Peddapalli Mp Bjp Candidate : పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఎవరు? వీడని ఉత్కంఠ

తెలంగాణలో 17 లోక్ సభ స్థానాల అభ్యర్థులగాను 16 మందికి బీఫారం అందచేసింది బీజేపీ. ఒక్క పెద్దపల్లి టికెట్ ను మాత్రమే పెండింగ్ లో పెట్టింది.

Peddapalli Mp Bjp Candidate : పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఎవరు? వీడని ఉత్కంఠ

Updated On : April 24, 2024 / 7:15 PM IST

Peddapalli Mp Bjp Candidate : పెద్దపల్లి లోక్ సభ బీజేపీ అభ్యర్థిపై ఇంకా ట్విస్ట్ కంటిన్యూ అవుతోంది. బీజేపీ ఎంపీ అభ్యర్థిపై ఇంకా తర్జనభర్జన నడుస్తోంది. నామినేషన్ దాఖలుకు మరో రోజు సమయం మాత్రమే మిగిలుంది. ఇంకా గోమాస శ్రీనివాస్ కు బీఫారం అందలేదు. షెడ్యూల్ ప్రకారం నేడు గోమాస శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. కానీ, ఇప్పటివరకు బీజేపీ బీఫారం ఇవ్వకపోవడంతో నామినేషన్ దాఖలు చేయలేదు గోమాస శ్రీనివాస్. పెద్దపల్లి బీజేపీ అభ్యర్థిని మారుస్తారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. గోమాస స్థానంలో పెద్దపల్లి ఎంపీ టికెట్ ను సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్ నేతకు ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. వెంకటేశ్ నేతతో ఇప్పటికే బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో 17 లోక్ సభ స్థానాల అభ్యర్థులగాను 16 మందికి బీఫారం అందచేసింది బీజేపీ. ఒక్క పెద్దపల్లి టికెట్ ను మాత్రమే పెండింగ్ లో పెట్టింది. గోమాస శ్రీనివాస్ ను హోల్డ్ లో పెట్టారని తెలుస్తోంది.

మరోవైపు పెద్దపల్లి టికెట్ పై ఎలాంటి చర్చ జరగలేదన్నారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిని మారిస్తే కచ్చితంగా సమాచారం ఇస్తామన్నారు. నామినేషన్ దాఖలుకు ఇంకా రేపు కూడా సమయం ఉందన్న లక్ష్మణ్.. అభ్యర్థికి బీఫారం ఇస్తామని, ఎలాంటి చింత అవసరం లేదని తేల్చి చెప్పారు.

నామినేషన్ల దాఖలుకు రేపే చివరి గడువు. అయినప్పటికీ పెద్దపల్లి టికెట్ ను పెండింగ్ లో పెట్టింది బీజేపీ. వాస్తవానికి రెండో జాబితాలోనే పెద్దపల్లి లోక్ సభ స్థానానికి గోమాస శ్రీనివాస్ ను అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ. కానీ, ఇంతవరకు బీఫారం మాత్రం ఇవ్వలేదు. ఇంకా పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిపై పార్టీలో తర్జనభర్జన నడుస్తోంది. ఇప్పటివరకు గోమాస శ్రీనివాస్ కు భీపారం ఇవ్వకపోవడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పెద్దపల్లి సీటును మాత్రమే పెండింగ్ లో ఎందుకు పెట్టారు? అనేది హాట్ టాపిక్ గా మారింది. గోమాస శ్రీనివాస్ ను మార్చాలా? వద్దా? అన్నదానిపై క్షేత్రస్థాయి నుంచి అభిప్రాయ సేకరణ చేసింది బీజేపీ అధిష్టానం.

ఆ తర్వాత గోమాసకు పంపాల్సిన పార్టీ మెటీరియల్ ను, ఇతర సహాయసహకారాలు పూర్తిగా ఆపివేయడం జరిగింది. ఆ జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షుల ద్వారా ప్రచారం నిర్వహిస్తోంది బీజేపీ. బీజేపీ పార్టీకి, మోదీకి ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు తప్ప అభ్యర్థి పేరుతో చేయడం లేదు. అభ్యర్థి పేరు మీదన్న జెండాలు, కరపత్రాలను బీజేపీ కేడర్ ఎక్కడా వాడటం లేదు. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిని మారుస్తారు అనే వార్తలకు బలం చేకూర్చేలా బీజేపీ చర్యలు ఉన్నాయని చెప్పొచ్చు. ఇప్పటివరకు గోమాసకు భీపారం ఇవ్వకపోవడం, పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్ నేతతో చర్చలు జరపడం డిస్కషన్ కు దారితీసింది.

Also Read : అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా: సీఎం రేవంత్ సవాల్ స్వీకరించిన హరీశ్ రావు