్ని ఉన్నప్పటికీ పరిస్థితి తీవ్రతను బట్టి గురక సమస్యకు చికిత్స తప్పనిసిరి. ముందస్తుగా గుర్తించడం వల్ల పరిస్థితి మరింత దిగజారకుండా కాపాడుకోవచ్చు. ప్రస్తుతం దీనిని తగ్గించే మందులు , చికిత్సలు ఉన్నాయి. కాబట్టి సమస్యను గుర్తించిన వెంటనే వైద్యుల వద్ద వెళ్ళి వారి సూచనలు , సలహాలు పాటించటం వల్ల ప్రయోజనం ఉంటుంది.