Zoonotic : పెంపుడు జంతువులతో అప్రమత్తత లేకుంటే… జూనోటిక్ వ్యాధుల ముప్పు తప్పదా?

పశువులు, జంతువులు, పక్షులు, కోళ్ళకు కాలానుగుణంగా ఇవ్వవలసిన వ్యాధి నిరోధక టీకాలను తప్పనిసరిగా వేయించాలి.

Zoonotic : పెంపుడు జంతువులతో అప్రమత్తత లేకుంటే… జూనోటిక్ వ్యాధుల ముప్పు తప్పదా?

Zoonotic

Updated On : October 30, 2021 / 11:23 AM IST

Zoonotic : మనిషి మనుగడలో పశువులు, జంతువులు ఓ భాగమైపోయాయి. జీవనోపాధి కోసం జంతువుల పెంపకం చేపట్టేవారు కొందరైతే, మరికొందరు ఆసక్తితో జంతువులను పెంచుతుంటారు. కొన్ని జంతువులు మనకు కావాల్సిన పాలు, గుడ్లు, మాంసం, వంటి పౌష్టికాహారాన్ని అందిస్తూ ఆరోగ్యాన్ని పంచుతూ మేలు చేస్తున్నాయి. అయితే అదే క్రమంలో వాటి వల్ల కొన్ని సమస్యలు , ప్రమాదాలు లేకపోలేదు. పెంపుడు జంతువులతో సన్నిహితంగా మెలిగే సందర్భంలో ఊహించని విధంగా కొన్ని వ్యాధులు మనుషులకు సంక్రమిస్తున్నాయి. వీటి వల్ల చివరకు ప్రాణాల మీదకు కొని తెచ్చుకోవాల్సిన పరిస్ధితి తలెత్తుతుంది.

కుక్కలు, పిల్లులు, పక్షులు, పశువులను ప్రాణంగా, ఇంట్లో కుటుంబ సభ్యుల్లా చూసుకునేవారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారు జంతువుల నుంచి సక్రమించే జూనోటిక్ వ్యాధులుపై అవగాహన కలిగి ఉండటం మంచిది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటి వరకు 250 జునోటిక్ వ్యాధులను గుర్తించింది. అందులో 130 సూక్ష్మ జీవుల వల్ల, 60 పరాన్న జీవుల వల్ల మిగిలినవి వైరస్ వల్ల వ్యాపిస్తాయి. అలాంటి వ్యాధుల్లో అధికశాతం కుక్కల వల్ల వచ్చే వ్యాధి రేబిస్. ఇది ప్రాణాంతమైనది. 80 శాతం కుక్క కరవడం వల్ల, 5 శాతం పిల్లుల వల్ల, 3శాతం నుంచి 4శాతం క్రూర జంతువుల వల్ల, రెండు శాతం ఇతర జంతువుల వల్ల ఈ వ్యాధి వచ్చే ఆస్కారముంది.

రానున్న కాలంలో 75% కొత్త వ్యాధులు జంతువుల ద్వారానే సంక్రమించే అవకాశాలున్నాయని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సహా పలు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపధ్యంలో జూనోటిక్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన ఆవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవా, ఫంగస్, క్లామిడే వంటి జీవుల వలన ఈ జూనోటిక్ వ్యాధులు వస్తాయి. గాలి, నీరు, ఆహారం, జంతు ఉత్పత్తులను వినియోగించటం ద్వారా వ్యాధి సంక్రమణ జరుగుతుంది.

ఏయే జంతువుల కారణంగా ఎలాంటి వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందో పరిశీలిస్తే..పిచ్చి కుక్క కాటు వలన ర్యాబిస్, కుక్క పిల్లలతో ఆడే వారికి టాక్సో కారియాసిస్, లెప్టో స్పైరోసిస్ వ్యాధి…, కుక్కలను, లేగ దూడలను తాకినప్పుడు గజ్జి, చర్మ వ్యాధులు…పందులు, దోమల వలన మెదడు వాపు వ్యాధి,…అపరిశుభ్రమైన పాలు, గ్రుడ్లు, మాంసం వల్ల బ్రూసెల్లోసిస్,..పందికొక్కులు, ఎలుకల వలన ప్లేగు,టైఫస్, లిస్టీరియా,హిస్టోప్లాస్మా,..పశువులతో సన్నిహితంగా మెలగటం క్షయ వ్యాధి,..ఉన్ని, తోళ్ళ పరిశ్రమలో పనిచేసే వారికి, కబేళా కార్మికులు, పశు వైద్య సిబ్బంది, అటవీ సిబ్బంది, వేటగాళ్ళకు ఆంత్రాక్స్, బ్రూసెల్లోసిస్, గ్లాండర్స్, లెప్టో స్పైరోసిస్, టెటనస్, క్యూ ఫీవర్, సాల్మొనెల్లోసిస్, జపనీస్ ఎన్ సెఫలైటిస్, రిలాప్సింగ్ ఫీవర్, టి.బి, విబ్రియోసిస్, ఎరిసెఫలాయిడ్, పాశ్చురెల్లోసిస్, హెర్పిస్ మొదలైనవి,..కోళ్ళ ద్వారా రాణికెట్, సిట్టకోసిస్, సాల్మొనెల్లోసిస్, బర్డ్ ఫ్లూ, న్యూ కాస్టల్ డిసీజ్, ట్యుబర్ క్యులోసిస్,..గొర్రెలు-మేకల వలన ఆంత్రాక్స్, క్యూ ఫీవర్, బ్రూసెల్లోసిస్, సార్కో సిస్టిస్, లిస్టీరియా, మేంజ్ మొదలైనవి సంక్రమిస్తాయి.

వ్యాధులు సంక్రమించకుండా ఉండాలంటే…

పశువులు, జంతువులు, పక్షులు, కోళ్ళకు కాలానుగుణంగా ఇవ్వవలసిన వ్యాధి నిరోధక టీకాలను తప్పనిసరిగా వేయించాలి. పాడి పశువులను, జంతువులను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. పౌల్ట్రీ ఫారాలు, జంతు ప్రదర్శన శాలలు, సర్కస్ కంపెనీలలో పనిచేసే వారు, డైరీ ఫారాలలో పనిచేసే వారు, పశు పోషకులు, జంతు ప్రేమికులు వ్యక్తిగత పరి శుభ్రతపై ఎక్కువ శ్రద్ధ చూపాలి. మాస్క్ ధరించటం మంచిది. జంతు ఆవాసాలను అప్పుడప్పుడు క్రిమిసంహారకాలతో శుభ్రం చెయ్యాలి. వ్యాధి సోకిన పశువుల పాలను సేవించకూడదు. పూర్తిగా ఉడికిన మాంసాన్ని మాత్రమే తినాలి.వ్యాధి సోకిన జంతువులు, కోళ్ళ మాంసం తినకూడదు.

జంతువులపట్ల ప్రేమగా ఉండవచ్చుకాని అలాగని జాగ్రత్తలు పాటించకుండా వ్యవహరించటం మన ప్రాణాల మీదకు కొనితెచ్చుకోవటమే అవుతుంది. కాబట్టి పెంపుడు జంతువుల విషయంలో జాగ్రత్త చర్యలు పాటిస్తే ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు పరిణమించదు.