Exchange Old Currency Notes : చిరిగిన, పాడైన కరెన్సీ నోట్లను ఎలా మార్చుకోవాలో తెలుసా?
మీ ఇంట్లో చిరిగిన, పాడైన నోట్లు చాలా ఉండిపోయాయా? బ్యాంకులో ఎలా మార్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఈ స్టోరీ చదవండి.

Exchange Old Currency Notes
Exchange Old Currency Notes : వర్షంలో తడవడం వల్ల, ప్రమాదాల్లో కాలిపోవడం, చినిగిపోవడం వల్ల కరెన్సీ నోట్లు పనికిరాకుండా పోతాయి. వీటిని బ్యాంకుల్లో మార్చుకునే అవకాశం ఉంది. అయితే ఎలాంటి నోట్లను బ్యాంకులు తీసుకుంటాయి? దానికి ఉన్న నిబంధనలు ఏంటి?
ప్రయాణాల్లో, షాపింగ్‌లో కరెన్సీ నోట్ చిన్నగా చిరిగినా తీసుకోరు. ఒక్కోసారి మనం చూసుకోకుండా కూడా చిరిగిన నోట్లను ఇంటికి తెచ్చేస్తుంటాం. తిరిగి వాటిని ఎవరూ తీసుకోరు. అలా చాలా నోట్లు ఇంట్లో ఉండిపోతుంటాయి. అయితే వాటిని ఎలా మార్చుకోవాలి? రోజుకి 20 నోట్ల చొప్పున రూ.5000 మించని నోట్లను బ్యాంకులో మార్చుకునే అవకాశం ఉంది. అంతకు మించిన సొమ్మును మార్చుకోవాలంటే 2015 జూలైలో విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తారు.
చిరిగిపోయిన, పాడైన నోట్లు, నాణేలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాస్టర్ డైరెక్షన్స్ రిలీజ్ చేసింది. దీని ప్రకారం దేశంలోని అన్ని ప్రాంతాల్లోని బ్యాంకులు పాడైన నోట్ల మార్పిడికి అనుమతించడంతో పాటు ఎలాంటి వివక్ష చూపకూడదు. తమ వద్ద ఇలాంటి నోట్లను మార్పిడి చేసుకునే సౌలభ్యం ఉందని ప్రజలకు ప్రకటనలు, బోర్డుల ద్వారా తెలియజేయాల్సి ఉంటుంది.
Mobile Phone : ఫోన్ కవర్లో కరెన్సీ నోట్లు పెట్టే అలవాటు ఉందా? వెంటనే తీసేయండి.. లేదంటే?
కరెన్సీ నోట్లు మార్పిడి విషయంలో కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. నోటు రెండు కంటే ఎక్కువ ముక్కలు అయి ఉండకూడదు. అలాగే దాని మీద ఉండే అతి ముఖ్యమైన ఫీచర్లు చెరిగిపోయి ఉండకూడదు. నోటుకి సంబంధించిన నంబర్ ఖచ్చితంగా ఉండి తీరాలి. చిరిగిన నోటు ముక్కలు ఒకే నోటువి అయి ఉండాలి. ఇక నోట్లపై పెన్నుతో, పెన్సిల్ తో రాతలు ఉన్నా వాటిని తీసుకునేందుకు అనుమతి ఇస్తారు. కానీ ఆ రాతలు మతపరంగా, పొలిటికల్ గా ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మార్పిడికి అంగీకరించరు.
ఇక పాడైన, చినిగిన నోట్లను బ్యాంకులు మార్పిడికి అంగీకరించని పక్షంలో కస్టమర్లు ఫిర్యాదు చేయవచ్చును. ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించవచ్చు. లేదంటే ఫిర్యాదును https://cms.rbi.org.in లో ఫైల్ చేయవచ్చు. లేదంటే సెంట్రలైజ్డ్ రిసీట్ అండ్ ప్రాసెసింగ్ సెంటర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 4 వ అంతస్తు, సెక్టార్ 17, చండీగఢ్-160017 అడ్రస్‌కి మీ ఫిర్యాదుకు సంబంధించిన పూర్తి వివరాలు జత చేస్తూ లేఖ రాయవచ్చు.